8 మంది పోలీసులను చంపిన వికాస్‌ దుబేను పట్టుకునేందుకు 25 స్పెషల్‌ టీమ్స్‌

  • నియమించిన పోలీసులు

లక్నో: 8 మంది పోలీసుల చావుకు కారణమైన క్రిమినల్‌ వికాస్‌ దుబేను అరెస్టు చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతడ్ని పట్టుకునేందుకు 25 స్పెషల్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. “ వికాస్‌ దుబే, అతని అనుచరులను పట్టుకునేందుకు 25 స్పెషల్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేశాం. దీని కోసం వివిధ జిల్లాల్లో రైడ్స్‌ చేస్తున్నాం. రాష్ట్రం, పక్క రాష్ట్రాల్లో కూడా అతని కోసం గాలిస్తున్నాం” అని కాన్పూర్‌ ఇన్స్‌పెక్టర్‌‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ మోహిత్‌ అగర్వాల్‌ అన్నారు. దాదాపు 500 మొబైల్‌ ఫోన్లపై నిఘా ఉంచామని అన్నారు. స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దుబే గురించి ఇన్ఫర్మేషన్‌ ఇచ్చే వారికి రూ.50వేల నగదు బహుమతి ఇస్తామని, ఇన్ఫర్మేషన్‌ ఇచ్చిన వ్యక్తి పేరు సీక్రెట్‌గా ఉంచుతామని అన్నారు. శుక్రవారం కాల్పుల్లో గాయపడ్డ పోలీసుల పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్పారు. దాదాపు 60 క్రిమినల్‌ కేసుల్లో నిందితుడైన వికాస్‌ దుబేను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగా ఆయన అనుచరులు పోలీసులపై కాల్పులకు తెగబట్టారు. దీంతో 8 మంది పోలీసులు అక్కడికక్కడే చనిపోయారు. చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఒక్కో కుటుంబానికి కోటి రపాయలు పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.

నా కొడుకును ఎన్‌కౌంటర్‌‌ చేయండి: దుబే తల్లి

ఎనిమిది మంది పోలీసుల మరణానికి కారణమైన తన కొడుకును ఎన్‌కౌంటర్‌‌ చేయాలని వికాస్‌ దుబే తల్లి అన్నారు. తన కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసాడని దూచేను కాల్చి చంపాలని పోలీసులను కోరారు. దుబే వెంటనే పోలీసుల దగ్గర లొంగిపోవాలని చెప్పారు. లేదంటే పోలీసులు ఎన్‌కౌంటర్‌‌ చేసేస్తారని ఆమె దుబేకు మీడియా ద్వారా హెచ్చరించారు. నాలుగు నెలలుగా తన కొడుకును కలవలేదని, లక్నోలో చిన్న కొడుకు దగ్గర ఉంటున్నానని అన్నారు. చాలా కాలంగా దుబే వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Latest Updates