చంద్రయాన్-2.. 110 వ ప్రయోగం

  • మామపై ఇప్పటిదాకా 109 ప్రయోగాలు
  • 90 ప్రయోగాలు 1958 నుంచి 1976 మధ్య జరిగినవే

చంద్రయాన్​ 2 ప్రయోగాన్ని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. అయితే, ఇప్పటిదాకా చందమామపై 109 ప్రయోగాలు జరిగాయి. మనం చేస్తున్న ఈ చంద్రయాన్​ 2 ప్రయోగం 110వది. ఈ పదేళ్లలో 11వ ప్రయోగం. ఇక, ఇప్పటిదాకా జరిగిన 109 ప్రయోగాల్లో 90 ప్రయోగాలు 1958 నుంచి 1976 మధ్య జరిగినవే. ఆ తర్వాత మాత్రం మొత్తం ప్రపంచం సైలెంట్​ అయిపోయింది. 1990 నుంచి మళ్లీ జాబిల్లిపై ప్రయోగాలు ఊపందుకున్నాయి. 2008లో చంద్రయాన్​ 1 ప్రయోగంతో మామపై నీటి జాడలున్నట్టు తేలింది. దీంతో మామపై ప్రయోగాలు మరింత ఊపందుకున్నాయి. ఒక్కసారి ఆ ప్రయోగాల్లో ఏమేం ఉన్నాయో ఒక్కసారి చదివేద్దాం.

ఫ్లైబైస్​: ఈ ప్రయోగంలో భాగంగా స్పేస్​క్రాఫ్ట్​లు చంద్రుడికి దగ్గరగా వెళ్లాయి. చంద్రుడి కక్ష్యలో మాత్రం తిరగలేదు. దూరం నుంచి చంద్రుడి స్థితిగతులను తెలుసుకునేందుకు మాత్రమే
ఈ ప్రయోగాలు చేశారు. అమెరికా చేసిన పయనీర్​ 3, పయనీర్​ 4, రష్యా చేసిన లూనా 3 ప్రయోగాలు ఈ ఫ్లైబైస్​కు ఉదాహరణ.

ఆర్బిటర్స్​: చంద్రుడి కక్ష్యలో స్పేస్​క్రాఫ్ట్​లు తిరిగే ప్రయోగమిది. చంద్రుడి కక్ష్యలో తిరుగుతాయి కాబట్టి వాటిని ఆర్బిటర్స్​ అంటారు. చంద్రయాన్​ 1 ఆర్బిటరే. దాంతో పాటు కొన్ని దేశాలు ఇప్పటిదాకా ఇలాంటి 46 ప్రయోగాలు చేశాయి. చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ చంద్రుడి స్థితిగతులను అంచనా వేస్తాయి.

ఇంపాక్ట్​ మిషన్​: ఆర్బిటర్​ కక్ష్యలో తిరుగుతున్నప్పుడు అందులోని కొన్ని పరికరాలను చందమామపై క్రాష్​ ల్యాండింగ్​ చేస్తారు. అంటే అవి, చంద్రుడిని బలంగా ఢీకొట్టి ల్యాండ్​ అవుతాయన్నమాట. ఆ ఇంపాక్ట్​కు ఆ పరికరాలు నాశనమవుతాయి. అయినా ఎంతో కొంత ఉపయోగకరమైన సమాచారాన్ని అవి సేకరిస్తాయి. చంద్రయాన్​1లోని ఒక పరికరాన్ని ఇలా ఇంపాక్ట్​ మిషన్​ కోసం ప్రయోగించారు. దానికి మూన్​ ఇంపాక్ట్​ ప్రోబ్​ అని పేరు పెట్టారు. ఈ ప్రోబ్​తో చంద్రుడిపై నీళ్లున్నాయనేందుకు గట్టి ఆధారాలు లభించాయని ఇస్రో చెబుతోంది.

ల్యాండర్స్​: సాఫ్ట్​ ల్యాండింగ్​ ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. అయితే, ఆర్బిటర్​తో పోలిస్తే ఇదే చాలా కష్టమైనది. ఫస్ట్​ 11 ల్యాండింగ్​ ప్రయోగాలు ఫెయిలయ్యాయంటేనే అది ఎంత కఠినమో అర్థం చేసుకోవచ్చు.

1966 జనవరి 31న తొలిసారిగా ల్యాండర్​ ప్రయోగం సక్సెస్​ అయింది. సోవియట్​ యూనియన్​ చేసిన లూనా 9 ప్రయోగానిదే ఆ రికార్డు. చంద్రుడిపై నుంచి వచ్చిన ఫస్ట్​ ఫొటోనూ అదే పంపింది.

రోవర్స్​: ల్యాండర్​కు అదనపు ప్రయోగం ఈ రోవర్​ మిషన్​. ల్యాండ్​ అయిన తర్వాత ల్యాండర్​ అక్కడే ఉండిపోతుంది. ఎటూ కదలదు. దాంట్లోని పరికరాలు అక్కడ మాత్రమే సర్వే చేయగలుగుతాయి. దాన్ని అధిగమించేందుకే రోవర్​ ఉపయోగపడుతుంది. దానికి చక్రాలను పెడతారు కాబట్టి అది అక్కడ మొత్తం కలియతిరుగుతుంది. నేలను అతి దగ్గరగా సర్వే చేస్తుంది. శాంపిళ్లను సేకరిస్తుంది. ల్యాండర్​ సేకరించలేని విలువైన సమాచారాన్ని రోవర్​ తీసుకొస్తుంది. చంద్రయాన్​ 2లో పంపిన రోవర్​ ప్రజ్ఞాన్​ ఇదే చేస్తుంది. ప్రస్తుతం చందమామపై చైనా ల్యాండర్​, రోవర్​లు పనిచేస్తున్నాయి. ఆరు నెలలవుతున్నా వాటి పనితీరు ఎక్కడా మందగించలేదు.

మానవ ప్రయోగాలు: అర్థమయ్యే ఉంటుంది కదా. చందమామపైకి మనిషిని పంపడం. ఇప్పటిదాకా నాసా మాత్రమే ఆస్ట్రోనాట్లను చందమామపైకి తీసుకెళ్లింది. ఆరు టీమ్​లు జాబిల్లిపై కాలు పెట్టాయి. ఒక్కో టీంలో ఇద్దరున్నారు. అన్నీ 1969 నుంచి 1972 మధ్య జరిగిన ప్రయోగాలే. తొలిసారిగా 1969లో అపోలో 11 మిషన్​ ద్వారా నీల్​ఆర్మ్​స్ట్రాంగ్​, బజ్​ ఆల్డ్రిన్​లు చందమామపై దిగారు. తాజాగా 2024 నాటికి మరో మిషన్​కు నాసా ప్లాన్​ చేస్తోంది. దానికి ఆర్టిమిస్​ అని పేరు పెట్టింది. అందులో ఈసారి మహిళనూ పంపించనుంది.

110 experiments on Moon

Latest Updates