
- విచ్చలవిడిగా కోర్సులు, సీట్లకు సర్కారు పర్మిషన్
- సీట్ల సంఖ్య ఎక్కు వ.. స్టూడెంట్లు తక్కువ
- సర్కారు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇయ్యక ఇబ్బందులు
- ఇప్పుడు కరోనాతో మరింత దెబ్బ
- ఇప్పటికే ఆరేండ్లలో 325 కా లేజీలు బంద్
- గతేడాది 52, ఈసారి 59 కా లేజీల్లో జీరో అడ్మిషన్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఆగమాగం అవుతున్నయి. స్టూడెంట్ల కంటే సీట్ల సంఖ్య ఎక్కువైపోయి.. అడ్మిషన్లుగాక, సర్కారు ఫీజు రీయింబర్స్మెంట్ టైముకు ఇవ్వక ఇబ్బందులు పడ్తున్నయి. మెయింటెనెన్స్ ఖర్చులు, అప్పులు పెరిగిపోతుండటంతో మేనేజ్మెంట్లు కాలేజీలను అమ్ముకుంటున్నయి. కొనేవారెవరూ దొరక్కపోతే మూసేస్తున్నాయి. ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో చాలా కాలేజీలు మూసివేసే పరిస్థితికి చేరుకున్నాయి. సర్కారు ఇష్టమొచ్చినట్టుగా కాలేజీలు, కోర్సులు, సీట్ల పెంపునకు పర్మిషన్ ఇవ్వడంతో ఈ సమస్య తలెత్తిందని ఎడ్యుకేషన్ఎక్స్పర్టులు స్పష్టం చేస్తున్నారు.
మెల్లగా తగ్గిపోతున్నయి
ఉమ్మడి ఏపీ విభజన టైం (2014–15)లో తెలంగాణలో 1,151 ప్రైవేటు డిగ్రీ కాలేజీలున్నాయి. ఈ ఏడాది ఆ సంఖ్య 826 కు తగ్గింది. ఆరేండ్లలో 325 కాలేజీలు మూతపడ్డాయి. ఈ ఏడాది కూడా 59 ప్రైవేటు కాలేజీల్లో ఒక్కరూ చేరలేదు. మరో వంద కాలేజీల్లో చాలా తక్కువగా అడ్మిషన్లు జరిగాయి. 2020–21 అకడమిక్ ఇయర్లో రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 24 వేల 315 డిగ్రీ సీట్లుంటే.. 2 లక్షల 20 వేల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మరో రెండు లక్షల వరకు ఖాళీగా ఉన్నాయి. జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో అడ్మిషన్లు బాగానే ఉన్నా.. రూరల్ ప్రాంతాల్లోని కాలేజీల్లో స్టూడెంట్లు చేరడం లేదు.
గతంలో ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లు, స్టాఫ్.. ఇంటర్ స్టూడెంట్ల ఇండ్లకు వెళ్లి తమ కాలేజీలో చేరాలని కోరేవారు. కాలేజీల్లో అడ్మిషన్లను పెంచుకునేవారు. కానీ ఇప్పుడు దోస్త్ విధానంలో ఆన్లైన్ అడ్మిషన్లు చేస్తుండటంతో స్టూడెంట్లు రావడం లేదని మేనేజ్మెంట్లు చెప్తున్నాయి. పెద్ద కాలేజీలు స్టూడెంట్లకు ఎదురుడబ్బులిచ్చి.. రీయింబర్స్మెంట్ ఆధారంగా అడ్మిషన్లు తీసుకుంటున్నాయి.
200 కాలేజీలు అమ్మకానికి రెడీ!
ప్రస్తుతం రాష్ట్రంలో 200కు పైగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు అమ్మకానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. కిందటి నాలుగేండ్లలో వంద కాలేజీలు మేనేజ్మెంట్లు మారినట్టు హయ్యర్ ఎడ్యుకేషన్కౌన్సిల్ నుంచి అప్రూవల్ తీసుకున్నాయి. 2020–21 అకడమిక్ ఇయర్‌లోనూ 27 కాలేజీలు మేనేజ్మెంట్ చేంజ్కోసం అప్లై చేసుకున్నాయి. అసలు ఒక్కో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు 40, 50 లక్షల పెట్టుబడి అవసరం. స్టాఫ్ జీతాల కోసం నెలకు రూ.4 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఏటా 70 శాతం సీట్లు నిండితేనే.. కాలేజీ మెయింటెనెన్స్‌కు సరిపోతుందని, తక్కువ అడ్మిషన్లు అయితే నష్టాలే దిక్కు అని ఓ కాలేజీ ప్రతినిధి పేర్కొన్నారు. ఇటీవల కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు నష్టాల్లోని డిగ్రీ కాలేజీలను తక్కువకు కొంటున్నాయి. కొన్ని అకాడమీలూ ఇదే బాటలో నడుస్తున్నాయి. ఈ మధ్యే హైదరాబాద్ సిటీలో పేరున్న ఓ అకాడమీ.. జీహెచ్ఎంసీలోని 4 డిగ్రీ కాలేజీలను కొన్నట్టు తెలిసింది.
ఇష్టమొచ్చినట్టు పర్మిషన్లు ఇవ్వడంతో..
ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు కాకపోవడానికి గత ప్రభుత్వంతోపాటు ఇప్పటి టీఆర్ఎస్ సర్కారు అనుసరిస్తున్న విధానాలే కారణమని మేనేజ్మెంట్లు చెప్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2012–14 మధ్య ఏకంగా 300 కొత్త డిగ్రీ కాలేజీలకు అప్పటి సర్కారు పర్మిషన్ ఇచ్చింది. అవసరానికి మించి కాలేజీలు పెరిగిపోయాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఓ మండలంలో 7 కాలేజీలకు, నిజామాబాద్ జిల్లాలోని ఓ మండలంలో 6 కాలేజీలకు ఒకేసారి అనుమతి ఇచ్చారు. ఆ మండలాల్లో స్టూడెంట్లు తక్కువగా సీట్లు ఎక్కువగా ఉండటంతో.. రెండు మూడు కాలేజీల్లో జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి.
కోర్సులు, సీట్లకు సీలింగ్ లేక..
ఇంటర్లో ఏటా 9 సెక్షన్లకు, 792 సీట్లకే ఇంటర్ బోర్డు పర్మిషన్ ఇస్తుంది. ఎక్కువ సీట్లు కావాలంటే.. మరో కాలేజీ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీలో కూడా గతంలో 12 కోర్సులకే పర్మిషన్ ఉండేది. కానీ ఈ విధానాన్ని టీఆర్ఎస్ సర్కారు ఎత్తేసింది. ఒక్కో డిగ్రీ కాలేజీకి ఎన్ని కోర్సులకైనా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ పర్మిషన్ ఇస్తోంది. రాష్ట్రం ఏర్పాటయ్యాక కొత్తగా ఒక్క ప్రైవేటు కాలేజీకి అనుమతివ్వక పోయినా.. కోర్సులు, సీట్లకు పెద్ద సంఖ్యలో పర్మిషన్లు ఇస్తూ వచ్చారు. పేరున్న కాలేజీల్లో ఎన్ని సీట్లు పెరిగినా అడ్మిషన్లు ఫుల్ అవుతుండగా.. రూరల్ ఏరియా, బడ్జెట్ కాలేజీల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. అదే ఇంటర్ లో మాదిరి లిమిటెడ్ సీట్లకు పర్మిషన్ ఇస్తేనే మిగిలిన కాలేజీలు కొనసాగుతాయని, లేకుంటే మూతపడుతాయని ప్రైవేటు మేనేజ్మెంట్లు స్పష్టం చేస్తున్నాయి. కానీ రెండేండ్ల నుంచి డిగ్రీ అడ్మిషన్లలో సీబీసీఎస్, బకెట్ విధానం అమల్లోకి రావడంతో.. సీలింగ్ అమలు సాధ్యం కాదని అధికారులు అంటున్నారు.
ఒక్క అడ్మిషన్లు లేని కాలేజీలు
(2020-21లో యూనివర్సిటీల పరిధిలో) యూనివర్సిటీ కాలేజీలు
ఉస్మానియా 10
కాకతీయ 19
మహాత్మగాంధీ 14
పాలమూరు 5
శాతవాహన 6
తెలంగాణ 3
టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు 1
ఏటేటా తగ్గుతున్న కాలేజీలు ఏడాది కాలేజీల సంఖ్య
2014-15 1,151
2015-16 1,098
2016-17 941
2017-18 936
2018-19 861
2019-20 804
2020-21 826
ఇప్పుడు కరోనా దెబ్బతో..
ఇప్పటికే అడ్మిషన్లుగాక ఇబ్బందుల్లో ఉన్న కాలేజీలకు కరోనా ఎఫెక్ట్ తగిలింది. అక్టోబర్‌లో డిగ్రీ సెకండియర్, థర్డ్ ఇయర్ క్లాసులు, డిసెంబర్లో ఫస్టియర్ క్లాసులు మొదలయ్యాయి. దీంతో ఫీజులు వసూలుగాక మేనేజ్మెంట్లు రెంట్లు కట్టేందుకు, స్టాఫ్‌కు జీతాలు ఇచ్చేందుకు అవస్థ పడుతున్నారు. ఇప్పటికైనా గ్రామాల్లోని ప్రైవేటు డిగ్రీ కాలేజీలను ప్రోత్సహించేలా సర్కారు చర్యలు తీసుకోవాలన్నారు.
వాళ్ల చేతుల్లోకి పోతే నష్టమే..
స్టేట్‌లోని చాలా కాలేజీల్లో సరిగా అడ్మిషన్లు కాకపోవడంతో.. కాలేజీలను అమ్ముకునేం దుకు మేనేజ్మెంట్లు రెడీ అయ్యాయి. గవర్నమెంట్ టైమ్‌కు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం, ఖర్చులు పెరగడం వంటివి ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటికే పలు కార్పొరేట్ విద్యా సంస్థలు.. కాలేజీలను స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నాయి. అదే జరిగితే కాలేజీల్లో భారీగా ఫీజులు పెరుగుతా యి. స్టూడెంట్లకు నష్టం జరుగుతుంది.
– గౌరీ సతీష్, కేజీ టు పీజీ కాలేజీల ప్రైవేటు మేనేజ్మెంట్ల జేఏసీ కన్వీనర్
పర్మిషన్లకు ఓ పద్ధతి ఉండాలె
ఒక మండలానికి ఒక ప్రైవేటు కాలేజీ అనే విధానం ఉండాలె. స్టూడెంట్ల సంఖ్యతో సంబంధం లేకుండా ఎక్కువ కాలేజీలు, కోర్సులు, సీట్లకు పర్మిషన్ ఇవ్వడంతో సమస్యలు వస్తున్నాయి. కాలేజీల మధ్య అనైతిక పోటీ మొదలైంది. దాంతో మెయింటెనెన్స్, స్టాఫ్‌కు జీతాలు ఇవ్వడం కష్టంగా మారింది. దీన్ని స్ట్రీమ్ లైన్ చెయ్యాలె..
– ఎస్వీసీ ప్రకాశ్, ప్రైవేటు డిగ్రీ కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం ప్రెసిడెంట్