ఉరి రద్దు చేయండి: నిర్భయ దోషి వినయ్ శర్మ మరో పిటిషన్

నిర్భయ దోషులు చట్టంలోని లూప్‌ హోల్స్‌ని అడ్డం పెట్టుకుని ఉరి శిక్ష అమలును ఆలస్యం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే లీగల్ ఆప్షన్లన్నీ వాడుకునే నెపంతో మూడుసార్లు ఉరిని వాయిదా వేయించగలిగారు. జనవరి, ఫిబ్రవరిలో ఢిల్లీలోని పాటియాలా కోర్టు డెత్ వారెంట్లు ఇచ్చి మళ్లీ వాటిని అదే కోర్టు నిలిపేసింది. మార్చి 3న ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని గత నెలలో ఇచ్చిన ఆదేశాలపై కూడా ఆ ముందు రోజునే దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్‌ పెండింగ్‌లో ఉందన్న కారణంతో కోర్టు స్టే ఇచ్చింది. అయితే ఆ తర్వాత పవన్ గుప్తా పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడంతో మళ్లీ నిర్భయ తల్లి కోర్టును ఆశ్రయించారు. దోషులు నలుగురికీ డెత్ వారెంట్ జారీ చేయాలని ఆమె పిటిషన్ వేయడంతో పాటియాలా కోర్టు సానుకూలంగా స్పందించింది. మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాలని తీహార్ జైలు అధికారులను ఆదేశిస్తూ తీర్పునిచ్చింది.

శిక్ష తగ్గించాలని మళ్లీ పిటిషన్

నిర్భయ దోషులు నలుగురికీ అన్నీ లీగల్ ఆప్షన్లు ముగియడంతో ఈ సారి ఉరి అమలు ఖాయమని అందరూ భావిస్తున్నారు. వాళ్లకు జీవితకాలం ఉరి అమలు కాకుండా చూస్తానంటూ కొద్ది రోజుల క్రితం కోర్టు హాలులోనే నిర్భయ తల్లితోనే సవాలు చేసిన దోషుల లాయర్ ఏపీ సింగ్ కొత్త దారులు వెతకడం మొదలుపెట్టారు. ఉరి నుంచి శిక్ష తగ్గించడానికి ఉన్న మార్గాలను వెతుకుతున్న ఆయన ఇవాళ మరో పిటిషన్‌తో ముందుకొచ్చారు. నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తరఫున తాజాగా మరో పిటిషన్‌తో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఆశ్రయించారు. సెక్షన్ 432, సీఆర్పీసీ 433లను అనుసరించి వినయ్‌కు ఉరి శిక్షను రద్దు చేయాలని కోరారు ఏపీ సింగ్. అతడి శిక్షను తగ్గించి యావజ్జీవంగా మార్చాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Latest Updates