అద్భుతం.. మగ చేతులు ఆడ చేతులుగా మారాయ్

‘‘కొన్నిసార్లు మంచి విషయాలు దూరమవుతాయి. అందుకే.. అంతకంటే మంచి విషయాలు దగ్గరవుతాయి..” పుణేకు చెందిన 21 ఏళ్ల స్టూడెంట్ శ్రేయ సిద్ధనగౌడర్ తన నోట్ బుక్ లో రాసుకున్న మాటలివి. అయితే, ఆ మాటలు రాసింది ఆమెనే అయినా.. రాసిన చేతులు మాత్రం ఆమెవి కావు! చిత్రంగా అన్పిస్తోందా..? అవును. అవి శ్రేయకు ఆపరేషన్ చేసి అతికించిన ఒక అబ్బాయి చేతులు! ఇలా ఒక అబ్బాయి చేతులను అమ్మాయికి అతికించడమే అరుదైన సంగతి అనుకుంటే.. ఆ చేతులు రంగు మారి, అమ్మాయి చేతులుగా మారిపోవడం మరింత అరుదైన విషయం! అందుకే.. రెండేళ్ల తర్వాత తన కొత్త చేతులతో తొలిసారి పెన్ను పట్టుకున్న శ్రేయ నోట్ బుక్​లో ఇలా తొలి కొటేషన్ రాసుకుంది.

యాక్సిడెంట్​లో చేతులు పోయినయ్..

అది 2016 సెప్టెంబర్. శ్రేయ కర్నాటకలోని మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ​టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదువుతోంది. కాలేజీకని పుణే నుంచి బస్సులో బయలుదేరింది. కానీ యాక్సిడెంట్ జరిగింది. ఆమె రెండు చేతులూ చితికిపోవడంతో డాక్టర్లు వాటిని తొలగించారు. నిరాశలో కుంగిపోయిన ఆమె ఇంజనీరింగ్ వదిలేసింది. ఏడాది తర్వాత ఆమె హ్యాండ్ ట్రాన్స్ ప్లాంట్ కోసం కొచ్చిలోని అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్​మెడికల్ సైన్సెస్​కు వెళ్లింది.  కానీ శ్రేయకు మార్పిడి చేయడానికి డోనర్ హ్యాండ్స్ లేవని, అవి దొరికేందుకు కొన్ని నెలలు పట్టొచ్చన్నారు. ఆమె నిరాశగా వెనుదిరిగింది. ఓ గంటలోనే ఆమెకు హాస్పిటల్ నుంచి ఫోన్​ వచ్చింది. ఎర్నాకుళానికి చెందిన సచిన్ అనే బీకాం స్టూడెంట్ బైక్ యాక్సిడెంట్​లో బ్రెయిన్ డెడ్ అయ్యాడని, అతడి చేతులిచ్చేందుకు ఫ్యామిలీ ఒప్పుకుందని చెప్పారు. 2017 ఆగస్టు 9న ఆపరేషన్​కు రెడీ చేశారు.

ఆసియాలోనే ఫస్ట్ ఆపరేషన్..

20 మంది సర్జన్లు, 16 మంది అనస్తీషియా టీం.. 13 గంటల పాటు శ్రమించి ఆ అబ్బాయి చేతుల్ని శ్రేయకు అమర్చింది. మొదట కొత్త చేతుల ఎముకలను శ్రేయ మోచేయి ఎముకలకు అతికించారు. తర్వాత నరాలు, రక్తనాళాలను కలిపారు. తర్వాత కండరాలను, చర్మాన్ని కూడా సరిచేసి, కుట్లేశారు. ఆసియాలో ఇంటర్-జెండర్ హ్యాండ్ ట్రాన్స్​ప్లాంట్ (మగవాళ్ల చేతులు ఆడవాళ్లకు లేదా ఆడవాళ్ల చేతులు మగవాళ్లకు మార్పిడి) జరగడం మాత్రం ఇదే మొదటిసారి అని తెలిపారు.

ఫిమేల్ హార్మోన్సే కారణమా?

ఆపరేషన్ తర్వాత ఏడాదిన్నర పాటు ఆమె కొచ్చిలోనే ఉండి ఫిజియోథెరపీ తీసుకుంది. క్రమంగా నాడులు యాక్టివ్ అయ్యాయి. నాలుగైదు నెలలుగా శ్రేయ చేతులు బాగా మారిపోయాయని ఆమె తల్లి సుమ తెలిపారు. చేతులు ఆమె బాడీ కలర్ లోకి మారాయి. మణికట్లు చిన్నవయ్యాయి. వేళ్లు కూడా సాఫ్ట్​గా తయారయ్యాయి. మామూలుగా మగవాళ్ల చేతుల మణికట్టు పెద్దగా ఉంటుంది. కండరాలు వేరుగా ఉంటాయి. వేళ్లు, చేతులు మోటుగా ఉంటాయి. కానీ ఆడవాళ్ల చేతుల మణికట్టు చిన్నగా, చేతులు అంతటా మృదువుగా ఉంటాయి. కానీ శ్రేయ కొత్త చేతులు ఇంతలా  నేచురల్​గా మారతాయని తాము అనుకోలేదని డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పటివరకూ ఇలా ట్రాన్స్​ప్లాంట్ చేసిన తర్వాత చేతులు ఇలా రంగు మారడం వంటిఘటనలు జరగలేదని, ప్రపంచంలోనే ఇది మొదటి కేసు కావచ్చని అన్నారు. ఏడాది తర్వాత శ్రేయ బాడీ నుంచి కొత్త చేతులకు లింఫాటిక్ చానెల్ ఓపెన్ అయి, ఫ్లూయిడ్స్ సరఫరా అవడం మొదలైందని డాక్టర్లు తెలిపారు. దీంతో చర్మం రంగుకు కారణమయ్యే మెలనిన్​ కణాలూ రీప్లేస్ అయి ఉంటాయన్నారు. మొత్తంగా ఫిమేల్ హార్మోన్స్ వల్లే ఈ మార్పులు సాధ్యమై ఉంటాయన్నారు.

ఎగ్జాం కూడా రాసింది..

అఫ్ఘానిస్థాన్​కు చెందిన ఓ సైనికుడికీ తాము మేల్ హ్యాండ్స్​ను ట్రాన్స్​ప్లాంట్ చేశామని, ఆ చేతులు కూడా కొద్దిగా రంగు మారాయని అమృత హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జరీ విభాగం హెడ్ డాక్టర్ సుబ్రమణ్య అయ్యర్ తెలిపారు. అయితే, ఆ సైనికుడు వారం కిందటే చనిపోవడంతో సరైన డేటాను నమోదు చేయలేకపోయామన్నారు. ఈ రెండు కేసులపై తాము మరింత రీసెర్చ్ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. కాగా, ప్రస్తుతం శ్రేయ చేతితో పెన్ను పట్టుకుని రాయగలుగుతోందని డాక్టర్లు చెప్పారు. ఆమె చేతిరాతలో కూడా పెద్దగా మార్పేమీ లేదట. ఇప్పుడు పుణేలోని ఓ కాలేజ్​లో బీఏ ఎకనామిక్స్ చదువుతోంది. ఇటీవలే ఆమె సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా ఆ కొత్త చేతులతోనే  రాసింది.

Latest Updates