డ్రగ్స్ కేసులో హీరోయిన్ సంజనకు బెయిల్ ఇవ్వకుంటే బాంబులతో పేల్చేస్తాం: జడ్జికి బెదిరింపు లెటర్

కన్నడ హీరోయిన్, బుజ్జిగాడు మూవీ ఫేమ్ సంజనకు బెయిల్ ఇవ్వకుంటే బాంబులో పేల్చేస్తామంటూ బెంగళూరులోని ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు జడ్జికి సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు లేఖ పంపారు. కర్ణాటకలో సంచలనం రేపిన శాండిల్‌వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంజనతో పాటు మరో నటి రాగిణిని, ఆగస్టు 11న బెంగళూరులో జరిగిన హింసాత్మక అల్లర్ల కేసులో నిందితులను విడుదల చేయాలని అందులో డిమాండ్ చేశారు. బెదిరింపు లేఖతో పాటు కొన్ని వైర్లు, డిటోనేటర్ లాంటి పరికరాన్ని కూడా పంపారు. తమ డిమాండ్లకు ఒప్పుకోకుంటే తాము దానిని యాక్టివేట్ చేస్తామని హెచ్చరించారు.

బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టుకే ఈ బెదిరింపు లేఖ రావడంతో.. దీనిపై పోలీసులకు కోర్టు అధికారులు సమాచారం ఇచ్చారు. ఆ పార్శిల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిపై దర్యాప్తు షురూ చేశారు. ఆ లెటర్ తముకూరు జిల్లా చేలూర్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వీటిని రాజశేఖర్, వేదాంత్ అనే ఇద్దరు పంపినట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ఆ ఇద్దరినీ మంగళవారం ఉదయం బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. వాళ్లు ఇలా ఎందుకు చేశారు? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అన్న దానిపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే నిందితులు పంపిన డిటోనేటర్ లాంటి వస్తువు డమ్మీ అని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. దానిని పరిశీలించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని తెలిపారు.

Latest Updates