వయసు 11.. ప్రదర్శనలు 225

11 years girl performs 225 kuchipudi dance shows

డ్యాన్స్​ అంటే ఆమెకు చాలా ఇష్టం. ఆ ఇష్టమే.. ఆమెను పదకొండేళ్ల వయసులోనే 225 ప్రదర్శనలు ఇచ్చేలా చేసింది. ఆ ఇష్టమే ఎంతో మంది మెప్పు పొందేలా చేసింది. నీలారపు ధీరజ తన ఆరేళ్ల వయసు నుంచే డ్యాన్స్​ నేర్చుకోవడం మొదలుపెట్టింది. మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చింది.

నీలారపు ధీరజది వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండ. ఆరో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు అశోక్​,  శ్రీదేవి. ధీరజకు డ్యాన్స్​పై ఉన్న ఇష్టాన్ని గమనించి.. ఆమెకు నృత్యంలో శిక్షణ ఇప్పించారు. ఒకటో తరగతి చదివే వయస్సులోనే ఆమెను శ్రీకృష్ణ సంగీత శిక్షణాలయంలో చేర్పించారు. కొంపెల్లి భ్రమరాంబ ఆమెకు కూచిపూడి నేర్పించింది. ఈ చిన్నారి  చదువుతో పాటు డ్యాన్స్​లోనూ తనదైన ప్రతిభ చాటుతూ.. అందరి మన్ననలూ పొందుతోంది. ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు ఎన్నో అందుకుంది.

225 ప్రదర్శనలు

ధీరజ పదకొండేళ్ల వయసులోనే 225 కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో కూడా డ్యాన్స్​ చేసి అందరి మెప్పు పొందింది. అంతేకాకుండా గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. ధీరజ సినిమాల్లో కూడా డ్యాన్స్​ చేసి ఔరా అనిపించింది. 2015లో ఆక్టోబర్​లో విడుదలైన ‘సీతా శ్రీరాం’ సినిమాలో ఒక పాటలో కూచిపూడి డ్యాన్స్​ చేసింది. అంతేకాకుండా దూరదర్శన్​ యాదగిరి చానెల్​ నిర్వహించిన ఒక కార్యక్రమంలో కూడా డ్యాన్స్​ చేసింది. ఈ చిన్నారి వయసు చిన్నదే అయినా.. డ్యాన్స్​ పోటీల్లో పాల్గొని ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకుంది.

ఢిల్లీలో ప్రదర్శన

ఢిల్లీలో 2016 మార్చిలో వరల్డ్​ కల్చరల్​ ఫెస్టివల్​ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆర్ట్​ ఆఫ్​ లివింగ్​ సంస్థ వ్యవస్థాపకుడు పండిట్ ​రవిశంకర్​ ఆధ్వర్యంలో  జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా ధీరజ ప్రదర్శన ఇచ్చింది. ఈ ప్రదర్శనలో ఒకేసారి 1600 మంది దేశ విదేశాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడీ కూడా హాజరయ్యారు.

 

Latest Updates