ఫ్రెండ్స్‌తో వేసిన జోక్ నిజమైంది.. రూ. 12 కోట్ల లాటరీ గెలుచుకున్న 24 ఏళ్ల యువకుడు

తనకు లాటరీలో ఫస్ట్ ఫ్రైజ్ వస్తుందని ఓ యువకుడు తన ఫ్రెండ్స్‌తో వేసిన జోక్ నిజమైంది. అక్షరాల రూ. 12 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు. కేరళలో ప్రభుత్వ అనుమతితో లాటరీలు జోరుగా నడుస్తుంటాయి. లాటరీ ఫలితాల్లో భాగంగా.. తిరువోనం బంపర్ లాటరీ 2020 ఫలితాలను ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఆ ఫలితాల్లో ఇడుక్కి తోవాలాకు చెందిన అనంతు విజయన్ అనే 24 ఏళ్ల యువకుడు రూ. 12 కోట్ల విలువైన మొదటి బహుమతిని గెలుచుకున్నాడు.

అనంతు విజయన్ ఎర్నాకుళం కడవంత్రలోని పొన్నెత్ ఆలయంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. అతడు కడవంత్రలో రోడ్డు పక్కన లాటరీ టికెట్లను అమ్మే అజకాచామి అనే వ్యక్తి నుంచి బీఆర్ 75 టీబీ 173964 నెంబర్ గల టికెట్‌ను కొనుగోలు చేశాడు. అయితే లాటరీ ఫలితాలు ప్రకటించడానికి కొన్ని గంటల ముందు.. ఆదివారం ఉదయం తానే మొదటి ప్రైజ్ గెలుస్తానని అనంతు తన స్నేహితులతో జోక్ చేశాడు. కానీ, అదే రోజు సాయంత్రం విడుదలయిన ఫలితాల్లో అనంతు నిజంగానే లాటరీని గెలుచుకున్నాడు. ఆ విషయాన్ని అనంతు అసలు నమ్మలేకపోయాడు. వెంటనే తన టికెట్ నెంబర్‌ను క్రాస్ చెక్ చేసుకొని చూసుకున్నాడు. అప్పటికీ కానీ అనంతు లాటరీ గెలిచిన విషయాన్ని నమ్మలేదు. అనంతు లాటరీ గెలిచిన విషయాన్ని వెంటనే తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. అనంతు తండ్రి ఒక పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఇద్దరు తోబుట్టువులున్నారు. వారిలో ఒకరు కొచ్చిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేసేది. కానీ, లాక్‌డౌన్ వల్ల ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోయింది.

‘నా టికెట్ మొదటి బహుమతిని గెలుచుకున్నట్లు తెలిసి నేను షాక్ అయ్యాను. ఆ షాక్ నుంచి బయటపడటానికి కొన్ని గంటలు పట్టింది. నేను ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదు. పన్నులు మరియు ఏజెన్సీ కమీషన్ తీసివేసిన తరువాత మొత్తం రూ .7.56 కోట్లు అందుతాయని తెలిసింది. ఆ డబ్బును ఏం చేయాలో నేను ఇప్పటివరకు ఆలోచించలేదు. డబ్బులు నా చేతికి వచ్చే వరకు నేను నా ఉద్యోగాన్ని చేస్తాను. మా ఇల్లు 55 సంవత్సరాల క్రితం నిర్మించింది. ఇంటి మరమ్మతుకు ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు చేశాను. అది ఇంకా మంజూరు కాలేదు. ఇప్పుడు లాటరీ డబ్బుతో ఇంటిని నిర్మించుకుంటాం. మా ఇల్లు తోవాలలోని ఒక కొండపై ఉంది. అక్కడ నీటి వసతి లేదు. ఆ సమస్యను కూడా తీర్చుకుంటాం’అని అనంతు తెలిపాడు.

అనంతు తండ్రి కూడా తిరువోనం బంపర్ లాటరీని కొనుగోలు చేశాడు. కానీ ఆయనకు మాత్రం ఎటువంటి బహుమతి లభించలేదు. అయితే అనంతు మొదటి బహుమతి గెలుచుకోవడంతో ఆయన కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అనంతు గతంలో కూడా ఇదే లాటరీ నుండి రూ .5000 బహుమతి గెలుచుకున్నాడు. ఈసారి అనంతు ఫస్ట ప్రైజ్ గెలుచుకోగా.. మరో ఆరుగురు తిరువోనం బంపర్ లాటరీలో కోటి రూపాయల విలువైన రెండవ బహుమతిని గెలుచుకున్నారు.

For More News..

వీడియో తీయమని లైవ్‌లో నదిలోకి దూకిన వ్యక్తి

వీడియో: తనపై దాడికి యత్నించిన ఎంపీలకు టీ అందించిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్

తెలంగాణలో మరో 2,166 కరోనా కేసులు

Latest Updates