ప్లాస్టిక్​ వేస్ట్​లో ఒక్కొక్కరి వాటా 9.7 కిలోలు

  • దేశంలో ఏటా 12.9 కోట్ల టన్నుల ప్లాస్టిక్​చెత్త
  • 60 సిటీల్లోనే రోజూ 4 వేల టన్నులు
  • హైదరాబాద్​లో 199 టన్నుల ప్లాస్టిక్​ వేస్ట్​
  • ఏడాదికి 12.9 కోట్ల టన్నులు..

దేశంలో మనమంతా కలిసి ఏటా ఉత్పత్తి చేస్తున్న ప్లాస్టిక్​వేస్ట్ ఇది. ఇందులో మీ వాటా ఎంతో తెలుసా? ఏడాదికి 9.7 కిలోలు! సెంట్రల్​ పొల్యూషన్​ కంట్రోల్​బోర్డ్​(సీపీసీబీ) నిర్వహించిన ఓ స్టడీలో వెల్లడైన నిజాలివి. దేశవ్యాప్తంగా రోజూ 25,940 టన్నుల ప్లాస్టిక్​ చెత్త పోగుపడుతోందని పార్లమెంటులో ఓ ప్రశ్నకు సమాధానం వచ్చినప్పటికీ, నిజానిజాలు ఇంకా దారుణంగా ఉంటాయన్న విషయం తెలుస్తోంది.

ప్లాస్టిక్​వేస్ట్​లో ఢిల్లీ టాప్

దేశంలోని 60 ప్రధాన నగరాల్లో ప్లాస్టిక్​ చెత్త ఎంత మేరకు ఉత్పత్తి అవుతోందన్న విషయంపై సీపీసీబీ 2015లో ఓ స్టడీ నిర్వహించింది. దీంతో ఈ 60 నగరాల్లోనే రోజూ 4,059 టన్నుల ప్లాస్టిక్ ​చెత్త పోగుపడుతోందని తేలింది. వీటిలో ఢిల్లీ ఏకంగా రోజూ 690 టన్నుల ప్లాస్టిక్​ చెత్తను ఉత్పత్తిచేస్తూ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఢిల్లీ తర్వాత స్థానాల్లో చెన్నై, కోల్‌‌కతా, ముంబై నగరాలు ఉన్నాయి.

127 దేశాల్లో కొత్త చట్టాలు

యునైటెడ్​ నేషన్స్​ఎన్విరాన్​మెంట్​ ప్రోగ్రాం (యూఎన్ఈపీ) 2018 జులైలో విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం, 192 దేశాల్లో 127 దేశాలు ప్లాస్టిక్​సంచుల నియంత్రణ కోసం చట్ట రూపంలో చర్యలు తీసుకున్నాయి. ప్లాస్టిక్​బ్యాగుల తయారీ, సరఫరా, వినియోగం, వాడిన తర్వాత ప్లాస్టిక్​వస్తువుల డిస్పోజల్ వంటి వాటిపై ఈ చట్టాల్లో ఆంక్షలు విధించాయి. ప్లాస్టిక్​వస్తువులపై పన్నులను కూడా విధించాయి. వీటిలో ఎక్కువ దేశాలు రిటైల్​షాపుల్లో ఉచితంగా ప్లాస్టిక్​బ్యాగులు ఇవ్వడాన్ని నిషేధించాయి.  ఇప్పటివరకూ సింగిల్–యూజ్​ప్లాస్టిక్స్, ప్లేట్లు, కప్పులు, స్ట్రాల వంటివాటిపై 27 దేశాలు నిషేధించాయి. 63 దేశాలైతే సింగిల్–యూజ్​ప్లాస్టిక్​ను వెనక్కి తీసుకునేందుకు ప్రత్యేకంగా పథకాలు కూడా ప్రకటించాయి. ప్లాస్టిక్​నియంత్రణకు ఇండియా కూడా ప్లాస్టిక్​వేస్ట్​మేనేజ్​మెంట్​రూల్స్, 2016ను ప్రవేశపెట్టింది. ఈ రూల్స్​అన్ని రాష్ట్రాలకూ వర్తించడంతో, ఆయా రాష్ట్రాలూ చర్యలు ప్రారంభించాయి. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే ప్లాస్టిక్​ బ్యాగులను నిషేధించాయి.

హైదరాబాద్​కు ఏడో స్థానం

హైదరాబాద్​లో 2015 నాటికే ప్రతిరోజూ 4,200 టన్నుల సాలిడ్​ వేస్ట్​ఉత్పత్తి అవుతోందని సీపీసీబీ వెల్లడించింది. ఇందులో ప్లాస్టిక్ వేస్ట్​199 టన్నుల (4.8%) వరకూ ఉంటుందని అంచనా వేసింది. ప్లాస్టిక్​చెత్తను ఉత్పత్తి చేస్తున్న సిటీల్లో హైదరాబాద్ ఏడో స్థానంలో నిలిచింది. అయితే, ఇతర నగరాలతో పోలిస్తే మొత్తం మున్సిపల్​ వ్యర్థాల్లో ప్లాస్టిక్​ వేస్ట్​ శాతం హైదరాబాద్​లో కొంత తక్కువగానే ఉండటం గమనార్హం. అయినా, 20 సిటీల్లో మొత్తం మున్సిపల్ సాలిడ్​వేస్ట్​లో ప్లాస్టిక్​చెత్త శాతం 7.5%కు పైగా ఉండటం ఆందోళనకరమని సీపీసీబీ  వెల్లడించింది. దేశంలో 80% ప్లాస్టిక్​ను ప్యాకేజింగ్​సెక్టార్​లోనే వాడుతున్నారని. దేశంలో తలసరిన ఒక్కొక్కరు ఏటా 9.7 కిలోల ప్లాస్టిక్​వేస్ట్​ఉత్పత్తి చేస్తున్నారని తెలిపింది.

Latest Updates