24 గంటల్లో.. 33 ప్రసవాలు : కేసీఆర్ కిట్ తో పెరుగుతున్న ఆదరణ

పేద మహిళలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేసీఆర్ కిట్టు పథకం ఎంతో మందికి ఆసరాగా నిలుస్తోంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ డెలివరీల సంఖ్య పెరుగుతోంది. కార్పొరేట్ స్థాయి వసతులతో ఆకట్టుకుంటున్న సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతున్నది. ఈ క్రమంలోనే ఒక్క సిద్దిపేట హస్పిటల్ లోనే 24 గంటల్లో 33 ప్రసవాలు జరిగాయంటే కేసీఆర్ కిట్ ప్రధాన కారణం. మంగళవారం (జూలై-10) నుంచి బుధవారం (జూలై-11) తెల్లవారుజాము వరకు 24 గంటల వ్యవధిలో సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో 33 ప్రసవాలు జరిగాయి. ఇందులో 17 సాధారణ ప్రసవాలు కాగా, 16 సిజేరియన్లు ఉన్నాయి. సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన చరిత్రలో ఇది సరికొత్త రికార్డని తెలిపారు డాక్టర్లు.

33 ప్రసవాల్లో 17 మంది ఆడబిడ్డలు, 16 మంది మగబిడ్డలు పుట్టారని, తల్లీ బిడ్డలంతా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. సర్కారు దవాఖానల్లో ప్రసవించిన వారందరికీ ప్రభుత్వం కేసీఆర్ కిట్లను అందజేస్తున్నది. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగపిల్లవాడు పుడితే రూ.12 వేలు ఆర్థికసాయం చేస్తున్నది. సిద్దిపేటలో ప్రభుత్వ దవాఖానతోపాటు గజ్వేల్, దుబ్బాక, చేర్యాల, నంగునూరు CHC లు, పలు PHC లు ఉన్నాయి. జూన్ 2017 నుంచి 2018 జూలై 10 వరకు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో మొత్తం 12 వేల 035 ప్రసవాలు జరిగాయి. ఇందులో 5 వేల247 సాధారణ ప్రసవాలు కాగా, 6 వేల788 సిజేరియన్లు. వీటిలో 10,343 మంది బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేసినట్టు చెప్పారు వైద్యశాఖ అధికారులు. కేసీఆర్ కిట్ పథకంలో భాగంగా ఇప్పటివరకు బాలింతలకు ఆర్థికసాయం కింద రూ.10 కోట్లను ప్రభుత్వం వారిఖాతాల్లో జమచేసినట్లు వెల్లడించింది వైద్యశాఖ.

Posted in Uncategorized

Latest Updates