ఊహల బడ్జెట్ నేలకు దిగింది

2019-20-budget-reduced-when-compare-to-last-5-years-budget
  • ధనిక రాష్ట్ర ఖజానా డొల్ల
  • 2017—–18 స్థాయికి తగ్గిన ప్రస్తుత బడ్జెట్​
  • 2.80 లక్షల కోట్లకు చేరిన అప్పులు
  • బకాయిలు, వడ్డీల భారంతో దిగొచ్చిన సర్కారు
  • ఆర్థిక మాంద్యం.. కేంద్ర ప్రభుత్వంపై  నెపం
  • కీలకమైన పథకాలకు కేటాయింపుల్లో కోతలు
  • బీసీ సంక్షేమానికి సగమే.. కొత్త పెన్షన్లు లేనట్టే
  • ఆరోగ్యానికి కేటాయింపులు అంతంతే
  • పీఆర్​సీ ప్రకటన లేదు.. ఉద్యోగుల్లో నిరాశ
  • వృద్ధిరేటు 21.49% నుంచి 3.8 శాతానికి!

హైదరాబాద్​, వెలుగు:

ఏటేటా భారీగా బడ్జెట్​ అంచనాలు పెంచుకుంటూ… ఊహాల్లో తేలియాడిన రాష్ట్ర ప్రభుత్వం నేలకు దిగివచ్చింది. ఆర్థిక మాంద్యం సాకుగా చూపించి బడ్జెట్​ సైజ్​కు  కళ్లెం వేసింది.  ఇప్పటి వరకు చేసిన గణాంకాల గారడీని దిద్దుకునే దిశగా 2019–20 బడ్జెట్​ను ప్రవేశపెట్టింది. తిరోగమన దిశలో.. నాలుగేళ్ల కిందటి ఆదాయ వ్యయాలను ప్రతిబింబించేలా రూ.1.46 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్​ను ప్రకటించింది. అయిదేళ్లుగా ధనిక రాష్ట్రమంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. తగినంత ఆదాయం లేదని, అన్ని శాఖల్లో బకాయిలు పేరుకు పోయాయని అంగీకరించింది. బకాయిలు చెల్లించిన తర్వాతే కొత్త పనులు చేపట్టాలని పాలసీ డిసిషన్​ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఆరు నెలల కిందటి ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​కు పోలిక లేకుండా ఆదాయ వ్యయాలను వెల్లడించి ఖజానా డొల్లతనాన్ని బయటపెట్టింది. మరోవైపు రాష్ట్ర ఆదాయానికి మించి అప్పులు పెరిగిపోయిన తీరు.. తాజా బడ్జెట్​లో మరోసారి స్పష్టమైంది.

కేంద్ర ఆర్థిక విధానాలతోనే రాష్ట్ర ఆదాయానికి భారీ కోత పడిందని, తప్పంతా సెంట్రల్​ గవర్నమెంట్​పై నెట్టేసేందుకు సీఎం కేసీఆర్​ తన బడ్జెట్​ ప్రసంగంలో ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. బడ్జెట్​ కోత పడ్డా అమల్లో ఉన్న పథకాలకు నిధులు కేటాయిస్తామని చెప్పినప్పటికీ.. ఈసారి నిరుద్యోగ భృతి ఊసెత్తలేదు. ఓటాన్​ అకౌంట్​లో  రూ.1810 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి బడ్జెట్​లో ఈ పథకాన్ని ప్రస్తావించలేదు. మరోవైపు పీఆర్​సీ అమలుకు సరిపడే నిధులను కేటాయించలేదు. దీంతో వేతన సవరణకు ఎదురుచూస్తున్న లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులకు ఆశాభంగమైంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీల సంక్షేమానికి ఏటా  పెద్దపీట వేసిన ప్రభుత్వం ఈసారి ఆయా వర్గాల ప్రస్తావన లేకుండానే మమ అనిపించింది.

ఆదాయం పడిపోతోందా..?

రాష్ట్ర సొంత ఆదాయం రికార్డు స్థాయిలో పడిపోతుందని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. తొలి ఐదేళ్లలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో సగటున 21.49 శాతం ఆదాయ వృద్ధి నమోదైంది. ఈ ఏడాది 15 శాతం ఆదాయాభివృద్ధి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది. కానీ  తొలి మూడు నెలల్లో కేవలం 5.46 శాతం ఆదాయ వృద్ధి మాత్రమే సాధ్యమైందని సీఎం వెల్లడించటం గమనార్హం. ఏడాది చివరకు ఈ ఆదాయ వృద్ధి రేటు 3.8 శాతానికి పడిపోతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. అదే విషయాన్ని బడ్జెట్​లో పొందుపరిచింది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి సొంత పన్నుల ద్వారా  రూ. 66,749.75 కోట్ల ఆదాయం వచ్చిందని స్పష్టం చేసిన ఆర్థిక శాఖ.. ఈ ఏడాది పన్నుల ద్వారా కేవలం రూ. 69,328.57 కోట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. అంటే ఆదాయ వృద్ధి రేటు ఒక్కసారిగా అంతమేరకు పడిపోతుందా..?  అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

