17 దేశాల్లో నీళ్ల కరువు

పోయిన ఎండాకాలంలో గుక్కెడు నీళ్ల కోసం జనం ఎంత అల్లాడారో తెలిసే ఉంటుంది. చెన్నై, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు సహా దేశంలోని చాలా చోట్ల బిందెడు నీళ్లు దొరకడం గగనమైపోయింది. రైళ్లలో వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. చెన్నైకి రైల్లో నీటిని పంపించిన సంగతీ తెలిసిందే. అంత తీవ్రమైన నీటి ఎద్దడి రాజ్యమేలింది. మన దగ్గరే కాదు, వేరే దేశాల్లోనూ అదే పరిస్థితి. దక్షిణాఫ్రికాలోని కేప్​టౌన్​, ఫ్రాన్స్​లోని రోమ్​ వంటి నగరాల్లోనూ తీవ్రమైన పరిస్థితులు కనిపించాయి. అయితే, మనకు కనిపించే దానికన్నా తీవ్రమైన నీటి ఎద్దడి పరిస్థితులున్నాయని ప్రపంచంలోని తిండి, నీరు, ఇతర వనరుల లెక్కలు చూసే వరల్డ్​ రీసోర్సెస్​ ఇనిస్టిట్యూట్​ (డబ్ల్యూఆర్​ఐ) చెబుతోంది. ‘ఆక్వాడక్ట్​’ పేరిట వివిధ దేశాల్లో నీటి ఎద్దడి పరిస్థితులపై నివేదిక విడుదల చేసింది. ప్రపంచంలోని 17 దేశాల్లో నీటి ఎద్దడి పరిస్థితులున్నాయని చెప్పింది. అందులో ఇండియాది 13వ స్థానం.

బాగా వాడేస్తున్నరు

జనాలు, డిమాండ్​ బాగా పెరగడంతో 1960ల నుంచి నీటి వాడకం రెట్టింపైందని పేర్కొంది. అప్పటి నుంచి ఎప్పుడూ ఎక్కడా నీటి వాడకం తగ్గలేదని తెలిపింది. ప్రపంచంలో పావు వంతు జనాభా ఉన్న ఇండియా సహా  ఆ 17 దేశాల్లోనే నీటి ఎద్దడి అత్యంత తీవ్రంగా ఉందని చెప్పింది. వ్యవసాయం, పరిశ్రమలు, మున్సిపాలిటీల కోసమే ఏటా 80 శాతానికిపైగా నీటిని తోడేస్తున్నారని తెలిపింది. 33 శాతం జనాభా ఉన్న మరో 44 దేశాల్లోనూ నీటి ఎద్దడి ఎక్కువగానే ఉందని చెప్పింది. ఆయా దేశాల్లో ఏటా సగటున ఉన్న నీటిలో 40 శాతం తోడేస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల వల్లే చాలా దేశాల్లో కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని, కొన్ని కొన్ని సార్లు ‘జీరో డే’ వస్తోందని, మరిన్ని విపత్తులూ వస్తున్నాయని చెప్పింది. ఈ పరిస్థితుల వల్ల మనుషుల జీవితాలు, బతుకుదెరువు, వ్యాపార స్థిరత్వం దెబ్బతింటున్నాయని పేర్కొంది. దేశాలు ఇప్పటికైనా మేల్కొనకపోతే పరిస్థితి మరింత దిగజారిపోతుందని హెచ్చరించింది. జనాభా పెరుగుదల, సామాజిక ఆర్థిక పరిస్థితులు పెరుగుతుండడం, పట్టణీకరణ వంటి కారణాలు తీవ్రమైన నీటి డిమాండ్​కు కారణమవుతున్నాయని తెలిపింది. దానికి తోడు వాతావరణ మార్పులూ ఓ చెయ్యి వేస్తున్నాయని చెప్పింది.

మిడిల్​ ఈస్ట్​, ఉత్తరాఫ్రికాల్లోనే ఎక్కువ

నీటి ఎద్దడి  పరిస్థితులు ఎక్కువగా మిడిల్​ ఈస్ట్​, ఉత్తరాఫ్రికాల్లోనే (మేనా) ఉన్నాయి. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న 17 దేశాల్లో 12 ఆ ప్రాంతాల్లోనివి కావడమే ఇందుకు ఉదాహరణ. దానికీ కారణాలు లేకపోలేదు. ఆ ప్రాంతం మొత్తం వేడిగా ఉండడం, నీటి లభ్యత కూడా తక్కువగా ఉండడం వల్ల డిమాండ్​కు తగినన్ని నీళ్లు దొరకట్లేదు. ఆ డిమాండ్​ మరింత పెరగడంతో నీటి ఎద్దడి మరింత తీవ్రంగా మారిపోయింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి నీటి ఎద్దడి వల్ల ఆయా దేశాలు జీడీపీలో 6 నుంచి 14 శాతం నష్టపోవాల్సి వస్తుందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది కూడా. మేనాలో 82 శాతం వ్యర్థ జలాలను శుద్ధి చేయడం లేదట. వాటిని మంచిగా శుద్ధి చేస్తే పరిశుభ్రమైన నీళ్లు అక్కడి వాళ్లకు దొరుకుతాయని డబ్ల్యూఆర్​ఐ చెప్పింది. ఇప్పటికే జాబితాలో 16వ స్థానంలో ఉన్న ఒమన్​ వంద శాతం వ్యర్థ జలాలను శుద్ధి చేస్తోంది. అందులో 78 శాతం నీటిని తిరిగి వాడుకుంటోంది. గల్ఫ్​ కో–ఆపరేషన్​ కౌన్సిల్​ (జీసీఐ)లోని బహ్రెన్​, కువైట్​, ఒమన్​, ఖతార్​, సౌదీ అరేబియా, యునైట్​ అరబ్​ ఎమిరేట్స్​ వంటి దేశాలు 84% వ్యర్థ జలాలనే శుద్ధి చేస్తోంది. తిరిగి వాడుకుంటున్నది కేవలం 44%.

