బిడెన్ బృందంలో 20 మంది ఇండో-అమెరిక‌న్లు

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ తన పరిపాలన బృందంలో 20 మంది భార‌తీయుల(ఇండియ‌న్-అమెరిక‌న్‌ల)‌ను నియ‌మించుకున్నారు. దేశ జ‌నాభాలో కేవ‌లం ఒక శాతంగా ఉన్న భార‌త సంత‌తి వ్య‌క్తుల‌కు ఇన్ని కీల‌క ప‌ద‌వులన క‌ట్ట‌బెట్ట‌డం తొలిసారి. ఈ 20 మందిలో 17 మంది వైట్‌హౌజ్ ‌లోనే త‌మ కార్యాక‌లాపాలు కొన‌సాగించ‌నుండ‌టం మ‌రో విశేషం. అమెరికా తొలి వైస్ ప్రెసిడెంట్‌గా ఓ మ‌హిళ (క‌మలా హారిస్‌) ప్రమాణం చేయ‌నుండ‌ట‌మే ఓ రికార్డు అయితే.. కొత్త ప్ర‌భుత్వంలో ఇంత‌మంది ఇండియ‌న్‌-అమెరిక‌న్లు ఉండ‌టం మ‌రో రికార్డు.

జనవరి 20న యునైటెడ్ స్టేట్స్ యొక్క 46 వ అధ్యక్షుడిగా బిడెన్, ఉపాధ్యక్షురాలుగా కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బిడెన్ బృందంలోని 20 మందిలో 13 మంది మ‌హిళ‌లే. వీరిలో ఒక‌రు నీరా టాండ‌న్‌. ఆమెను వైట్‌హౌజ్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బ‌డ్జెట్‌కు డైరెక్ట‌ర్‌గా బైడెన్ నియ‌మించారు. ఇక డాక్ట‌ర్ వివేక్ మూర్తిని యూఎస్ స‌ర్జ‌న్ జ‌న‌ర‌ల్‌గా నామినేట్ చేశారు. ఇక వ‌నితా గుప్తాకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ జ‌స్టిస్ అసోసియేట్ అటార్నీ జ‌న‌ర‌ల్ ప‌ద‌వి ద‌క్కింది. ఫ‌స్ట్ లేడీ కాబోతున్న జిల్ బైడెన్‌కు పాల‌సీ డైరెక్ట‌ర్‌గా మాలా అడిగా.. ఫ‌స్ట్ లేడీ డిజిట‌ల్ డైరెక్ట‌ర్ ఆఫ్ ద ఆఫీస్‌గా గ‌రిమా వ‌ర్మ‌, ఫ‌స్ట్ లేడీ డిప్యూటీ ప్రెస్ సెక్ర‌ట‌రీగా స‌బ్రినా సింగ్‌ల‌ను బైడెన్ నియ‌మించారు. రైతు విదేశీ సేవా అధికారి ఉజ్రా జయను పౌర భద్రత, ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కుల అండర్ సెక్రటరీగా నియ‌మించారు.

కాశ్మీర్‌కు చెందిన ఇద్ద‌రు వ్య‌క్తులు మొట్ట‌మొద‌టిసారిగా బిడెన్ ప్ర‌భుత్వంలో చోటు సంపాదించారు. వారిలో ఒక‌రు వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీలో పార్ట్‌నర్‌షిప్ మేనేజర్‌గా ఎంపికైన ఈషా షా, మ‌రొక‌రు సమీరా ఫాజిలి. వైట్ హౌస్ లోని యుఎస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ (ఎన్ఇసి) లో ఆమె డిప్యూటీ డైరెక్టర్ గా నియ‌మితుల‌య్యారు. భ‌ర‌త్ రామ్మూర్తి అనే మ‌రో ఇండో అమెరిక‌న్ కూడా డిప్యూటీ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. గ‌తంలో వైట్‌హౌజ్‌లో ప‌ని చేసిన గౌత‌మ్ రాఘ‌వ‌న్‌.. ఇప్పుడు ప్రెసిడెన్షియ‌ల్ ప‌ర్స‌న‌ల్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్ట‌ర్‌గా నియ‌మితుల‌య్యారు.

ఏడాదిగా బైడెన్ శిబిరంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న విన‌య్ రెడ్డికి డైరెక్ట‌ర్ స్పీచ్‌రైట‌ర్ ప‌ద‌వి ద‌క్కింది. అధ్య‌క్షుడి అసిస్టెంట్ ప్రెస్ సెక్ర‌ట‌రీగా వేదాంత్ ప‌టేల్, త‌రుణ్ చాబ్రా, సుమోనా గుహ‌, శాంతి క‌ళాతిల్ ల‌కు టెక్నాలజీ అండ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ లో కీల‌క ప‌ద‌వులు ద‌క్కాయి

Latest Updates