ఆపరేషన్ అవసరం లేదు : ఒక్క ఇంజక్షన్‌తో 13 ఏళ్లు కుటుంబ నియంత్రణ

పిల్లలు కలగకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం..అది కుటుంబ నియంత్రణ ఆపరేషన్. పురుషులు అయితే వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి ఆపరేషన్ లేకుండానే సంతానోత్పత్తిని అరికట్టవచ్చు. దీని కోసం కేవలం ఒక్క ఇంజక్షన్‌తో 13 ఏళ్లపాటు సంతానం కలగకుండా ఆపే పద్దతిని ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ మెడకల్ రీసెర్చ్ (ICMR) అందుబాటులోకి తెచ్చింది.

సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌.ఎస్.శర్మ నేతృత్వంలోని నిపుణుల బృందం దీన్ని డెవలప్ చేస్తోంది. ఇప్పటికే దీని కోసం 303 మందిపై పరిశోధనలు కూడా నిర్వహించారు. 97.3 శాతం సానుకూల ఫలితాలు రావడంతో ఈ ఇంజక్షన్‌కు ఆమోదం తెలిపేందుకు ఔషధ నియంత్రణ మండలి ముందుకు వచ్చింది. మరో 7 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తికానుంది.దీంతో ఇది ప్రపంచంలోనే తొలి సంతాన నిరోధక ఇంజెక్షన్‌‌గా రికార్డు సృష్టించనుంది. దీనిపై గతంలో అమెరికా కూడా పరిశోధనలు చేసినప్పటికీ సానుకూల ఫలితాలు రాకపోవడంతో ఆపేసింది.

పురుషుల వృషణాల నుంచి వీర్యకణాలను మూత్రనాళానికి చేరవేసే నాళికకు ముందుగా  మత్తుమందు ఇస్తారు. ఆ తర్వాతఈ ఇంజెక్షన్‌ చేస్తారు. అయితే ఈ ప్రక్రియ నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలోనే జరగాల్సి ఉంటుంది. 303 మందిపై మూడు విడతలు జరిపిన ప్రయోగ పరీక్షల్లో 97.3 శాతం సానుకూల ఫలితాలు వచ్చాయని సమాచారం. దీనికి రివర్సిబుల్‌ ఇన్‌హిబిషన్‌ ఆఫ్‌ స్పెర్మ్‌ అండర్‌ గైడెన్స్‌(RISUG) అని పేరుపెట్టారు.

ఈ ఇంజక్షన్ అందుబాటులోకి వస్తే మాత్రం ఇక ఆపరేషన్లతో పాటు పనిలేకుండా సుమారు 13 ఏళ్ల పాటు సంతానోత్పత్తిని నియంత్రించుకోవచ్చు. కాగా 1970లోనే ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్రొఫెసర్‌ సుజయ్‌కుమార్‌ గుహ కనుగొన్నారు. 1984 నుంచే ఆ పాలిమర్‌తో సంతాన నిరోధక ఇంజెక్షన్‌ అభివృద్ధిపై ఐసీఎంఆర్‌ పరిశోధనలను ప్రారంభించింది.

Latest Updates