యూపీలో 15 జిల్లాలు పూర్తిగా క్లోజ్

కరోనా హాట్ స్పాట్లుగా గుర్తించిన అధికారులు

 వ్యాధి వ్యాప్తి చెందకుండా కీలక నిర్ణయం

నిత్యావసరాలు డోర్ డెలివరి

లక్నో: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో 15 జిల్లాలను పూర్తిగా సీజ్ చేయనుంది. కరోనా హాట్ స్పాట్లుగా గుర్తించిన ఆ  జిల్లాలు ఈ నెల 15 వరకు పూర్తిగా లాక్ డౌన్ లో ఉంటాయని స్టేట్ చీఫ్ సెక్రటరీ ప్రకటించారు. బుధవారం రాత్రి నుంచే నిబంధనలు అమల్లోకి వస్తాయన్నారు. లక్నో, గౌతమ్ బుద్ధ నగర్, నోయిడా, ఘజియాబాద్, మీరట్, ఆగ్రా, షామిలీ, షహరాన్ పూర్ లతో సహా 15 జిల్లాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున  ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెప్పారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర సరుకులు డోర్ డెలివరి చేసేలా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. యూపీలో ఇప్పటి వరకు 326 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ముగ్గురు చనిపోయారు. 21 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ 14న లాక్ డౌన్ ఎత్తేయలేమని యూపీ ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్రంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు ఉన్నా తీయము అని యూపీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ అవినాశ్ అవస్థి చెప్పారు.

Latest Updates