22న సీఈసీ రాష్ట్రానికి రాక

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఈ నెల 22న రాష్ట్రానికి రానుంది. మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. 22న మధ్యాహ్నం 3.15 గంటలకు హైదరాబాద్‌కు చేరుకొంటుంది కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం. అదే రోజు సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 వరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై అభిప్రాయాలు సేకరించనుంది. అనంతరం రాత్రి 7.30 నుంచి 8.30 వరకు సీఈఓ రజత్‌కుమార్, పోలీసు విభాగం నోడల్‌ అధికారి, అదనపు డీజీ జితేందర్‌రెడ్డిలతో భేటీ అయి ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీయనుంది.

23న ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలు, ఐజీలతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల బృందం. 24న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఆదాయ పన్ను శాఖ డైరెక్టర్‌ జనరల్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలతో సమావేశమై ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంపిణీ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకోనుంది. అనంతరం ఉదయం 11.15 నుంచి 12 గంటల వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితో సమావేశమవుతుంది. మధ్యాహ్నం 12.30 నుంచి ఒంటి గంట వరకు విలేకరుల సమావేశం నిర్వహించిన అనంతరం సాయంత్రం 4.40 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనుంది.

 

Posted in Uncategorized

Latest Updates