భారీ సైజ్​కు కరెక్షన్​

నిజానికి ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్​ అంత స్థాయిలో ఉండే అవకాశం లేదని, అంచనాలకు అందకుండా కాగితాలపై పెంచిన సైజ్​ను కత్తిరించేందుకు ప్రభుత్వం దిగివచ్చిందని, ఈసారి వాస్తవ ఆదాయాలకు దగ్గరగా బడ్జెట్​ను సవరించుకుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తొలి అయిదేళ్లు రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్​ ప్రకటించాలనే ఆరాటం తప్ప వాస్తవ ఆదాయ వ్యయాలను పట్టించుకోలేదు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, పన్నుల వాటాలను సైతం ఇబ్బడిముబ్బడిగా పెంచి చూపించింది. ఒకదశలో రూ. పది వేలకోట్లగా పైగా చేబదులు రుణం తీసుకొని.. మళ్లీ అప్పు తీర్చినట్లుగా బడ్జెట్​ను భూతద్దంలో చూపించే గిమ్మిక్కులు చేసింది.   రెవిన్యూ ఆదాయం అంచనాలను అందుకోకున్నా.. ఏ ఏటికాయేడు 15 శాతం నుంచి 18 శాతం వరకు బడ్జెట్​ సైజ్​ పెంచుకుంటూ పోయింది. 2015–16లో రూ.1.16 లక్షల కోట్లు ఉన్న బడ్జెట్​ను 2016–17లో రూ.1.30 లక్షల కోట్లకు చేరింది. 2017–18లో రూ.1.49 లక్షల కోట్లు కాగా, గతేడాది బడ్జెట్​లో ఏకంగా రూ.1.74 లక్షల కోట్లకు పెరిగిపోయింది. కానీ బడ్జెట్​లో చూపించినంత ఆదాయం రాకపోవటంతో రూ.1.61 కోట్లకు సవరించింది. ఈసారి అంతకంటే తక్కువగా కేవలం రూ.1.46 లక్షల కోట్ల బడ్జెట్​ పెట్టడం వెనుక వాస్తవ ఆదాయం దిశగా ప్రభుత్వం దిగిరావటమే కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ద్రవ్యలోటు కట్టడి

గడిచిన అయిదేళ్లతో పోలిస్తే ఈసారి ద్రవ్యలోటు తగ్గిపోయింది. రాష్ట్రాల ద్రవ్యలోటు జీఎస్​డీపీలో 3 శాతం మించకూడదు. రెవిన్యూ మిగులు ఉన్న రాష్ట్రాలకు 3.5 శాతం వరకు కేంద్రం మినహాయింపు ఇస్తుంది. 2014లో రాష్ట్ర జీఎస్​డీపీలో అత్యధికంగా 4.79 శాతం లోటు చూపించిన ప్రభుత్వం గత ఏడాది 3.45 శాతం చూపించింది. ఈసారి మూడు శాతానికి లోపే కట్టడి చేసి.. రూ.24081 కోట్లు చూపించింది.

వ్యవసాయానికి రూ.20,566 కోట్లు కేటాయించగా అందులో రూ.19,137 కోట్లు రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీలకే సరిపోతుంది. ఈ శాఖ నిర్వహణ ఖర్చులు తీసేస్తే మిగతా వ్యవసాయ అభివృద్ధి పథకాలకు రూ.500 కోట్లు కూడా ఉండవు.

విద్యారంగానికి మొత్తం బడ్జెట్ గతం కంటే రూ.3,378 కోట్ల కోత పెట్టారు. అందులో చిన్న పిల్లలు చదువుకునే స్కూల్ ఎడ్యుకేషన్ కే రూ.2,621 కోట్ల వరకు నిధులు తగ్గాయి.

సర్కారుప్రతిష్ఠాత్మకంగా చెప్పుకునే ఇరిగేషన్ కు ఏకంగా రూ.16,510 కోట్లు కోతపడ్డాయి. దీంతో పెద్ద ప్రాజెక్టుల కోసం ఇక అప్పులు తేవడం తప్ప మరో మార్గం లేదు.

ఇండ్ల నిర్మాణానికి రూ.979 కోట్లు కేటాయించారు. ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి బిల్లులు చాలా పెండింగ్ లో ఉన్నాయి. పైగా ఇండ్ల నిర్మాణం అనుకున్నట్లుగా కావడం లేదని, స్థలం ఉన్నవాళ్లకే నేరుగా పైసలిస్తామని ఎన్నికల సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారు.

  భారీగా కోత పడిన శాఖల్లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు ముందున్నాయి. రెండు శాఖలకూ కలిపి గత ఏడాది బడ్జెట్ తో పోలిస్తే రూ.16,119 కోట్లు కోత పడ్డాయి.

            ఎన్నికల్లో యూత్ ను ఆకర్షించడానికి ప్రకటించిన నిరుద్యోగ భృతి స్కీంకి లోక్ సభ ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.1810 కోట్లు ఇచ్చారు. ఈ స్కీం అమల్లోకి రాకముందే ఇప్పుడు బడ్జెట్లో నిధులు లేవని తేల్చేశారు.

2019-20 budget reduced when compare to last 5 years budget

Latest Updates