4రోజుల్లో 2లక్షల కోట్లు నష్టం

4రోజుల్లో 2లక్షల కోట్లు నష్టం
  • తగ్గుతున్న టెస్లా సీఈఓ ఎలన్‌‌ మస్క్ సంపద
  • కంపెనీ షేర్లు పడుతుండడమే కారణం
  • కిందటేడాది 743% పెరిగిన టెస్లా షేరు

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారిన టెస్లా సీఈఓ ఎలన్ మస్క్, ప్రస్తుతం బ్లూమ్బర్గ్‌‌ బిలినియర్‌‌ ఇండెక్స్‌‌ ర్యాంకింగ్స్‌ లో వెనక్కి వెళ్తున్నారు. ఎంత వేగంగా ఆయన సంపద పెరిగిందో అంతేవేగంగా పడిపోతుండడం విశేషం. గత 4 రోజుల్లోనే  ఆయన సంపద 27 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 2 లక్షల కోట్లు) తగ్గింది. టెస్లా షేర్లు పడుతుండడంతో మస్క్ సంపద తగ్గుతోంది. టెస్లా షేరు శుక్రవారం ఇంట్రాడేలో  13 శాతానికి పైగా పడింది. చివరికి 3.8 శాతం లాస్‌‌తో 597.95 డాలర్ల వద్ద క్లోజయ్యింది. గత నాలుగు వారాల్లోనే  టెస్లా మార్కెట్‌‌ క్యాప్ ఏకంగా 230 బిలియన్ డాలర్లు పతనమయ్యింది. ఈ ఏడాది జనవరిలో కంపెనీ మార్కెట్ క్యాప్ ఆల్‌‌టైమ్‌‌ హై అయిన 837 బిలియన్‌‌ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఇది 574 బిలియన్ డాలర్లకు పడిపోయింది. టెస్లా షేర్లు పెరుగుతున్నప్పుడు మస్క్ సంపద ఏకంగా 210 బిలియన్‌‌ డాలర్లకు తాకింది.  అప్పటి వరకు ప్రపంచ ధనవంతుడిగా కొనసాగుతున్న అమెజాన్ ఫౌండర్‌‌‌‌ జెఫ్ బెజోస్‌‌ను దాటి మస్క్ నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు. కానీ ఆ స్థాయి నుంచి మస్క్ సంపద ఏకంగా 53 బిలియన్ డాలర్లు తగ్గి శుక్రవారం నాటికి 156.9 బిలియన్‌‌ డాలర్లకు పడిపోయింది. బ్లూమ్‌‌బర్గ్‌‌ బిలినియర్ ఇండెక్స్‌‌లో మస్క్ రెండో పొజిషన్‌‌లో కొనసాగుతున్నారు. అయినప్పటికీ బెజోస్‌‌–మస్క్‌‌ల సంపదల మధ్య 20 బిలియన్ డాలర్ల తేడా ఉండడం గమనార్హం.

బాగా పెరిగాయి..ఇప్పుడు పడుతున్నాయి

కిందటేడాది టెస్లా షేర్లు 743 శాతం పెరిగాయి. కొత్త ఏడాదిలో కూడా తమ జోరును కొనసాగించాయి. బాండ్‌‌ ఈల్డ్‌‌లు పెరుగుతుండడం, కంపెనీ షేర్ల వాల్యుయేషన్‌‌ ఎక్కువగా ఉండడంతో టెస్లా షేర్లను ఇన్వెస్టర్లు అమ్మేస్తున్నారు. ఎస్‌‌ అండ్‌‌ పీ 500 ఇండెక్స్‌‌, నాస్‌‌డాక్‌‌ 100 స్టాక్ ఇండెక్స్‌‌లో శుక్రవారం అతిపెద్ద లూజర్‌‌‌‌గా ఈ షేరు నిలిచింది.  నాస్‌‌డాక్‌‌ 100 ఇండెక్స్‌‌ వరసగా మూడో వారాన్ని కూడా నష్టాల్లో ముగించింది. కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌ తర్వాత వరసగా మూడు వారాలు ఈ ఇండెక్స్‌‌ నెగిటివ్‌‌లో క్లోజవ్వడం ఇదే మొదటిసారి. కేవలం టెస్లా షేర్లు పడుతుండడం వలనే మస్క్ సంపద తగ్గడం లేదు. బిట్‌‌కాయిన్ ధరలో అనిశ్చితి కొనసాగుతుండడంతో కూడా ఆయన సంపద పడుతోంది. బిట్‌‌కాయిన్‌‌లో 1.5 బిలియన్‌‌ డాలర్లను కిందటి నెలలో టెస్లా ఇన్వెస్ట్ చేసింది. ఈ ప్రకటన విడుదలైన రెండు వారాల తర్వాత బిట్‌‌కాయిన్‌‌ వలన ఆయన సంపద 15 బిలియన్ డాలర్లు తగ్గింది. బిట్‌‌కాయిన్, ఇతర క్రిప్టో కరెన్సీలు ఎక్కువ వాల్యుయేషన్‌‌తో కనిపిస్తున్నాయని మస్క్‌‌ ట్వీట్‌‌ చేశారు. దీంతో బిట్‌‌కాయిన్ ధర భారీగా పడింది. ఇతర బిలినియర్లు కూడా తమ సంపదను భారీగా లాస్ అవుతున్నారు. ఆసియాలో అత్యంత ధనవంతుడిగా కొనసాగిన చైనీస్ బాటిల్ కంపెనీ ఓనర్‌‌‌‌ జాంగ్‌‌ శాంసన్‌‌ కొన్ని రోజుల్లోనే 22 బిలియన్ డాలర్లను నష్టపోయారు. దీంతో  రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ అధినేత ముకేశ్‌‌ అంబానీ తిరిగి తన నెంబర్ వన్ పొజిషన్‌‌ను దక్కించుకున్నారు. మరోవైపు రెడిట్‌‌ డే ట్రేడర్ల నెక్స్ట్‌‌ టార్గెట్‌‌ లోన్లను ఇచ్చే కంపెనీ రాకెట్‌‌ కో. అనే రూమర్లు రావడంతో ఆ కంపెనీ షేర్లు సోమవారం భారీగా పెరిగాయి. దీంతో ఆ ఒక్క రోజే ఈ కంపెనీ చైర్మన్‌‌ డాన్ గిల్బర్ట్‌‌ సంపద 25 బిలియన్‌‌ డాలర్లు ఎగిసింది. ఆ తర్వాత నాలుగు రోజుల్లోనే 24 బిలియన్ డాలర్లను గిల్బర్ట్‌‌ నష్టపోయారు. ఈ ఏడాది ఎక్కువగా ఆల్ఫాబెట్‌‌ ఫౌండర్లు‌‌ సెర్జీ బ్రిన్‌‌, ల్యారీ పేజ్‌‌ల సంపద 13 బి లియన్‌‌ డాలర్ల చొప్పున పెరగడం విశేషం.