ఐదేళ్ల చిన్నారి రేప్ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు: బాధితురాలి తండ్రి కంటతడి

  • దోషులకు 20 ఏళ్ల జైలు శిక్ష.. రూ.11 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు

తూర్పు ఢిల్లీ ప్రాంతంలో 2013లో జరిగిన చిన్నారి రేప్ కేసులో ఢిల్లీ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరిని దోషులుగా తేల్చింది. వారికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు బాధిత కుటుంబానికి 11 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

2013 ఏప్రిల్ 15న తూర్పు ఢిల్లీలోని గాంధీ నగర్ ఏరియాలో ఐదేళ్ల చిన్నారిని ఇద్దరు గుర్తు దుండగులు కిడ్నాప్ చేశారు. ఓ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి, చిన్నపిల్ల అని కూడా చూడకుండా హింసించారు. ఆ పసికందు చనిపోయిందనుకొని అక్కడ వదిలేసి వెళ్లిపోయారు. ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రెండ్రోజుల తర్వాత ఏప్రిల్ 17న స్పృహ కోల్పోయి ఉన్న ఆ పసికందును గుర్తించారు. వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు తేలడంతో పోలీసులు.. ఈ ఘటనలో బాధితురాలికి ‘గుడియా’ అని పేరు పెట్టారు. ఏడు సర్జరీలు జరిగిన తర్వాత ప్రాణాలతో బయటపడింది ఆ చిన్నారి.

ఈ కేసులో దర్యాప్తు సాగించిన పోలీసులు మనోజ్ షా, ప్రదీప్ కుమార్ ఈ దారుణానికి పాల్పడినట్లు కనిపెట్టారు. ఇన్నేళ్ల విచారణ తర్వాత వారిని ఢిల్లీ కోర్టు జనవరి 18న దోషులుగా తేల్చింది. దోషులిద్దరికీ గురువారం శిక్ష ఖరారు చేసింది. 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు బాధితురాలికి రూ.11 లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా తీర్పు ఇచ్చింది కోర్టు. అయితే ఈ తీర్పుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని, దోషులకు మరింత కఠినమైన శిక్ష పడాలని బాధితురాలి తరఫు న్యాయవాది తెలిపారు.

నా బిడ్డ ఇప్పటికీ బాదను అనుభవిస్తోంది

ఢిల్లీ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత బాధితురాలు గుడియా తండ్రి అక్కడే కంటతడి పెట్టుకున్నాడు. తన బిడ్డకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ రేప్ ఘటన జరిగిన నాటి నుంచి తన స్వగ్రామంలో అడుగుపెట్టలేకపోతున్నానని, దోషుల నుంచి తమ కుటుంబానికి ప్రాణ హాని ఉందని అన్నాడు. ఆ దుర్మార్గులు చేసిన ఘోరం వల్ల తన బిడ్డకు 7 సర్జరీలు జరిగాయని, నేటికీ ఆ బాధను అనుభవిస్తోందని చెబుతూ గుడియా తండ్రి కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇంతటి దారుణానికి పాల్పడిన కిరాతకులను ఎందుకు ఉరి తీయకూడదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Latest Updates