కేన్సర్‌తో అమ్మ.. పక్షవాతంతో నాన్న మృతి.. ఒంటరైన పదేళ్ల కొడుకు

  • పది రోజుల గ్యాప్‌లో చిన్నారిని అనాథను చేసిన విధి
  • రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దలింగాపూర్‌లో విషాదం

దేవుడు ఆ పిల్లాడిని చిన్న చూపు చూశాడు.. పదేళ్ల వయసులో పెద్ద కష్టం తెచ్చిపెట్టాడు. గట్టిగా పది రోజుల గ్యాప్‌లో అమ్మానాన్నలిద్దరినీ దూరం చేశాడు. లోకం తెలియని ఆ పసివాడిని ఒంటరిని చేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో జరిగిన ఈ విషాదం ప్రతి ఒక్కర్నీ కలచి వేస్తోంది. తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో అనాథగా మారిన పిల్లాడిని చూసి ఆ గ్రామంలో కంటతడి పెట్టనివారు లేరు.

పెద్దలింగాపూర్ గ్రామంలో నివసిస్తున్న శీలం దుర్గయ్య, రేణవ్వ దంపతులకు వివేక్ (10) ఒక్కగానొక్క కొడుకు. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. కూలీనాలీ చేసి గ్రామంలోని సర్కారీ బడిలో వివెక్‌ని నాలుగో తరగతి చదివిస్తున్నారు. ఆ కుటుంబాన్ని అనుకోకుండా పెను విషాదం వెంటాడింది. బ్లడ్ కేన్సర్ కారణంగా వివేక్ తల్లి రేణవ్వ తొమ్మిది రోజుల క్రితం మరణించింది. అంతలోనే పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి దుర్గయ్య శనివారం ఉదయం కన్నుమూశాడు. అమ్మానాన్న చనిపోయన విషాదంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయాడు ఆ చిన్నారి. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటంటూ ఊరి జనమంతా జాలి చూపిస్తున్నారు.

Latest Updates