23రోజుల చిన్నోడు..కరోనాను జయించిండు

తాత, తండ్రి నుంచి వైరస్
22 రోజుల ట్రీట్మెంట్ తర్వాత 29న నెగిటివ్
హైదరాబాద్‌‌, వెలుగు: పుట్టినెల రోజులు కాకుండానే ఓ చిన్నోడికి కరోనా సోకింది. తాత, తండ్రి నుంచి వైరస్ వచ్చింది. దానిపై పోరాటం మొదలు పెట్టిన చిన్నోడు 22 రోజులకు గెలిచాడు. కరోనా నెగిటివ్ రావడంతో బుధవారం గాంధీ నుంచి డిశ్చార్జి అయ్యాడు. రాష్ట్రంలో వైరస్ నుంచి బయటపడిన అతి తక్కువ వయసున్నది ఈ చిన్నోడే. మహబూబ్ నగర్లో మర్కజ్కు వెళ్లొచ్చిన ఓ వ్యక్తి నుంచి ఆ కుటుంబంలో వైరస్ వ్యాపించింది. 23 రోజుల బాబుకూ సోకింది. ఈ నెల 7న చేసిన టెస్టులో పాజిటివ్ గా తేలడంతో గాంధీకి తరలించారు. తల్లికి వైరస్ నెగెటివ్ వచ్చింది. ఆమె కూడా 22 రోజులుగా హాస్పిటల్‌‌లో బాబుతో పాటే ఉంది. మొదట్లో ఆ చిన్నారి విరేచనాలతో బాధపడ్డాడని, తర్వాత కుదు రుకున్నాడని డాక్టర్లు తెలిపారు‌. 20 రోజుల తర్వాత వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడని చెప్పారు.

13 మంది పిల్లలు డిశ్చార్జి

రాష్ట్రంలో సుమారు 94 మంది పిల్లలు కరోనా బారినపడ్డారు. ఇందులో ఐదేండ్లలోపు వాళ్లు 50 మంది, 5 నుంచి పదేండ్లలోపు వాళ్లు 44 మంది ఉన్నరు. వీరిలో ఇప్పటికే కొందరు డిశ్చార్జి కాగా.. బుధవారం 45 రోజుల చిన్నారి సహా 13 మంది పిల్లలను డిశ్చార్జి చేశారు. చాలా మంది పిల్లలకు తల్లి, తండ్రి నుంచే వైరస్ అంటుకుంది. అలాంటి వారిని వైరస్ ఉన్న తల్లి, తండ్రి వద్దే ఉంచి ట్రీట్‌‌మెంట్ ఇచ్చారు.

Latest Updates