విజ‌య‌వాడ‌లో లారీ డ్రైవ‌ర్ పేకాట‌తో 24 మంది క‌రోనా: మ‌రో వ్య‌క్తి నుంచి 15 మందికి..

ఏపీలోని విజ‌య‌వాడ‌లో ఒక్క వ్య‌క్తి నుంచి 24 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లి వ‌చ్చిన ఒక్క లారీ డ్రైవ‌ర్ అత‌డికి వైర‌స్ సోకిన విష‌యం తెలియ‌క‌.. ఇరుగు పొరుగు వారితో పేకాట ఆడ‌డం వ‌ల్ల ఈ ప‌రిస్థితి త‌లెత్తింది. కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్ శ‌నివారం ఈ విష‌యాన్ని వెల్ల‌డించించారు. విజ‌య‌వాడ‌లో కేవ‌లం ఇద్ద‌రి ద్వారా 39 మందికి క‌రోనా వ్యాపించింద‌ని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్ర‌తి ఒక్క‌రూ లాక్ డౌన్ ను గౌర‌వించి, నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాల‌ని చెప్పారు.

ఇప్ప‌టికే విజ‌య‌వాడ సిటీలో 100కు పైగా కేసులు న‌మోద‌య్యాయ‌ని చెప్పారు కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్. కృష్ణ లంక‌కు చెందిన లారీ డ్రైవ‌ర్ ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత ప‌క్కింటి వాళ్ల‌తో పేకాట ఆడ‌డంతో 24 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని తెలిపారు. అలాగే కార్మిక న‌గ‌ర్ లోనూ ఒక వ్య‌క్తి కార‌ణంగా 15 మందికి వైర‌స్ సోకింద‌ని చెప్పారు. లాక్ డౌన్ ను ప్ర‌జ‌లు లెక్క చేయ‌కుండా స‌రిగా పాటించ‌నందు వ‌ల్లే విజ‌య‌వాడ‌లో భారీగా కేసులు పెరుగుతున్నాయ‌న్నారు క‌లెక్ట‌ర్ ఇంతియాజ్. ప్ర‌జ‌లంతా ఎవ‌రి ఇళ్ల‌లో వారు ఉండాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

Latest Updates