తెలంగాణలో ఒక్కరోజే 169 కరోనా కేసులు..నలుగురు మృతి

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం మరో 169 మందికి వైరస్ సోకింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్‌లోనే 82 కేసులు నమోదయ్యాయని.. రంగారెడ్డిలో 14, మెదక్‌లో ఇద్దరు, సంగారెడ్డి జిల్లాలో ఇద్దరికి వైరస్‌ సోకిందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన వాళ్లలో మరో 64 మందికి పాజిటివ్‌ వచ్చిందని చెప్పింది. ఇతర రాష్ర్టాల నుంచి తిరిగి వచ్చిన వారిలో ఐదుగురు కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,425కు పెరిగింది. గత మూడ్రోజుల్లోనే 434 కేసులు నమోదయ్యాయి.

మరో నలుగురు మృతి

రాష్ట్రంలో కరోనా మరణాలూ పెరుగుతున్నాయి. శుక్రవారం మరో నలుగురు మరణించినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మరణాల సంఖ్య 71కి చేరింది. మరణించిన వారిలో 53 ఏండ్ల వ్యక్తి గాంధీలో చేరిన 7 రోజుల తర్వాత, 59 ఏండ్ల మరో వ్యక్తి 3 రోజుల తర్వాత, 62 ఏండ్ల వృద్ధుడు 13 రోజుల తర్వాత మరణించారని, వీళ్లంతా ఇతర జబ్బులతో బాధపడుతున్నారని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌, డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. హైపర్‌ ‌టెన్షన్‌తో బాధపడుతున్న 60 ఏండ్ల వృద్ధురాలు గాంధీలో చేరిన 5 రోజుల తర్వాత మరణించిందన్నారు.గచ్చిబౌలికి చెందిన ఓ వ్యక్తి కరోనా అనుమానిత లక్షణాలతో గాంధీలో శుక్రవారం మరణించాడు. ఆ వ్యక్తికి టెస్టులు చేయించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కరోనా లక్షణాలతో మృతి చెందిన వారికి టెస్టులు చేయాలని ఐసీఎంఆర్‌ నిబంధనలు‌, హైకోర్టు ఆదేశాలున్నా టెస్టు చేయకపోవడం గమనార్హం. సౌదీ అరేబియా నుంచి వచ్చిన 458 మందిలో శుక్రవారం సాయంత్రం నాటికి 207 మందికి పాజిటివ్ తేలింది.

కరోనా లెక్క

మొత్తం కేసులు      2,425

యాక్టివ్ కేసులు        973

డిశ్చార్జ్‌‌లు            1,381

మరణాలు                 71

Latest Updates