మరో 21 మందికి పాజిటివ్..1082కి చేరిన కరోనా కేసులు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ర్టంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మలక్‌‌పేట్ మార్కెట్‌‌ కేంద్రంగా వైరస్ వ్యాపించడంతో గడిచిన నాలుగు రోజుల్లోనే 66 కేసులు నమోదయ్యాయి. ఆదివారం మరో 21 మందికి పాజిటివ్ వచ్చింది. ఇందులో 20 కేసులు గ్రేటర్ హైదరాబాద్‌‌లో, ఒక కేసు జగిత్యాలలో నమోదైంది. సుమారు 15 రోజుల తర్వాత జగిత్యాలలో కేసు రికార్డయింది. వీటితో కలిపి రాష్ర్టంలో కరోనా బాధితుల సంఖ్య 1,082కి చేరింది. ఇందులో 29 మంది మరణించారు.

డిశ్చార్జ్‌‌లు ఎక్కువ.. యాక్టివ్‌‌లు తక్కువ

రాష్ర్టంలో కరోనా బారిన పడ్డవారిలో 50.36 శాతం మంది పూర్తిగా  కోలుకున్నట్టు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. మొత్తం 1,082 మందిలో శనివారం నాటికి 499 మంది డిశ్చార్జ్ కాగా, ఆదివారం మరో 46 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జ్‌‌ల సంఖ్య 545కు చేరింది. మరో 508 మంది వివిధ దవాఖాన్లలో చికిత్స పొందుతున్నారు.

17 జిల్లాల్లో 14 రోజులుగా నిల్

రాష్ర్టంలోని 17 జిల్లాల్లో 14 రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌ డాక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. ఇందులో కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌‌నగర్‌‌‌‌, మెదక్‌‌, సంగారెడ్డి, భూపాల్‌‌పల్లి, నాగర్‌‌‌‌కర్నూల్‌‌, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, వికారాబాద్‌‌, నల్గొండ, నారాయణ్​పేట్ జిల్లాలు ఉన్నాయి. 14 రోజులుగా జగిత్యాలలో కేసులు లేవని శనివారం వైద్యారోగ్యశాఖ ప్రకటించగా.. ఆదివారం ఓ కేసు నమోదవడం గమనార్హం.

Latest Updates