
తమిళనాడు: తనపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిని చంపి తనను తాను రక్షించుకొంది ఓ యువతి. తనను తాను కాపాడుకొనే ప్రయత్నంలో కత్తితో ఆ ఉన్మాదిని హత్య చేసి , చివరకు పోలీసుల దగ్గరకు వెళ్లి అసలు విషయం చెప్పింది. 19 ఏండ్ల ఆ యువతి ధైర్యానికి పోలీసులే షాకయ్యారు. తమిళనాడు లోని తిరువళ్లూరు పీఎస్ పరిధిలో జరిగిందీ సంఘటన. ఎస్పీ అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరువళ్లూరు కు చెందిన ఓ యువతిని ఆమె సమీప బంధువు గత కొన్ని నెలలుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయమై తన కుటుంబసభ్యులకు తెలుపగా.. వారు ఆ వ్యక్తిని (24) మందలించి హెచ్చరించారు.
దానితో కోపం పెంచుకున్న ఆ ఉన్మాది పీకల దాకా తాగి జనవరి 3, ఆదివారం రాత్రి సమయంలో.. ఆ యువతి ఇంటి వద్ద కాపు కాశాడు. ఆమె వాష్ రూమ్ కోసమని బయటకు వచ్చిన సమయంలో.. మెల్లగా ఆమెను సమీపించి అత్యాచారానికి యత్నించాడు. అతని నుంచి వదిలించుకొనే ప్రయత్నంలో గట్టిగా నెట్టివేసింది. ఆ సమయంలో ఆ ఉన్మాది వెంటతెచ్చుకున్న కత్తి కింద పడడంతో.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా , ఆ కత్తిని అందుకొని.. అతని గొంతు కోసి చంపేసింది. అదే ధైర్యంతో దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి తాను చేసిన హత్య గురించి ఏ మాత్రం కంగారు లేకుండా పోలీసులకు వివరించింది. ఆమె చెప్పినదంతా విన్న పోలీసులు.. ప్రాణ, మాన రక్షణ కోసం ఆ యువతి ఈ హత్య చేసిందని, ఆమెపై సెక్షన్ 100 కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు.