పది ఆన్సర్​ షీట్స్​ పోయి.. దొరికినయ్​   

మొన్నటి ఇంటర్​ఫలితాల గందరగోళం… ఇటీవల వరంగల్​లో పోలీస్​ స్టేషన్​నుంచి ప్రశ్నపత్రాల మిస్సింగ్​ ఘటనలు మరవక ముందే ఈసారి పోస్టల్​శాఖ నిర్లక్ష్యంతో ఆన్సర్​ షీట్స్​ కనిపించకుండా పోయాయి. రెండు రోజుల తర్వాత రోడ్డు పక్కనే అవి దొరకడం గమనార్హం. ఆ సంచికి వేసిన సీల్​ అలాగే ఉండడంతో ఆఫీసర్లు ఊపిరి పీల్చుకున్నారు.

పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన స్లూడెంట్లకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ఎస్సెస్సీ బోర్డు నిర్వహిస్తోంది. ఈ నెల పదో తేదీ సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా కాగజ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర, ప్రభుత్వ బాలికల హై స్కూళ్లతోపాటు మరో స్కూల్​లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. సోమవారం మూడు కేంద్రాల్లో కలిపి 65 మంది స్టూడెంట్లు పరీక్ష రాశారు. వీరిలో తెలుగు 40 మంది, హిందీ 24 మంది, ఉర్దూ స్టూడెంట్​ఒకరు ఉన్నారు. ఈ పరీక్ష ముగిసిన తర్వాత సంబంధిత పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరిండెంట్లు హనుమంతరావు, శంకరయ్య, వరలక్ష్మి స్టూడెంట్ల ఆన్సర్​ షీట్స్​ సంచుల్లో సీల్ చేసి పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలోగల పోస్ట్ ఆఫీస్ లో అందజేశారు. పోస్టల్ సిబ్బంది బండిల్స్ ను తరలించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. నిబంధనల ప్రకారం పోస్టల్ శాఖ పోస్ట్​మాస్టర్​ఈ బండిల్స్ ను దగ్గరుండి రైలులో మంచిర్యాలకు పార్సిల్ తరలించాల్సి ఉంటుంది. ఇక్కడే పోస్టల్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శించారు. మొత్తం 13 బండిల్స్ పోస్ట్ ఆఫీస్ నుంచి బయలుదేరగా రైలులో 12 బండిల్స్ మాత్రమే పంపించారు. మిస్ అయిన ఒక బండిల్ కోసం సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా వెతికారు. మంగళవారం సాయంత్రం వరకు బండిల్ లభించకపోవడంతో చివరకు విధిలేక పోస్ట్​మాస్టర్​ హరిదాస్ సర్దార్ పట్టణ పోలీస్ స్టేషన్లో జవాబు పత్రాల బండిల్ మిస్ అయిందని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

రోడ్డు మీద దొరికింది
జవాబు పత్రాల గల్లంతు విషయం బుధవారం అందరికీ తెలియడంతో పోలీసులు, పోస్టల్ సిబ్బంది గాలింపు ముమ్మరం చేశారు. చివరకు బుధవారం మధ్యాహ్నం జవాబు పత్రాల సంచి దొరికింది. సోమవారం సాయంత్రం పేపర్ బండిల్స్ తరలిస్తున్న సమయంలో గాలిదుమారం రావడంతో అందులోని సంచి ఒకటి మిస్ అయిందని, స్థానిక రైల్వే గెస్ట్ హౌస్ సమీపంలో రోడ్డు పక్కన దొరికిన ఈ సంచిని కాలనీకి చెందిన రైల్వే ఉద్యోగి తన ఇంట్లో భద్రపరిచి సమాచారం అందించడంతో స్వాధీనపరచుకొన్నట్లు పోలీసులు తెలిపారు.

ఆన్సర్​ షీట్స్​ సేఫ్​
సోమవారం సాయంత్రం పోస్టల్ సిబ్బంది తరలిస్తున్న సమయంలో గల్లంతైన జవాబు పత్రాల బండిల్ దొరికింది. పోస్టల్ సిబ్బంది, ఆఫీసర్ల బాధ్యతారాహిత్యం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా విద్యాశాఖ ఆఫీసర్​బిక్షపతి, సంబంధిత పరీక్ష కేంద్రాల చీ ఫ్ సూపరిండెంట్ల సమక్షంలో ఆ బండిల్ ను పరిశీలించాం. వేసిన సీల్ వేసినట్లుగా ఉంది. సంబంధిత బండిల్ ను పోస్టల్ శాఖకు హ్యాండోవర్​ చేస్తున్నాం. పోస్టల్ శాఖ బాధ్యతారాహిత్యంపై పై ఆఫీసర్లకు నివేదిక అందిస్తాం. స్టూడెంట్లు ఆందోళనకు గురికావద్దు.

Latest Updates