ర్యాపిడ్ కిట్ల‌తో 14 వేల టెస్టులు.. 30 మందికి క‌రోనా పాజిటివ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం క‌రోనా క‌ట్ట‌డి కోసం బాధితుల‌ను వేగంగా గుర్తించే ప‌నిలో ప‌డింది. ఇందుకోసం టెస్టింగ్ సామ‌ర్థ్యం భారీగా పెంచింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలోనే అత్య‌ధిక శాంపిల్స్ ను ఆర్టీ పీసీఆర్ విధానంలో ప‌రీక్షించిన రాష్ట్రంగా నిలిచింది. తాజాగా ద‌క్షిణ కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ టెస్టు కిట్ల‌తోనూ భారీ సంఖ్య‌లో టెస్టు చేస్తోంది. ఇప్ప‌టికే 14,423 మందికి ఈ కిట్ల‌తో టెస్టు చేయ‌గా.. 30 మందికి పాజిటివ్ వ‌చ్చింది. వారిని ఐసోలేష‌న్ కు త‌ర‌లించి.. మ‌రోసారి కన్ఫ‌ర్మేష‌న్ కోసం ఆర్టీ పీసీఆర్ టెస్టు చేయ‌బోతున్నారు వైద్యులు. క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌పై గుర‌వారం ఉద‌యం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్వ‌హించిన స‌మీక్ష‌లు అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. క‌రోనా ప‌రీక్ష‌ల సామ‌ర్థ్యం భారీగా పెంచ‌డంపై సీఎం వారిని అభినందించారు. టెస్టుల సామ‌ర్థ్యం క్ర‌మంగా పెంచుకుంటూ పోవాల‌ని సూచించారు.

నిన్న ఒక్కరోజే 6,520 ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేశామని అధికారులు వివ‌రించారు. మొత్తంగా ఇప్పటివరకూ 48,034 పరీక్షలు చేశామ‌ని, ప్రతి మిలియన్‌కు 961 టెస్టులతో ఏపీ.. దేశంలోనే తొలి స్థానంలో ఉంద‌ని చెప్పారు. కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్‌ టెస్టు కిట్స్‌కు ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చిందని, నిర్దేశిత‌ ప్రోటోకాల్‌ ప్రకారం ర్యాపిడ్‌ టెస్టు కిట్స్‌తో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్స్‌తో ఇప్పటివరకూ 14,423 పరీక్షలు చేయ‌గా.. అందులో 11,543 టెస్టులు రెడ్‌జోన్లలోనే చేసిన‌ట్లు చెప్పారు. ఈ మొత్తం పరీక్షల్లో సుమారు 30 మందికి పాజిటివ్‌ వచ్చాయని, ఆ టెస్టుల‌ను మ‌రోసారి నిర్ధారణ కోసం ఆర్టీ పీసీఆర్‌ టెస్టుల‌కు శాంపిల్స్ పంపామ‌ని చెప్పారు. కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్‌ టెస్టు కిట్ల పనితీరు బాగుందన్నారు.

ఎమ‌ర్జెన్సీ కేసుల‌కు ఇబ్బంది లేకుండా చూడాలి

క‌రోనా మ‌హమ్మారిపై పోరాడుతున్న ఈ స‌మ‌యంలో తలసేమియా, క్యాన్సర్, డయాలసిస్ పేషెంట్ల‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని, 104కు కాల్‌చేస్తే వెంటనే స్పందించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఎమర్జెన్సీ కేసులకు ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. డెలివరీ కేసులకు ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో మూడు కొత్త మెడిక‌ల్ కాలేజీల నిర్మాణానికి వెంటనే స్థలాలను గుర్తించాలని అధికారుల‌కు చెప్పారు.

Latest Updates