ఈ మూడు చేస్తే..

మరి, నీటి ఎద్దడిని తగ్గించడానికి ఏం చేయాలి? దానికి ఎన్నో పరిష్కారాలున్నా, ముందు ఈ మూడు చేస్తే చాలంటోంది డబ్ల్యూఆర్​ఐ. అవేంటి..?

సాగు పద్ధతులు మారాలి: ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఆహార పంటల కోసమే ఎక్కువగా నీటిని వాడుకుంటున్నాయి. కాబట్టి దానిని తగ్గించాలి. వ్యవసాయాన్ని మరింత సమర్థంగా మార్చాలి. అంటే, మెరుగైన  సాగు పద్ధతులను పాటించాలి. రైతులు తక్కువ నీటిని తీసుకునే విత్తనాలను వాడాలి. మెరుగైన నీటి వాడకం పద్ధతులను అనుసరించాలి. ఇబ్బడి ముబ్బడిగా పొలంలో నీళ్లు పెట్టేకన్నా, చుక్కచుక్కనూ ఒడిసిపట్టేలా డ్రిప్​ ఇరిగేషన్​ వంటి పద్ధతులను పాటించాలి. ఆర్థిక సంస్థలూ, నీటి యాజమన్యం కోసం పెట్టుబడులు పెట్టాలి. ఇంజనీర్లూ తమ వంతు సాయం చేయాలి. అన్నింటికన్నా ముఖ్యమైనది, జనాలు తినే తిండిని వేస్ట్​ చేయకూడదు. పడేయొద్దు.

నీటిని ఒడిసి పట్టాలి: పైపులు, ట్రీట్​మెంట్​ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. నీటిని ఒడిసిపట్టేలా వెట్​ల్యాండ్స్, వాటర్​షెడ్డులనూ పెట్టాలి. దాని వల్ల నీటి సరఫరా, నీటి నాణ్యతా సమస్యలు తీరిపోతాయి.

వ్యర్థజలాలను తిరిగి వాడుకోవాలి: చాలా మంది నీటిని చాలా వేస్ట్​ చేస్తుంటారు. అది తగ్గించాలి. డ్రైనేజీల్లోకి పోయే నీటిని శుద్ధి చేసేలా ప్రభుత్వాలు ట్రీట్​మెంట్​ ప్లాంట్లను పెట్టాలి. అలా శుద్ధి చేసిన నీటిని తిరిగి వాడుకోవాలి. మళ్లీ వేస్ట్​ అయ్యే నీటిని తిరిగి ట్రీట్​ చేయాలి. అంతేకాదు, ఆ వేస్ట్​ వాటర్​లోనూ ఎన్నో మంచి ప్రొడక్ట్స్​ ఉంటాయంటోంది డబ్ల్యూఆర్​ఐ. ఉదాహరణకు చైనాలోని షియాంగ్యాంగ్​, అమెరికా రాజధాని వాషింగ్టన్​లోని నీటి శుద్ధి ప్లాంట్ల ద్వారా పోషకాలతో కూడిన బై ప్రొడక్టులను ఉత్పత్తి చేస్తున్నాయట. దాని వల్ల ఖజానాకూ లాభాలు వస్తాయట.

ఇవే ఆ 17 దేశాలు

1.ఖతార్​           2.ఇజ్రాయెల్

3.లెబనాన్        4.ఇరాన్​

5.జోర్డాన్          6.లిబియా

7.కువైట్           8.సౌదీ అరేబియా

9.ఎరిట్రీ             10.యూఏఈ

11.శాన్​ మరినో  12.బహ్రెయిన్

13.ఇండియా     14.పాకిస్థాన్

15.తుర్కెమెనిస్థాన్           16.ఒమన్

17.బోట్స్వానా

మన దగ్గరా అధ్వాన్నమే

చెన్నైలో ఈ ఏడాది కనిపించిన పరిస్థితుల కన్నా తీవ్రమైన పరిస్థితులే ఉన్నాయని ఆక్వాడక్ట్​ నివేదిక చెబుతోంది. దేశం చరిత్రలో ఎన్నడూ లేనంతగా నీటి ఎద్దడిని ఎదుర్కొంటోందని గత ఏడాది నీతి ఆయోగ్​ చెప్పిన మాటలను గుర్తు చేసింది. దేశంలో నదీ జలాలతో పాటు, భూగర్భ జలాలూ బాగా తగ్గిపోయాయని వెల్లడించింది. నదులు, చెరువులు, వాగులు, వంకలూ వంటి వాటిల్లో నీటి జాడ లేదని చెప్పింది. ఉత్తరాది రాష్ట్రాల్లో 1990–2014 మధ్య ఏటా సగటున 8 సెంటీమీటర్ల చొప్పున జలాలు పడిపోయాయని హెచ్చరించింది. నీటి ఎద్దడి నుంచి తప్పించుకుని మెరుగైన నీటి నిర్వహణ చేసేందుకు జలశక్తి శాఖను ఏర్పాటు చేసి పనిచేస్తోందని చెప్పింది. అయితే, దానికి తోడు మెరుగైన నీటిపారుదల పద్ధతులనూ ఇండియా పాటిస్తే బాగుంటుందని సూచించింది. చెరువులు, వరద ప్రవాహ ప్రాంతాలు, భూగర్భజలాలను పునరుద్ధరించి కాపాడుకుంటే పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పింది. వర్షపు నీటిని జాగ్రత్తగా ఒడిసిపట్టాలని చెప్పింది.

Latest Updates