బట్టలుతికేందుకు వెళ్లి మృత్యు ఒడికి : తల్లీకూతుళ్లు నలుగురు మృతి

శ్రీకాకుళం : ఇద్దరు బిడ్డలను కాపాడేందుకు చేసిన ప్రయత్నంలో.. వారితో పాటు…  ఇద్దరు తల్లులు చనిపోయారు. బట్టలు ఉతుక్కుందామని నదికి వెళ్లిన చిన్నారులు నదిలో మునిగిపోగా,వారిని రక్షించేందుకు వెళ్లిన వారి తల్లులు కూడా మృత్యవాత పడ్డారు.ఈ విషాదకర సంఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామం వద్ద జరిగింది.

గ్రామానికి చెందిన ఇద్దరు తోటికోడళ్లు 32 ఏళ్ళ నాథం ఢిల్లీశ్వరి తన కుమార్తె 12 ఏళ్ల అంజలితో, 30 ఏళ్ల నాథం కమల తన కుమార్తె 11 ఏళ్ల గాయత్రితో కలసి సోమవారం సాయంత్రం నదిలో బట్టలు ఉతుక్కుందామమని వెళ్లారు. తల్లులిద్దరు బట్టలు ఉతుకుతుండగా పిల్లలు ఇద్దరు నదిలో ముందుకు వెళ్తూ ప్రమాదవశాత్తు లోతుగా ఉన్న ప్రాంతం వద్ద మునిగిపోయారు.

ఇది గమనించిన తల్లులిద్దరు తమ పిల్లలను కాపాడుకునేందుకు వెళ్లి వారు కూడా మునిగిపోయారు. గ్రామస్తులు.. నీళ్లలో మునిగిపోయిన వారిని వెలికితీసి ఇచ్ఛాపురం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే నలుగురు మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.

ఢిల్లీశ్వరి భర్త సీతారాం ఆటో డ్రైవర్ గా కుటుంబాన్ని నడుపుతుండగా, కమల భర్త నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. ఆసుపత్రికి తీసుకురాగానే డాక్టర్లు స్పందించలేదని గ్రామస్తులు హాస్పిటల్ దగ్గర ఆందోళన చేశారు. తల్లి,పిల్లలు చనిపోవడంతో.. ఇచ్ఛాపురం ఆవేదన చెందుతోంది.

Latest Updates