179 ఎంటెక్‌‌ కాలేజీలు క్లోజ్‌‌

  • ఐదేండ్లలో భారీగా తగ్గిన కాలేజీలు 
  • 2014-15లో 272,ఈ ఏడాది 93 కాలేజీలు
  • అదే బాటలో ఎంఫార్మసీ కాలేజీలు
  • రూల్స్‌‌ కఠినం, నిర్వహణ భారమే కారణాలు

హైదరాబాద్‌‌, వెలుగు: ఐదేండ్ల క్రితం ఎక్కడచూసినా ఎంటెక్‌‌, బీటెక్‌‌ కాలేజీలే. స్టూడెంట్స్‌‌ కూడా ఎగబడి చేరారు. ప్రభుత్వమూ ప్రోత్సహించింది. ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌తో కాలేజీలన్నీ కళకళలాడాయి. కానీ గడిచిన ఐదేళ్లలో పరిస్థితి తారుమారైంది. హయ్యర్‌‌ ఎడ్యుకేషన్‌‌లో క్వాలిటీ పెంచే క్రమంలో ప్రభుత్వం నిబంధనలను కఠినం చేసింది. పీజీ కోర్సులపై స్టూడెంట్స్‌‌ ఇంట్రస్ట్‌‌ తగ్గడంతో ఈ కోర్సుల్లో చేరే వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఎంటెక్‌‌, ఎంఫార్మసీ కాలేజీలు పదుల సంఖ్యలో క్లోజయ్యాయి. గత ఐదేండ్లలో 179 ఎంటెక్‌‌ కాలేజీలు, 44 ఎంఫార్మసీ కాలేజీలు మూతపడ్డాయి. ఇది మంచి పరిణామమేనని, దీనివల్ల ఎడ్యుకేషన్‌‌లో నాణ్యత పెరుగుతుందని ఉన్నతాధికారులు అంటున్నారు.

నిబంధనలు కఠినమై.. నిర్వహణ భారమై..

ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చిన కాలేజీల వ్యవహారంపై రాష్ట్ర ఏర్పాటు తర్వాత చర్చ జరిగింది. చదువులో ఏ మాత్రం క్వాలిటీ లేదని గ్రహించిన ఉన్నతాధికారులు ఇంజినీరింగ్‌‌, ఫార్మసీ కాలేజీల్లో నిబంధనలు కఠినం చేశారు. అన్ని కాలేజీల్లో స్టూడెంట్స్‌‌కు బయోమెట్రిక్‌‌ అటెండెన్స్‌‌ను తప్పనిసరి చేశారు. గతంలో స్టూడెంట్స్‌‌ కాలేజీకి వచ్చినా, రాకపోయినా కాలేజీలు పెద్దగా పట్టించుకోకపోవడంలో చాలా మంది స్టూడెంట్స్‌‌ ఇంజినీరింగ్‌‌లో జాయినై ప్రైవేట్‌‌ జాబ్స్‌‌ చేశారు. కానీ బయోమెట్రిక్‌‌ అటెండెన్స్‌‌ నేపథ్యంలో తప్పనిసరిగా కాలేజీకి అటెండ్‌‌ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు కాలేజీల్లో వసతులు లేకున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించారు. కానీ మూడేండ్ల నుంచి ఏఐసీటీఈ, యూజీసీ ఒత్తిడి పెంచింది. దీంతో సౌకర్యాలు కల్పించాల్సిన పరిస్థితి.   ఫలితంగా నిర్వహణ భారమై చాలా కాలేజీలు మూతపడ్డాయి. గురువారం నుంచే పీజీఈసెట్‌‌ కౌన్సెలింగ్‌‌ మొదలుకావాల్సి ఉండగా.. ఏఎఫ్‌‌ఆర్సీ కాలేజీల ఫీజులను ఖరారు చేయకపోవడంతో శుక్రవారం నుంచి ప్రారంభించారు.

తగ్గిపోయిన కాలేజీలు, సీట్లు

2014–-15లో బీటెక్‌ కాలేజీలు 354 ఉంటే, ఈ ఏడాది అవి 180కి తగ్గాయి.

2014-–15లో 272 ఎంటెక్ కాలేజీలుంటే అవి 2019-–20 నాటికి 93కు తగ్గిపోయాయి. సీట్లు సంఖ్య కూడా 31,250 నుంచి 7,344 సీట్లకు తగ్గా యి.

2014 -–15లో ఎంఫార్మసీ కాలేజీలు 151 కాలేజీలుంటే, ఈ ఏడాదికి వాటి సంఖ్య107కు పడిపోయింది. సీట్లుకూడా 12,568 నుంచి 3,930కి తగ్గిపోయాయి. ఐదేండ్లలో ఎంఫార్మసీలో 44 కాలేజీలు తగ్గిపోగా, 8,638 సీట్లు తగ్గా యి.

Latest Updates