రాష్ట్రంలో 24 శాతం త‌గ్గిన లిక్క‌ర్ సేల్స్

మద్య నియంత్రణ కోసమే రేట్లను భారీగా పెంచామని ఏపీ సీఎం జగన్ అన్నారు. గతంలో వారానికి ఐదుసార్లు తాగేవాళ్లు ఇప్పుడు రెండుసార్లే తాగుతున్నారని చెప్పారు. లిక్క‌ర్ రేట్లు పెంచిన త‌ర్వాత‌ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 24 శాతం తగ్గాయన్నారు. వైఎస్సార్సీపీ అధికారం చేప‌ట్టి ఈ నెల 30కి ఏడాది పూర్త‌వుతున్న సంద‌ర్భంగా మ‌న పాల‌న – మీ సూచ‌న‌లు పేరుతో ఏడాది పాల‌న‌పై ఇవాళ్టి నుంచి ఆరు రోజుల పాటు స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు సీఎం జ‌గ‌న్. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ఆయ‌న మాట్లాడుతూ మ‌ద్య నియంత్ర‌ణ‌లో భాగంగా రేట్లు పెంచ‌డంతో పాటు క్ర‌మంగా లిక్క‌ర్ షాపుల సంఖ్య త‌గ్గిస్తూ వ‌స్తున్నామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే 24 శాతం మ‌ద్యం అమ్మ‌కాలు త‌గ్గాయ‌ని అన్నారు. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో చెప్పిన ప్ర‌తి మాట‌ను అమ‌లు చేసేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు. అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోపే 90 శాతం హామీల‌ను అమ‌లులోకి తెచ్చామ‌ని చెప్పారు.

ప్రతి గ్రామంలో ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌ తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని జ‌గ‌న్ పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో వైద్య స‌దుపాయాల‌ను మెరుగుప‌రిచేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు. 54 రకాల మందులు గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచబోతున్నామని తెలిపారు. వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించబోతున్నామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం చెప్పారు.

Latest Updates