రూ.15వేల జీతం పెట్రోల్ ఖర్చులకూ సాలట్లేదు

రూ.15వేల జీతం పెట్రోల్ ఖర్చులకూ సాలట్లేదు
  • సర్కారుకు ఉపాధి హామీ బీఎఫ్ టీల మొర
  • రాష్ట్ర వ్యాప్తంగా 350 మంది విధులు

హైదరాబాద్, వెలుగు:  ఉపాధి హామీ పథకంలో ఏడాదంతా కూలీల అటెండెన్స్, బిల్లులు, ఎంబీ రికార్డులు, హరితహారం, నర్సరీల వంటి ఎన్నో పనులు చేస్తున్నా.. తమకు చాలీచాలని జీతం ఇస్తున్నారని బేర్ ఫుట్ టెక్నీషియన్ (బీఎఫ్ టీ)లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీటెక్ చేసినా.. టెన్త్ క్వాలిఫికేషన్ ఉండే బీఎఫ్ టీ జాబ్ చేస్తున్నామని, కానీ తమకు ఉద్యోగ భద్రత మాత్రం లేదని వాపోతున్నారు. ఉపాధి హామీ స్కీమ్ లో పని చేస్తున్న ఇంజనీరింగ్ కన్సల్టెంట్(ఈసీ)లకు, టెక్నికల్ అసిస్టెంట్(టీఏ)లకు రూ.50 వేలు, రూ.40 వేల జీతాలు ఇస్తున్నా, తమకు మాత్రం రూ. 15 వేలే చెల్లిస్తున్నారని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఒక్కో బీఎఫ్ టీకి 6 నుంచి 10 గ్రామాలలో ఉపాధి పనుల డ్యూటీలను అప్పగించింది. నిత్యం అన్ని గ్రామాలు తిరుగుతూ ఉపాధి పనులను వీరు పరిశీలిస్తున్నారు. ఎంత మంది కూలీలు వచ్చారు. ఎంత పని జరిగింది, వారికి చెల్లించాల్సిన నగదు వంటి వ్యవహారాలను చూస్తున్నారు. దాదాపు రోజుకు12 గంటలు డ్యూటీ చేస్తున్న తమకు జీతాలను పెంచి జాబ్ సెక్యూరిటీ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  

ఏపీలో రూ. 30 వేల జీతం 

బీఎఫ్ టీలకు ఇతర రాష్ర్టాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఏపీలో రూ.30 వేలు, మహారాష్ట్రలో రూ.25 వేలు, యూపీలో రూ.33 వేల జీతం ఉందని అంటున్నారు. ‘‘గ్రామ పంచాయతీలో చెల్లించే ఉపాధి హామీ బిల్లుల్లో 6 శాతం జీతాలకే ఖర్చు పెట్టాలన్న నిబంధన ఉంది. ఉదాహరణకు ఏడాదికి రూ.60 లక్షలు కూలీలకు బిల్లులు చెల్లిస్తే రూ.6 లక్షలు జీతాలకు ఖర్చు పెట్టాలి. కానీ మన రాష్ట్రంలో రూ.2 లక్షలు మాత్రమే జీతాల కింద ఇస్తున్నారు” అని బీఎఫ్ టీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో బీఎఫ్ టీకి 6 నుంచి10 గ్రామాల డ్యూటీలు చేస్తున్నారని, ఇన్ని గ్రామాలు తిరగడానికి అయ్యే పెట్రోల్ ఖర్చులకు కూడా ఇచ్చే జీతం సరిపోవట్లేదని చెప్తున్నారు.   

జాబ్ సెక్యూరిటీ కల్పించాలి 

బీఎఫ్ టీలుగా 2017 నుంచి పనిచేస్తున్నం. బీటెక్ పూర్తి చేసినా టెన్త్ క్వాలిఫికేషన్ ఉన్న జాబ్ చేస్తున్నం. ఏటా జీతం పెంచుతమని రిక్రూట్ చేసుకునే టైమ్ లో రూరల్ డెవలప్ మెంట్ అధికారులు చెప్పిండ్రు. 30 శాతం పీఆర్సీ ఇచ్చిన టైమ్ లో జీతాలు పెంచినప్పటికీ, శాలరీ రూ.15 వేలు కూడా దాటలేదు. చనిపోతే ఇన్సూరెన్స్ లేదు, ఉద్యోగ భద్రత లేదు. ఇప్పుడున్న ఖర్చుల్లో ఈ జీతంతో మా కుటుంబాలు ఎట్ల బతకాలో అధికారులు ఆలోచించాలి. 

– శ్రీకాంత్, అధ్యక్షుడు, బీఎఫ్ టీల సంఘం  

ప్రభుత్వం న్యాయం చేయాలి 

బీఎఫ్ టీలకు ఎఫ్ టీఈ (ఫిక్స్ డ్ టెన్యూర్ ఎంప్లాయీ) కోడ్ ఇవ్వాలని, జీతాలు పెంచాలని పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి, సెక్రటరీ సుల్తానియా, కమిషనర్ శరత్ లను కలిసి వినతిపత్రాలు ఇచ్చినం. ఉపాధి హామీ స్కీమ్ కు కోట్ల నిధులు ఖర్చు చేస్తూ కూలీలకు చెల్లిస్తున్నం. మాకు మాత్రం చాలీచాలని జీతాలు ఇస్తున్నరు. ప్రభుత్వం న్యాయం చేయాలి.  

– రాజు, జనరల్ సెక్రటరీ, బీఎఫ్ టీల సంఘం