20ఏళ్లుగా అక్కడే దహనం.. సమాచారం లేదన్న రైల్వే.. తప్పెవరిది మరి?

అమృత్ సర్ : అమృత్ సర్ రైల్వే ప్రమాదం వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. దీనిని ఓ యాక్సిడెంట్ గా చూస్తున్నామే తప్ప… మానవ తప్పిదంగా చూడటం లేదని.. అటు ప్రభుత్వం.. ఇటు అధికారులు అంటున్నారు. ఇదో ప్రమాదం… దీనిలో ఎవరినీ నిందించాల్సింది లేదని సాంస్కృతిక శాఖ మంత్రి నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ అన్నాడు.

అమృత్ సర్ విషాదంలో రైల్వేను నిందించడం కరెక్ట్ కాదన్నారు రైల్వే బోర్డు ఛైర్మన్‌ అశ్విని లొహాని. రైలును ఆపేందుకు డ్రైవర్‌ అత్యవసర బ్రేక్స్‌ కూడా వేసినట్లు తెలిసిందని ఆయన అన్నారు. ఘటన జరిగిన ప్రాంతం లెవల్ క్రాసింగ్ కూడా కాదన్నారు. స్టేషన్ల మధ్య  పట్టాలపై రైళ్లు నిర్ణీత వేగంతో వెళ్తాయని, ప్రజలు ట్రాక్‌ ల పైకి వస్తారని ఊహించలేమని ఆయన అన్నారు. పట్టాల పక్కన దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు రైల్వే అధికారులకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఒక వేళ డ్రైవర్ సడెన్ బ్రేకులు వేసి ఉంటే.. రైలు బోగీలు ఢీకొని ఊహించనంత ప్రమాదం జరిగి ఉండేదన్నారు. లెవల్‌ క్రాసింగ్‌ ల దగ్గర మాత్రమే రైల్వే సిబ్బంది ఉంటారని… స్టేషన్ల మధ్య సిబ్బంది ఉండరు అని వివరించారు. అమృత్‌ సర్‌ స్థానిక అధికారులకు ఈ ఉత్సవాల గురించి సమాచారం ఉందని.. స్థానిక యంత్రాంగమే దీనికి బాధ్యత వహించాలని అన్నారు. ఇది నిబంధనలను అతిక్రమించి ప్రజలు రైలు పట్టాల పైకి వచ్చిన ఘటన అని తెలిపారు.

ఐతే… జనం వాదన మరోలా ఉంది. జలంధర్, అమృత్ సర్ మధ్య జోదా ఫాటక్ ఏరియాలో… రైల్వే ట్రాక్ కు ఆనుకుని ఉన్న ఖాళీ ప్రదేశంలో రావణ బొమ్మ దహనం కార్యక్రమం ఈసారి మాత్రమే జరిగింది కాదంటున్నారు స్థానికులు. ఇరవై ఏళ్లుగా ఇక్కడే రావణ దహనం చేస్తున్నారని…. ఐతే.. కొంత డిస్టెన్స్ లో జరుగుతుండేదని చెప్పారు. ఈసారి మాత్రమే ప్రమాదం జరిగిందంటున్నారు స్థానికులు.

అటు రైల్వే అధికారులు… ఇటు ప్రభుత్వ యంత్రాంగం తప్పు తమది కాదంటూ తప్పించుకుంటున్నారని.. మరి తమకు న్యాయం చేసేది ఎవరని బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు ఈ ప్రమదంలో మృతుల సంఖ్య 61కు చేరుకొంది.

Posted in Uncategorized

Latest Updates