ఉద్యోగాలు పొయినోళ్లను ఆదుకోండి: సోనియా గాంధీ

  • ఒక్కోరికి రూ.7500 ఇవ్వాలని డిమాండ్‌
  • కరోనా కట్టడి చేయలేకపోయారని కేంద్రంపై విమర్శలు

న్యూఢిల్లీ: గడిచిన మూడు వారాల్లో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతున్నా ప్రభుత్వం తాము చేసిన సూచనలను కనీసం పట్టించుకోలేదని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ అన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పటికి చాలా సార్లు వివరించానని, తీసుకోవాల్సిన చర్యలు సూచించానా.. వాటిని ఆచరణలోకి తీసుకురాలేదని ఆమె అన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఆమె మాట్లాడారు. లాక్‌డౌన్‌ కారణంగా 12కోట్ల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారని, వాళ్లందర్నీ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఆ కుటుంబాలకు రూ.7500 అందిచాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలు తిరిగి స్టార్ట్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్‌ ప్రకటించాలని ఆమె డిమాండ్‌ చేశారు. పనులు లేక, ఉపాధి లేక వలస కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వారికి ఆహార భద్రత, ఆర్థిక పరమైన రక్షణ కల్పించాలని కోరారు. దేశంలో కరోనా నిర్ధారణ టెస్టులు చాలా నిదానంగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాసిరకమైన కిట్లు వాడటంతో రిజల్ట్‌ కూడా సరిగా తెలియడం లేదని చెప్పారు. మే 3 తర్వాత ఏం చేయాలో కేంద్రానికి క్లారిటీ లేదని సోనియా విమర్శించారు. వైరస్‌ వ్యాప్తిని ఐకమత్యంతో ఎదుర్కోవాలి కానీ.. బీజేపీ మతం, ద్వేషం అనే వైరస్‌ను వ్యాప్తి చేస్తోందని ఆమె విమర్శించారు. సరైన సౌకర్యాలు లేనప్పటికీ దేశంలోని చాలా మంది ముందుండి కరోనాతో పోరాడుతున్నారని డాక్టర్లను ప్రశంసించారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో సోనియా గతంలో ప్రధాని మోడీకి లెటర్‌‌ రాశారు. లాక్‌డౌన్‌ వల్ల ఎవరూ ఆకలితో ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. దాంతో పాటు ప్రధానికి మరికొన్ని సూచనలు చేశారు.

Latest Updates