పాఠశాలలో ర్యాగింగ్.. విద్యార్ధి ఆత్మహత్య యత్నం

10th-class-student-attempt-to-suicide-because-of-ragging

హైదరాబాద్: ర్యాగింగ్ భూతం కాలేజీల నుంచి స్కూళ్లకు పాకింది. తన తోటి విద్యార్ధులు ర్యాగింగ్ చేయడంతో భయాందోళనకు గురై ఓ పదవ తరగతి విద్యార్ధి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన నగరంలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కర్మాన్ ఘాట్ లోని ” నియో రాయల్ ” స్కూల్ లో 10 వ తరగతి చదువుతున్న రవికిరణ్ ను తోటి విద్యార్థులు ర్యాగింగ్ చేసి డబ్బులు తీసుకొని రావాలని బెదిరించారు. దీంతో ఆ బాలుడు తల్లిదండ్రులకు తెలియకుండా ఇంట్లో నుంచి 6000 రూపాయలు తీసుకెళ్లి వారికి ఇచ్చాడు. మళ్లీ డబ్బులు తేవాలని వారు బెదిరిచడంతో.. ఆ విద్యార్ధి  దిక్కు తోచక స్కూల్ ప్రిన్సిపాల్ కు తన బాధను చెప్పుకొని, వారిపై ఫిర్యాదు చేశాడు.

అతని ఫిర్యాదుపై స్కూల్ యాజమాన్యం పట్టించుకోకపోవడం,  ఆ విద్యార్ధుల వేధింపులు భరించలేకపోవడం.. ఇవన్నీ ఆ విద్యార్ధిని మానసికంగా కుంగదీశాయి. దీంతో రవికిరణ్ సూసైడ్ లెటర్ రాసి ఉరి వేసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. సమయానికి అతని తల్లిదండ్రులు గుర్తించడంతో అతన్ని వెంటనే సమీపంలో ఉన్న ఎల్బీనగర్ లోని గ్లోబల్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటనతో రవికిరణ్ తల్లిదండ్రులు  పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. పాఠశాలలో వేధింపులు జరుగుతున్నా , ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. జరిగిన సంఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు.

Latest Updates