కరోనాతో మహారాష్ట్రలో 18 మంది పోలీసులు మృతి

కరోనా పాజిటివ్ కేసులు దేశంలో ఎక్కువ న‌మోద‌వుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. భారీ సంఖ్యలో వైర‌స్ భారిన పడుతున్నారు. విధి నిర్వ‌హణ‌లో భాగంగా పోలీసులు కూడా కరోనా వైరస్ సోకి చనిపోతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మహారాష్ట్రలో 1666 మంది పోలీసుల‌కి క‌రోనా సోక‌గా, 18 మంది మ‌ర‌ణించారు. ముంబైలోని విలే పార్లే పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వ‌హిస్తున్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అరుణ్ ఫడ్టారే వైర‌స్ తో చనిపోయినట్లు ముంబై పోలీస్ కమిషనర్ పరం బిర్ సింగ్ తెలిపారు. వ‌య‌సు పైబ‌డిన‌ కార‌ణంగా గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న సెల‌వులో ఉండ‌గా శుక్ర‌వారం మృతి చెందినట్లు చెప్పారు.

మే 21న క‌రోనా కార‌ణంగా ఎఎస్‌ఐ భివ్‌సేన్ హరిభావును కోల్పోయామ‌ని, వ‌రుస‌గా పోలీసులు వైర‌స్‌కు బ‌లికావ‌డం ప‌ట్ల రాష్ట్ర డీజీపీ  ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబ ‌స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు.

ఇప్ప‌టికే వ‌య‌సు పైబ‌డిన వారిని విధుల్లోకి రావొద్దంటూ పోలీస్ వ‌ర్గాలు ఆదేశాలు జారీ చేశాయి. అయిన‌ప్ప‌టికీ అధిక‌సంఖ్య‌లో మ‌హారాష్ట్ర లో పోలీసులు చనిపోతుండటంతో సిబ్బంది కొర‌త కూడా ఏర్ప‌డింది. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సాయుధ పోలీసు దళాల నుండి సుమారు 2000 మంది అదనపు పోలీసులను పంపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది మహారాష్ట్ర ప్రభుత్వం.

Latest Updates