25 వేల ఇంజనీరింగ్ సీట్లకు కోత : ఇక మిగిలేది 80 వేలే

colleagesతెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్ల సంఖ్య మరోసారి భారీగా తగ్గుతున్నాయి. ఈ ఏడాది ఏకంగా 25 వేల సీట్లకు కోత పడుతుంది. ఈసారి మొత్తంగా 80 వేల సీట్లే అందుబాటులో ఉండబోతున్నాయి. వరుసగా మూడేళ్ల పాటు 25 శాతం కంటే తక్కువ సీట్లు భర్తీ అయిన బ్రాంచీలను రద్దు చేస్తామని ప్రకటించింది జేఎన్టీయూ.

25 శాతంలోపు సీట్లు భర్తీ అయిన బ్రాంచీల రద్దుకు జేఎన్టీయూ నిర్ణయం

ప్రస్తుత విద్యా సంవత్సరం (2017–18)లో రాష్ట్రంలోని 212 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 1.04 లక్షల సీట్ల భర్తీకి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. కానీ జేఎన్టీయూ సహా యూనివర్సిటీలు 97,961 సీట్లకు మాత్రమే అనుబంధ గుర్తింçపు ఇచ్చాయి. అయితే అనుమతించిన వాటిల్లోనూ పెద్ద సంఖ్యలో సీట్లు మిగిలిపోయాయి. చాలా కాలేజీల్లోని పలు బ్రాంచీల్లో 25 శాతం కన్నా తక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. తాజాగా అలాంటి బ్రాంచీలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది జేఎన్టీయూ.

112 కాలేజీల్లో అంతంత మాత్రమే సీట్ల భర్తీ

గతేడాది రాష్ట్రంలోని 112 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఉన్న పలు బ్రాంచీల్లో అతి తక్కువగా సీట్లు భర్తీ అయ్యాయి. ఈ బ్రాంచీల్లో 41,628 సీట్లు అందుబాటులో ఉండగా.. 2,874 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ 109 కాలేజీల్లోని పలు బ్రాంచీల్లో 47,640 సీట్లుండగా.. 5,687 మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ బ్రాంచీలన్నీ 30శాతం లోపు సీట్ల భర్తీ ఉన్నవే. మంచి కాలేజీల్లో చేరేందుకే విద్యార్థుల మొగ్గు చూపుతున్నారు. తత్ఫలితంగా నాణ్యతలేని కాలేజీల్లో ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. ఇతర వృత్తి విద్యా కోర్సుల్లోనూ ఇదే పరిస్థితి పరిస్థితి కొనసాగుతుంది.

30 శాతంలోపు సీట్లు భర్తీ అయిన బ్రాంచీలు రద్దు : ఏఐసీటీఈ  

వరుసగా మూడేళ్ల పాటు 30 శాతంలోపు సీట్లు భర్తీ అయిన బ్రాంచీలను రద్దు చేస్తామని ఇప్పటికే కాలేజీలకు స్పష్టం చేసింది ఏఐసీటీఈ. ఈ లెక్కన రాష్ట్రంలో 41,628 ఇంజనీరింగ్‌ సీట్లు రద్దవుతాయి. అయితే ప్రస్తుతానికి అలాంటి బ్రాంచీల్లోని 50శాతం సీట్లకు కోత వేస్తామని ప్రకటించింది ఏఐసీటీఈ. కానీ రాష్ట్రంలో జేఎన్టీయూ మాత్రం 30 శాతం కాకుండా 25 శాతంలోపు సీట్ల భర్తీని పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇలా 25 శాతంలోపు సీట్లు భర్తీ అయిన బ్రాంచీలను రద్దు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో 41,628 సీట్లు కాకపోయినా 25వేల సీట్ల వరకు కోత తప్పదని అంచనా వేస్తున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates