గిన్నిస్ బుక్‌లోకి 17 ఏళ్ల యువతి

ఆరేళ్ల వయసు నుంచి జుట్టు కత్తిరించకుండా పెంచిన ఓ యువతి గిన్నిస్ వరల్డ్ రికార్డులో పేరు నమోదు చేసుకుంది. గుజరాత్‌కు చెందిన 17 ఏళ్ల నీలాన్షి పటేల్‌ 190 సెంటీమీటర్లు జుట్టు పెంచి ఆమె ఈ రికార్డును సాధించింది. గతంలో కూడా ఆమె 170.5-సెంటీమీటర్ల పొడవాటి జుట్టుతో 2018 నవంబర్ 21న మొదటగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు తన సొంత రికార్డును ఆమె బద్దలుకొట్టింది.

‘నేను నా జుట్టును ప్రేమిస్తున్నాను. నా జుట్టును ఎప్పుడూ కత్తిరించుకోవాలనుకోలేదు. గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్‌లో నా పేరును నమోదు చేసుకోవడం నా తల్లి కల. మా అమ్మ కొన్ని పదార్ధాలతో ఇంట్లోనే తయారుచేసే హెయిర్ ఆయిల్‌ను వాడి నేను నా జుట్టును ఇంత పొడవుగా పెంచాను. నేను వారానికి ఒకసారి మాత్రమే నా జుట్టును కడుగుతాను. ఆ తర్వాత అరగంట పాటు ఆరబెట్టి.. జుట్టు పాడవ్వకుండా ఒక గంట పాటు నెమ్మదిగా దువ్వుతాను. నా పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో నాకంటూ ఒక కొత్త ప్రపంచం ఉంది. నా పేరు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కడంతో ప్రపంచం మొత్తం నా గురించి తెలుసుకోవడం ప్రారంభించింది’అని నీలాన్షి తెలిపింది.

తన కెరీర్ లక్ష్యాల గురించి మాట్లాడుతూ.. 12 వ తరగతి చదువుతున్న నీలాన్షి, తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జెఇఇ) మెయిన్స్‌కు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. చదువుకునేటప్పుడు మీ జుట్టు వల్ల ఇంట్రెస్ట్ తగ్గుతుందా అని అడిగితే..‘మమ్మీ నా జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది కలగలేదు. నా చిన్నతనం నుండే అమ్మ నా జుట్టు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేది, కాబట్టి నేను దానికి అలవాటు పడ్డాను’అని తెలిపింది. ఇప్పుడు బాలికల విభాగంలో రికార్డు వచ్చిందని.. భవిష్యత్తులో మహిళల విభాగంలో పొడవాటి జుట్టుతో మరెన్నో ప్రపంచ రికార్డులు సృష్టించాలనుకుంటున్నట్లు నిలాన్షి తెలిపింది.

Latest Updates