షాద్ నగర్ లో ఉద్రిక్తత: కోర్టుకు తీస్కెళ్లకుండానే రిమాండ్

షాద్ నగర్ లో డాక్టర్ హత్య కేసులో నిందితులకు తహశీల్దార్(ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్) పాండునాయక్ 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులున్న షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గరకు ఉదయం నుంచి వేల సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాలనుంచి జనం తరలివచ్చారు. డాక్టర్ ను హత్య చేసిన వారిని తమకు అప్పగిస్తారా…లేదంటే మీరు ఎన్ కౌంటర్ చేస్తారా అంటూ ఆందోళనకు దిగారు. దీంతో పీఎస్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. నిరసనకారుల ఆందోళనలు తీవ్రతరం కావడంతో నిందితులను బయటకు తీసుకొచ్చే అవకాశం లేకపోయింది.

దీంతో తహశీల్దార్ పాండునాయక్ ను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఆయన ముందు నిందితులను పోలీసులు ప్రవేశపెట్టారు. కేసును విచారించిన మేజిస్ట్రేట్ నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. నిందితులను మహబూబ్ నగర్ జిల్లా జైలుకు పోలీసులు తరలించనున్నారు. అంతకుముందు నిందితులకు స్టేషన్ లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు.