శ్మశానాల్లో గడ్డి పీకి 12 లక్షల బిల్లులు లేపిన్రు

‘ఏం చేస్తున్నావు గడ్డి పీకుతున్నావా?’ అని చాలామంది కోపంతోనో, పరాశకానికో మాట్లాడడం చూస్తుంటం.  గడ్డి పీకితే పైసా ఫాయిదా లేదనే అర్థంలో ఇట్ల అంటరు. కానీ కరీంనగర్​ కార్పొరేషన్​లో జరుగుతున్న తతంగం చూస్తే గడ్డి పీకడాన్ని ఇక మీరు ఏమాత్రం లైట్​ తీసుకోరు. పైగా ‘గడ్డి పీకడం ఇంత  కాస్ట్లీ పనా?’ అని కచ్చితంగా  నోరుతెరుస్తరు.

కరీంనగర్, వెలుగు: కరీంనగర్​ కార్పొరేషన్ లిమిట్స్ లో వివిధ పనుల పేరిట ఆఫీసర్లు లక్షలకు లక్షల ప్రజల పైసలు పక్కదారి పట్టిస్తున్నరు. అవకాశమున్నచోట కాంట్రాక్టర్లతో కలిసి కాజేస్తున్నరు. చివరకు శ్మశానాలను కూడా వదలట్లేదు. కరీంనగర్ సిటీలో  ఖాన్ పూరా, కాపువాడ  , సవరన్ స్ర్టీట్ లో ముస్లిం గ్రేవ్​యార్డులున్నాయి. ఏటా రంజాన్, బక్రీద్​ సందర్భంగా వీటిని  క్లీన్​ చేస్తారు. శ్మశానాల్లో పేరుకుపోయిన చెత్త, పిచ్చి మొక్కలు తొలగించడానికి మున్సిపల్ ఫండ్స్​ ఇస్తుంటారు. 2019 వరకు నాలుగేళ్లపాటు ఈ మూడు గ్రేవ్​యార్డుల్లో గోడలకు సున్నం , క్లీనింగ్ కు రెండు  పండుగలకు కలిపి రూ.4 లక్షలు దాటింది లేదు. సవరన్​ స్ట్రీట్ లో ఉన్న గ్రేవ్​యార్డు కాస్త పెద్దది కావడంతో దీనికి రూ. లక్ష, మిగిలిన రెండింటికి కలిపి రూ.లక్ష చొప్పున టెండర్లు ఇచ్చేవారు. కానీ 2020లో మాత్రం ఏకంగా రూ. 12లక్షలు కేటాయించారు.

యూత్ సాఫ్ చేసుకున్నా..

2020లో  రంజాన్  పండుగ మే 25న జరిగింది. అంతకు రెండు  నెలల ముందు ఫిబ్రవరి నెలలో స్థానిక ముస్లిం యువకులు ప్రతిరోజూ 10 మంది చొప్పున 15రోజుల పాటు శ్రమదానం చేసి కాపువాడలోని గ్రేవ్​యార్డును క్లీన్​ చేసుకున్నారు. పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ పది రోజుల కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను యువకులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసుకుంటూ ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు. దీంతో పాటు ఖాన్ పురాలో ఉన్న గ్రేవ్​యార్డులో  మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది స్వయంగా గడ్డిని మొత్తం సాఫ్ చేసి.. గోడలకు సున్నాలు కూడా వేశారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ అనుచరులు శానిటేషన్ సిబ్బందికి స్నాక్స్, కూల్ డ్రింక్స్  ఇస్తూ ఆ ఫొటోలను  కూడా సోషల్ మీడియాలో షేర్​ చేసుకున్నారు.  ఒకదానిని యువకులు, మరోదానిని శానిటేషన్​టీమ్​ సాఫ్​ చేసినా మూడు గ్రేవ్​యార్డుల్లో రంజాన్ కు రూ. 5.65లక్షలు, బక్రీద్ కు రూ. 6.65లక్షల చొప్పున టెండర్లు పిలిచారు. గతంలో కంటే నాలుగు రెట్లు ఎక్కువ. సాధారణంగా రంజాన్  పండగ అయిన తరవాత  రెండు నెలలకే బక్రీద్ వస్తుంది. మామాలుగా అయితే  రంజాన్ లో పెట్టిన బడ్జెట్ కంటే తక్కువగా ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం లక్ష ఎక్కువగా పెట్టడం గమనార్హం. దీనికి తోడు రంజాన్ లో  చేసుకున్న వర్క్ అగ్రిమెంట్   (ఫైల్ నెం. ఈ1/14/ఎంసీకే/2019–-20) తేది మే 21న జరిగింది. కానీ దీనిని 2019–-20 ఆర్థిక సంవత్సరం లో చూపించారు. ఫీల్డ్​ లెవల్​లో ఎస్టిమేట్స్ జనరేట్‌ చేయాల్సిన ఏఈ స్థాయి ఆఫీసర్లు గతేడాది రేట్లను, కనీసం స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్లను కూడా పరిగణలోకి తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.12 లక్షల్లో ఇప్పటికే కాంట్రాక్టర్లకు రూ. 9 లక్షలకు పైగా  బిల్లులు చెల్లించారు.

ఈ సొమ్మును రికవరీ చేయాలి..

బల్దియాలో అవినీతికి లెక్కలేకుండా పోయింది.  ఆఫీసర్లు శ్మశానాలను కూడా వదుల్తలేరు. స్థానిక యువకులు సాఫ్ చేసుకున్న గ్రేవ్​ యార్డుల్లో గడ్డి తొలగించే పేరిట లక్షలకు లక్షలు తీసుకోవడం  విడ్డూరంగా ఉంది. డబ్బుల కోసం ఇంత కక్కుర్తి పడ్తరా. శ్మశానాలనూ వదలరా? ఆఫీసర్లు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారు. దీని మీద ఇప్పటికే కమిషనర్ కు  ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటలేరు. వెంటనే బాధ్యులపై యాక్షన్​ తీసుకొని సొమ్మును రికవరీ చేయాలి.  –షాబుద్దీన్, సోషల్ వర్కర్

Latest Updates