నిజాం టిఫిన్ బాక్స్ కొట్టేసిన ఇద్దరు యువకులకు జైలు శిక్ష

నిజాం అంత లగ్జరీగా ఉండాలనుకుని కలలు కన్నారు.. చివరికి కటకటాల వెనక్కి వెళ్లారు. నిజాం రాజులాగా బంగారు పాత్రల్లో తినాలని ఆశ పడ్డారు. ఆఖరికి చిప్పకూడు మిగిలిగింది. నిజాం మ్యూజియంలోని బంగారు టిఫిన్ బాక్స్, టీ కప్స్ దొంగిలించిన ఇద్దరికి జైలు శిక్ష పడిందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. సెన్సేషనల్ నిజాం మ్యూజయం దొంగతనం కేసును రికార్డ్ టైంలో సాల్వ్ చేశామని చెప్పారు. నేరస్తులకు కోర్టు రేండేళ్ల జైలు శిక్ష విధించిందని తెలిపారు. దోషులను పట్టుకోవడంలో, సాక్ష్యాలను సేకరించడంలో పబ్లిక్ సహకారం ఉందని చెప్పారు.

దోషులు ఫన్నీ సమాధానం

హైదరాబాద్‌లోని నిజాం మ్యూజియంలో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వాడిన బంగారు టిఫిన్ బాక్స్, టీ కప్, సాసర్, స్పూన్‌ను ఇద్దరు యువకులు దొంగిలించారు. రెండు కిలోల బరువున్న ఆ వస్తువుల విలువ సుమారు రూ.40 కోట్లు ఉంటుంది. అయితే వీటిని తాము అమ్మడం కోసమే కొట్టేయలేదని పోలీసులకు పట్టుబడిన తర్వాత ఆ ఇద్దరు చెప్పారు. నిజాం రాజు లగ్జరీ లైఫ్‌ని తామూ టేస్ట్ చేయాలని వాటిని దొంగిలించామని తెలిపారు. ఈ రీజన్ పోలీసులకు నవ్వు తెప్పించింది. ఆ ఇద్దరు దొంగలు ఆ వస్తువును కొట్టేశాక చేసిన పనులన్నీ తెలిశాక ఔరా అని షాకయ్యారు.

పది రోజుల్లో అరెస్టు.. ఆ గ్యాప్‌లో దొంగలు ఏం చేశారంటే..

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన మహమ్మద్ గౌస్ పాషా (23), మహమ్మద్ ముబీన్ (24) కలిసి పక్కా ప్లాన్ వేసి నిజాం వస్తువులను కొట్టేశారు. ఈ ఇద్దరు కజిన్స్, చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన బెస్ట్ ఫ్రెండ్స్. గౌస్ హైదరాబాద్‌లోనే తాపీ మేస్త్రీగా పని చేసేవాడు. ముబీన్ సౌదీలో వెల్డర్‌గా పని చేస్తూ అక్కడ తోటి కార్మికుడిని కొట్టడంతో ఇండియాకి తిప్పిపంపేశారు. ఈ ఇద్దరూ చిన్ననాటి నుంచి జీవితంలో ఎప్పటికైనా మంచి లగ్జరీ లైఫ్ స్టైల్‌లో బతకాలని కలలు కనేవారు. అలా ఓ రోజు సరదాగా హైదరాబాద్ పురానా హవేలీలోని నిజాం మ్యూజియం చూడానికి వెళ్లారు. అక్కడ నిజాం గోల్డ్ టిఫిన్ బాక్స్, కప్స్, గోల్డ్ స్పూన్ చేసిన వీరికి ఎలాగైనా వాటిని కాజేయాలన్న ఆలోచన వచ్చింది. రెండు మూడు రోజుల పాటూ రెక్కీ చేసి.. 2018 సెప్టెంబరు 3న దొంగతనానికి రెడీ అయ్యారు. పోలీసులకు దొరక్కూడదని ఫేస్ మాస్కులు వేసుకుని, చేతికి గ్లౌజులు తొడుక్కుని తెల్లవారుజామున 3 గంటల టైంలో మ్యూజియం కిటికీని బ్రేక్ చేసి లోపలికి దూకారు. పోలీసుల్ని డైవర్ట్ చేయడానికి సిమ్ కార్డు లేని ఫోన్ చేతిలో పట్టుకుని సీసీ కెమెరా ముందు మాట్లాడినట్లు ఫోజులిచ్చారు. ఆ తర్వాత ఆ వస్తువుల్ని కొట్టేసి పరారయ్యారు.
మ్యూజియంలో కొట్టేసిన వస్తువులతో వెంటనే పారిపోతే పోలీసులకు దొరుకుతామేమోనని ముందుగా ముంబైకి వెళ్తున్నట్లు ఆ హైవేపై చక్కర్లు కొట్టి.. తిరిగి అడ్డదారిలో హైదరాబాద్‌లోని ఇంటికి చేరుకున్నారు. రెండ్రోజుల పాటు ఇంటి పక్కన గుంత తీసి పాతిపెట్టారు. ఆ తర్వాత వాటిని తీసుకుని బైక్‌పై ముంబై ప్రయాణమయ్యారు. కానీ జహీరాబాద్ దగ్గర బైక్ చెడిపోవడంతో దాన్ని అక్కడ వదిలేసి బస్సులో ముంబై వెళ్లిపోయారు. ఓ హోటల్‌లో దిగి నాలుగైదు రోజుల పాటు ఉన్నారు. రోజూ బయటి నుంచి ఫుడ్ తెచ్చుకొని, దాన్ని ఆ బంగారు టిఫిన్ బాక్సులో వేసుకుని గోల్డ్ స్పూన్‌తో తినడం, వాటర్ బంగారు కప్‌లో పోసుకుని తాగడం.. ఇదే పనిగా చేశారు. ఆ తర్వాత వాటిని అమ్మడానికి రకరకాల ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యారు. దీంతో విసిగిపోయి హైదరాబాద్ వచ్చేసి హిమయత్ సాగర్‌లో దాక్కున్నారు.

బైక్ పట్టించింది..

ముంబై వెళ్లేటప్పుడు బైక్‌ను జహీరాబాద్ దగ్గర వదిలేయడం వల్ల దొంగలు ఈజీగా దొరికిపోయారు. ఆ బైక్ మ్యూజియం దగ్గర సీసీ కెమెరాల్లో కనిపించింది. అదే జహీరాబాద్‌లో దొరకడంతో పోలీసులకు క్లూ దొరికింది. దాని ఆధారంగా వాళ్ల అడ్రస్ కనిపెట్టి.. నిఘా వేశారు. స్థానికుల సహకారంతో దొంగలిద్దరూ హైదరాబాద్ రాగానే పక్కా ఇన్ఫర్మేషన్‌తో 2018 సెప్టెంబరు 11న అరెస్టు చేశారు. విచారణ అనంతరం ఇప్పుడు ఆ ఇద్దరికీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది.

దోషులను అరెస్టు చేశాక రికవరీ చేసిన వస్తువులను చూపిస్తున్న సీపీ అంజనీకుమార్ (ఫైల్ ఫొటో)

Latest Updates