118 ఏళ్ల చరిత్ర : సమాజసేవలో ఖమ్మం CSI చర్చి

రాష్ట్రంలో మెదక్ చర్చి అతి పురాతనమైనది… ఆ తర్వాత ఖమ్మంలోని CSI చర్చి అని క్రైస్తవులు చెబుతారు. ఖమ్మంలో చర్చికి వెనుక వైపు మసీదుకు ఉండే మినార్ లు  నిర్మించారు. ఈ చర్చికి 118 ఏళ్ల చరిత్ర ఉంది. ఖమ్మం పూర్వం వరంగల్ తాలుకాలో అంతర్భాగంగా ఉండి… నైజాం నవాబులు ఏలుతున్న కాలంలో ఈ చర్చి నిర్మాణం జరిగింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో క్రైస్తవ మిషనరీలు వందల యేళ్ళ నుంచి పనిచేస్తున్నా…. ఖమ్మంకి 1862 లోనే వచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

1865లో ఖమ్మంలో అమెరికన్ ఏపి స్కోపల్ మెథోడీస్ట్ సంఘం సపోష మిషనరీ ఆధ్వర్యంలో రైల్వే లైను నిర్మాణ పనులు జరుగుతుండేవి. ప్రస్తుతమున్న చర్చి కాంపౌండ్, పాక బండ బజారు ప్రాంతం మొత్తం దట్టమైన అడవితో విస్తరించి ఉంది. 1862లో పాకబండపేటలోని చీపిరిచింత పొలం 18 ఎకరాలను ఓ ముస్లిం వ్యక్తి నుంచి సేకరించారు.  అక్కడే ఓ బంగ్లా నిర్మించుకొని… చర్చి మిషనరీ సొసైటీని ప్రారంభించారు. తర్వాత 1892 లో మిషన్ ఆస్పత్రి పాఠశాల, బోర్డింగ్ హోంను ప్రారంభించారు.

ఖమ్మం చర్చి మిషనరీ సొసైటీకి బేబి పెయిన్స్ అనే మత గురువు… ఇంచార్జ్ గా ఉండేవారు. క్రిష్ణా జిల్లాలోని రాఘవాపురంలో మిషనరీలకు కూడా ఇతనే ఇంచార్జ్. అప్పట్లో ఖమ్మంలో పూరిపాకల్లో ప్రార్ధనలు చేసేవారు. దాంతో ఖమ్మంలో చర్చి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. రాఘవాపురంలో జోలెపట్టి విరాళాలు సేకరించి ఈ చర్చి నిర్మాణం చేశారు. దట్టమైన అడవి అయినా…రైల్వే లైన్ పనులు నడుస్తుండటంతో రాకపోకలకు వీలుంటుందనే ఉద్దేశ్యంతో రైల్వేట్రాక్ పక్కనే చర్చి నిర్మాణం చేపట్టారు. 1899 ఏప్రిల్ 12న చర్చికి పునాది వేస్తే.. 1900 ఫిబ్రవరి రెండున ప్రారంబించారు. అంటే సరిగ్గా ఈ ఏడాది ఫిబ్రవరికి 118 ఏళ్ళు పూర్తయ్యాయి.

ఖమ్మంలో అప్పట్లో రోగాలు వచ్చి వందల మంది చనిపోయేవారు. ఇది గమనించిన సెయింట్ పెయిన్స్.. ఆస్పత్రి నిర్మాణం చేపట్టాడు. 1892 లో ప్రారంభమైన మిషన్ ఆసుపత్రి ఇప్పటికీ నడుస్తోంది.  ఖమ్మంలో మిషన్ ఆస్పత్రి గురించి తెలియనివారు ఉండరు. అప్పట్లో ఎలాంటి ఆస్పత్రులు లేకపోవడంతో ఖమ్మం ప్రజలతో పాటు చుట్టు పక్కల గ్రామాల జనమంతా ఇక్కడికే వచ్చేవారు. తెల్లదొరలు, దొరసానులు వచ్చి వైద్యం చేస్తారనేది అప్పట్లో నానుడి.. తమిళనాడులోని రాయవెల్లూరు, హైదరాబాద్ తో పాటు అమెరికా, ఇంగ్లాండ్  నుంచి ఇక్కడికి డాక్టర్లు వచ్చేవారు. ఇక్కడున్న సెయింట్ మేరిస్ పాఠశాలకు స్థలాన్ని నాటి నిజాం నవాబు ఉచితంగా ఇచ్చారు.

నగరంలోని ప్రస్తుత చర్చి కాంపౌండ్ పేరు సిఎస్ఐ చర్చి ద్వారానే వచ్చింది. దాదాపు 165 ఎకరాల్లో విశాలంగా ఉండి చుట్టూ కాంపౌండ్ నిర్మాణం చేపట్టారు. అందులో ఆస్పత్రి , స్కూల్, బోర్డింగ్, చర్చి, నిర్వాహకులు ఉండేందుకు భవనాలు ఉన్నాయి. అప్పటి నుంచే ఈ ప్రాంతానికి చర్చి కాంపౌండ్ అనే పేరు వచ్చింది. ప్రతి నెలా ఉచిత వైద్య శిబిరాలతో పాటు ఆపరేషన్లు నిర్వహించడంతో పాటు రోజు వారి రోగులకు 50 రూపాయల ఫీజుతో వైద్యాన్ని అందిస్తున్నారు.  80 మంది విధ్యార్ధినులతో నర్సింగ్ స్కూల్, వృధ్ధాశ్రమం, బాలుర హస్టల్స్ 2, బాలికల హాస్టల్ 1, పోలియో హోం ఒకటి ఉచితంగా నిర్వహిస్తున్నారు. 20 గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాల్లోని మానసిక వికలాంగుకు సేవలందిస్తున్నారు.

ఇంతటి పురాతన చరిత్ర కలిగి ఈ చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరుపుకునేందుకు జిల్లా ప్రజలు నెల రోజుల ముందు నుంచే సిద్ధమవుతున్నారు. చర్చిని  రంగు రంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేసారు.

Posted in Uncategorized

Latest Updates