రాష్ట్రంలో ఒకే రోజు 1892 కేసులు..ప్రకటించనివి 3 వేలకు పైనే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గురువారం 1,213 కేసులు నమోదవగా.. శుక్రవారం అత్యధికంగా 1,892 మందికి వైరస్ పాజిటివ్‌ వచ్చింది. శుక్రవారం నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోనే 1,658 వచ్చాయి. జిల్లాల్లో 234 మందికి పాజిటివ్ వచ్చింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,462కు పెరిగినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే, మరో 3 వేలకుపైగా కేసులకు బులెటిన్‌లో చోటు దక్కలేదు. ఇందులో ఒకే ల్యాబులో చేసిన 2,672 కేసులు ఉన్నాయి.

ఈ ల్యాబులో 3,726 మందికి టెస్ట్ చేస్తే.. 2,672 మందికి పాజిటివ్ వచ్చిందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ వెల్లడించారు. ఈ ల్యాబ్​లో పాజిటివ్ రేట్ ఎక్కువగా ఉన్నందున.. టెస్టుల్లో తప్పులు ఏమైనా జరిగాయేమో చూసిన తర్వాతే కేసుల సంఖ్యను ప్రకటిస్తామని అన్నారు. రాత్రి 9 గంటల టైమ్‌‌తో రిలీజ్‌‌ చేసిన బులెటిన్‌‌లో, అప్పటికే నమోదైన మరో ఆరొందలకుపైగా కేసులను కలపలేదు. ఇవన్నీ కలిపితే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23,700 దాటుతుంది. శుక్రవారం కరోనాతో 8 మంది చనిపోయినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 283కు పెరిగింది. మొత్తం బాధితుల్లో 9,984 మంది కోలుకోగా, యాక్టివ్ కేసులు 10,195 ఉన్నట్టు బులెటిన్‌‌లో వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

లక్షకు చేరిన టెస్టులు

రాష్ట్రంలో టెస్టుల సంఖ్య లక్షకు చేరింది. శుక్రవారం 5,965 టెస్టులు చేయగా, టెస్ట్‌‌ చేసిన ప్రతి వందలో 31.71 శాతం మందికి వైరస్ ఉన్నట్టు తేలింది. మొత్తం టెస్టుల సంఖ్య1,04,118కు చేరింది. ఇందులో 19.65 శాతం మందికి పాజిటివ్ వచ్చింది.

జిల్లాల్లోనూ టెస్టులు

నిజామాబాద్‌‌, గద్వాల, కొత్తగూడెం, కరీంనగర్‌‌‌‌, సూర్యాపేట, ఆసిఫాబాద్‌‌, మెదక్ జిల్లా ఆస్పత్రుల్లో కరోనా టెస్టులకు ఐసీఎంఆర్ పర్మిషన్ ఇచ్చింది. ఆయా ఉమ్మడి జిల్లాల శాంపిళ్లను అక్కడే టెస్ట్ చేయనున్నారు. ఏ జిల్లా శాంపిళ్లను ఎక్కడికి పంపించాలో పబ్లిక్ హెల్త్‌‌ డైరెక్టర్ శుక్రవారం
ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీలో 837 కొత్త కేసులు.. 8 మంది మృతి

అమరావతి, వెలుగు: ఏపీలో శుక్రవారం ఒక్కరోజే 38,898 మందికి టెస్టులు చేయగా 837 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో ఏపీకి చెందినవారు 789 ఉండగా, వేరే స్టేట్స్ నుంచి వచ్చిన 46 మంది, ఫారిన్ నుంచి వచ్చిన ఇద్దరు ఉన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16,934కు చేరింది. 8 మంది చనిపోయారు. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 206కు చేరింది.

ఆలేరు ఎమ్మెల్యేకు కరోనా

యాదాద్రి, వెలుగు: ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు కరోనా సోకింది. ఆమె భర్త, డీసీసీబీ నల్లగొండ చైర్మన్ మహేందర్ రెడ్డి రిపోర్ట్ ఇంకా రాలేదు. ఎమ్మెల్యే సునీత, మహేందర్ రెడ్డి గురువారం హైదరాబాద్ లోని యశోదా హాస్పిటల్లో శాంపిల్స్ ఇచ్చి టెస్టులు చేయించుకున్నారు. అదేరోజు సాయంత్రానికి ఎమ్మెల్యేకు పాజిటీవ్ గా తేలింది. ఆమె సిబ్బందిలోఇద్దరికి కరోనా సోకినట్లు తేలింది. గత నెల 25 నుంచి సునీత అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద ఆలేరు నియోజకవర్గానికి నీరు విడుదల చేశారు. ఆదివారం ఆలేరులో డయాలసిస్ సెంటర్ ప్రారంభించారు. ఆ రోజు మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ అనితా రామచంద్రన్ సహా అధికారులు, జనం పాల్గొన్నారు.

ఆక్రమించే రోజులుపోయినవి..చైనాకు మోడీ వార్నింగ్

Latest Updates