2018-19 నుంచే : లాటరీ విధానంలో ప్రైవేట్ స్కూల్స్ అడ్మిషన్స్

26-school-children1ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లను లాటరీ విధానంలో నిర్వహించేలా తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. 2018-19 విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. వాస్తవానికి నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లను లాటరీ ద్వారానే నిర్వహించాలి. అయితే ఏ పాఠశాల కూడా ఈ నిబంధనను పాటించడం లేదు. విద్యాశాఖ కూడా చూసీచూడనట్లు ఉంటోంది. దీంతో రోజురోజుకీ ప్రైవేటు పాఠశాలల అక్రమాలు ఎక్కువవుతున్నాయి. ప్రవేశాల ప్రక్రియపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో అవి ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఇష్టమొచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్‌, CBSE పాఠశాలలు ఇష్టానుసారంగా అడ్మిషన్లు నిర్వహిస్తుండడంపై విద్యా శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో వీటన్నింటికీ చెక్‌ పెట్టేందుకు లాటరీ విధానం ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు సాధ్యమవుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే CBSC, ICAS పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. మిగిలింది రాష్ట్ర సిలబస్‌ పాఠశాలలు, కార్పొరేట్‌ పాఠశాలలు. ఇవి లాటరీ నిబంధనను పాటిస్తాయా అనేది ప్రశ్నగా మారింది. ఇప్పటికే పలు కార్పొరేట్‌ పాఠశాలల్లోనూ అడ్మిషన్లు సగం పూర్తయినట్లు సమాచారం. అదే విధంగా మిగతా పాఠశాలల్లోనూ లాటరీ విధానం చేపట్టడం అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Posted in Uncategorized

Latest Updates