ఖర్చులకు మరో రూ.2.36 లక్షల కోట్లు కావాలి: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

పార్లమెంట్‌‌ ఆమోదం కోరిన నిర్మలా సీతారామన్‌‌

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2.36 లక్షల కోట్లను అదనంగా ఖర్చు చేసేందుకు అనుమతివ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్‌‌ను కోరారు. కరోనా సంక్షోభంతో ఖర్చులు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ ఖర్చులను చేరుకునేందుకు ఈ అదనపు డబ్బులు సాయపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. అదనంగా రూ.1.67 లక్షల కోట్లు అవసరమవుతుందని,  మిగతా రూ.69 వేల కోట్లను వివిధ డిపార్టమెంట్ల సేవింగ్స్ నుంచి  ప్రభుత్వం సమకూర్చుకుంటుందని సీతారామన్‌‌ వివరించారు. కాగా, సీతారామన్‌‌ కోరిన ఈ అదనపు డబ్బులలో మూల ధన వ్యయాల కోసం కేవలం రూ. 5,462 కోట్లను మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేయనుంది. క్రూడ్‌‌ ఆయిల్‌‌ నిల్వల కోసం రూ. 3,184 కోట్లను ఇండియన్‌‌ స్ట్రాటజిక్‌‌ పెట్రోలియం రిజర్వ్‌‌స్‌‌ లిమిటెడ్‌‌కు కేటాయించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం గ్రాస్‌‌ బారోవింగ్‌‌ ప్రొగ్రామ్‌‌ కింద రూ. 12 లక్షల కోట్లను అప్పు చేస్తామని ఈ ఏడాది మే నెలలో ప్రభుత్వం ప్రకటించింది. ఇది బడ్జెట్‌‌లో చెప్పిన రూ. 7.8 లక్షల కోట్లు కంటే రూ.  4.2 లక్షల కోట్లు ఎక్కువ. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు భారీగా పెరిగే అవకాశం ఉంది. నిర్మలా సీతారామన్ కోరిన ఈ అదనపు డబ్బులు ప్రధానంగా ప్రభుత్వం ప్రకటించిన గరీబ్‌‌ కళ్యాణ్‌‌ యోజన, ఆత్మనిర్భర్‌‌‌‌ ప్యాకేజిల కోసం ఖర్చు చేసే అవకాశం ఉంది.  ఫుడ్‌‌ సబ్సిడీ, ధరల స్టెబిలైజేషన్ ఫండ్‌‌ కోసం కన్జూమర్‌‌‌‌ అఫైర్స్‌‌ మినిస్ట్రీకి రూ. 16,000 కోట్లను ప్రభుత్వం కేటాయించనుంది. 15 వ ఫైనాన్స్‌‌ కమీషన్‌‌ రికమండేషన్స్ మేరకు  రెవెన్యూ డెఫిసిట్‌‌లను చేరుకోవడానికి రాష్ట్రాలకు రూ. 46,602 కోట్లను గ్రాంట్‌‌గా ఇవ్వనుంది. కరోనా కట్టడిలో కీలకంగా ఉన్న హెల్త్‌‌ , ఫ్యామిలీ మినిస్ట్రీకి అదనంగా రూ. 14,232 కోట్లను ప్రభుత్వం కేటాయించనుంది. గరిబ్‌‌ కళ్యాణ్‌‌ యోజన స్కీమ్‌‌ కోసం లేబర్‌‌‌‌ అండ్‌‌ ఎంప్లాయిమెంట్‌‌ మినిస్ట్రీకి రూ. 4,860 కోట్లను, ఆత్మనిర్భర్‌‌‌‌ ప్యాకేజిలో భాగంగా అర్హులైన వారికి డైరక్ట్ బెనిఫిట్స్‌‌ అందించేందుకు రూరల్‌‌ డెవలప్‌‌మెంట్ మినిస్ట్రీకి రూ. 33,771 కోట్లను కేటాయించనుంది. రూరల్ జాబ్‌‌ గ్యారెంటీ స్కీమ్‌‌ కోసం రూ. 40,000 కోట్లను ఖర్చు చేయనుంది.

ప్రభుత్వ బ్యాంకులకు రూ. 20 వేల కోట్లు..

రీక్యాపిటలైజేషన్ బాండ్స్‌‌ను ఇష్యూ చేయడం ద్వారా ప్రభుత్వ బ్యాంకులకు రూ. 20 వేల కోట్ల క్యాపిటల్‌‌ను అందించాలని ప్రభుత్వం ప్లాన్స్ వేస్తోంది. దీని కోసం నిర్మలా సీతారామన్‌‌  సోమవారం పార్లమెంట్‌‌ ఆమోదం కోరారు. కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న బ్యాంకులకు ఈ డబ్బులు సాయపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, రీక్యాపిటలైజేషన్ బాండ్లను ఇష్యూ చేయడం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ద్రవ్యలోటుపై ఎటువంటి ప్రభావం ఉండదు. ‘రీక్యాపిటలైజేషన్‌‌ బాండ్ల’ పద్ధతిలో ప్రభుత్వం బాండ్లను ఇష్యూ చేస్తుంది. ఈ బాండ్లను నేషనల్‌‌ బ్యాంకులు సబ్‌‌స్క్రయిబ్‌‌ అవుతాయి.ఈ డబ్బులను తిరిగా బ్యాంకులకు ప్రభుత్వం క్యాపిటల్‌‌గా అందిస్తుంది. కాగా, ప్రభుత్వ బ్యాంకులకు క్యాపిటల్‌‌ను  అందించడంపై 2020–21 బడ్జెట్‌‌లో ఎటువంటి కేటాయింపులు లేవు.

Latest Updates