వలసల్లో మనమే టాప్

విదేశాలకు వలసపోతున్నోళ్లలో మనోళ్లే ఎక్కువగా ఉన్నరట. ఈ ఏడాది అమెరికా సహా వివిధ దేశాలకు వలస పోయిన ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) సంఖ్య1.75 కోట్లు ఉందట. అంతేకాదు.. సంపాదనలోనూ మనోళ్లే టాప్ ప్లేస్ లో ఉన్నారట. మన ఎన్ఆర్ఐలందరూ కలిపి దాదాపు 7860 కోట్ల డాలర్లు అంటే.. రూ. 5.62 లక్షల కోట్లను సంపాదిస్తున్నారట! ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) విడుదల చేసిన ‘వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2020’లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అయితే, భారత విదేశీ వ్యవహారాల శాఖ గత ఏడాది డిసెంబర్ లో విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, అన్ని దేశాల్లో కలిపి మొత్తం3,09,95,729 మంది ఎన్ఆర్ఐలు ఉన్నారని అంచనా.

ఎక్కువ మంది చూపు అమెరికా వైపే..

ప్రపంచవ్యాప్తంగా 2019లో 27 కోట్ల మంది పుట్టినదేశం వదిలి వేరే దేశాలకు వలసపోయారని నివేదిక తెలిపింది. వీరిలో ఎక్కువ మంది (5.7 కోట్లు) అమెరికాకే వలస పోయారట. రెండేండ్లలో ఇంటర్నేషనల్ ఇమిగ్రెంట్స్ సంఖ్య 0.1 శాతం పెరిగిందని రిపోర్ట్ పేర్కొంది. అయితే, మొత్తం ప్రపంచ జనాభాలో ఇది 3.5 శాతమేనని, అంటే.. 96.5 శాతం మంది పుట్టినదేశంలోనే నివసిస్తున్నారని వివరించింది.

రిపోర్ట్ లోని విశేషాలు ఇవే..

  • ఈ ఏడాది ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ లో ఇండియా తర్వాత ఎక్కువగా మెక్సికో వాళ్లు (1.18 కోట్లు), చైనా వాళ్లు  (1.07 కోట్లు) వలస పోయారు.
  • ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ లో 52 శాతం మగవాళ్లు ఉన్నారు. దాదాపు సగం మంది (14.1 కోట్లు)  యూరప్, నార్త్ అమెరికాకే వెళ్లారు.
  • సుమారు 16.4 కోట్ల మంది ఉద్యోగాల కోసమే వలస పోయారు.
  • సంపాదన విషయంలో మన ఎన్ఆర్ఐల తర్వాత చైనా వాళ్లు (రూ. 4.83 లక్షల కోట్లు), మెక్సికో వాళ్లు (రూ. 2.55 లక్షల కోట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
  • మైగ్రెంట్లకు ఎక్కువ ఆదాయం కల్పిస్తున్న దేశాల్లో అమెరికా (రూ. 4.86 లక్షల కోట్లు) టాప్ ప్లేస్ లో ఉండగా, యూఏఈ (రూ. 3.17 లక్షల కోట్లు), సౌదీ అరేబియా (రూ. 2.58 లక్షల కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
  • గల్ఫ్ దేశాల్లో టెంపరరీ లేబర్ గా వలసపోయినోళ్లే ఎక్కువగా ఉంటున్నరు. ఒక్క యూఏఈలోనే వీరి సంఖ్య 90 శాతం వరకూ ఉంది.
  • గత రెండేండ్లలో సిరియా, కొలంబియా, కాంగో, మయన్మార్, సౌత్ సూడాన్, సిరియా, యెమెన్ వంటి దేశాల్లో అల్లర్లు, అంతర్యుద్ధాల కారణంగా 4.13 కోట్ల మంది సొంతదేశం విడిచి శరణార్థులుగా వేరేదేశాలకు పారిపోయారు.
  • ఫిలిప్పీన్స్ లో టైఫూన్ మంగ్ఖూట్ వల్ల 38 లక్షల మంది శరణార్థులయ్యారు.

గ్రీన్ కార్డు కోసం మనోళ్లు 2.27 లక్షల మంది వెయిటింగ్

అమెరికాలో ఫ్యామిలీ ద్వారా స్పాన్సర్ చేసే గ్రీన్ కార్డ్ కోసం మనోళ్లు 2,27,000 మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారట. ఈ లిస్ట్ లో మెక్సికో వాళ్ల తర్వాత ఇండియన్లే రెండో స్థానంలో ఉన్నారట. మెక్సికో నుంచి ప్రస్తుతం15 లక్షల మంది గ్రీన్ కార్డ్ కోసం వెయిటింగ్ లో ఉన్నారని ఈ మేరకు అమెరికా ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం వెల్లడైంది. ప్రస్తుతం ఏటా 2,26,000 మందికి మాత్రమే ఫ్యామిలీ స్పాన్సర్డ్ గ్రీన్ కార్డులు ఇస్తుండగా, వెయిటింగ్ లిస్ట్ మాత్రం ఏటా భారీగా పెరిగిపోతోందని అధికారులు చెప్తున్నారు. వీరిలో ఎక్కువ మంది అమెరికా పౌరుల తోబుట్టువులు, బంధువులే ఉన్నారని అంటున్నారు. అయితే, ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ తమ ఉద్యోగం ఆధారంగా గ్రీన్ కార్డ్ పొందాలంటే ఇప్పుడు 10 ఏండ్లు వెయిటింగ్ లిస్ట్ లో ఉండాల్సిందేనని చెప్తున్నారు.

Latest Updates