అమెరికా నుంచి హైదరాబాద్‌ చేరుకున్న 250 మంది

ఫలించిన మూడు నెలల నిరీక్షణ

హైదరాబాద్: కరోనా ప్రభావం మొదలయ్యాక అమెరికాలో చిక్కుకున్న 250మంది భారతీయులు ప్రత్యేక విమానాల్లో శుక్రవారం సురక్షితంగా హైదరాబాద్ కు చేరుకున్నారు. దాదాపు మూడు నెలల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సొంత గడ్డకు చేరుకున్నారు. యూఎస్–ఇండియా సాలిడారిటీ మిషన్, రవి పులిల కృషితో అమెరికా నుంచి దోహాకు … అక్కడ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో కరోనా టెస్టులు నిర్వహించిన అనంతరం క్వారంటైన్ కోసం నోవాటెల్ హోటల్‌కు తరలించారు.
            కరోనా లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులు, ప్రవాస భారతీయులు గురువారం అర్ధరాత్రి ఖతర్ ఎయిర్‌‌వేస్‌కు చెందిన ప్రత్యేక విమానాల్లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అంతకు ముందు వీరు అమెరికాలోని షికాగో, న్యూయార్క్, డాలస్‌ నగరాల నుంచి ఖతర్ ఎయిర్‌‌వేస్‌కే చెందిన మూడు ప్రత్యేక విమానాల్లో దోహా చేరుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారు. ప్రవాస తెలుగు వ్యక్తి రవి పులి, ఆయన ఏర్పాటు చేసిన యూఎస్–ఇండియా సాలిడారిటీ మిషన్(యూస్ఐఎస్ఎం) టీమ్ ఈ విమానాలను ఏర్పాటు చేసింది. విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకోగానే భావోద్వేగ సన్నివేశాలు కనిపించాయి. ఇన్నాళ్లకు సొంతగడ్డపై అడుగు పెట్టామని ప్రయాణికులు ఆనందంతో పొంగిపోయారు. 3 నెలల తర్వాత సురక్షితంగా వచ్చిన తమ వారిని బంధుమిత్రులు ఆత్మీయంగా స్వాగతించారు. నిబంధనల ప్రకారం ప్రయాణికులు విమానంలో మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించారు. వారిని క్వారంటైన్ కోసం నోవాటెల్ హోటల్‌కు తరలించారు. రవి పులి, యూస్ఐఎస్ఎంలుకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. వాస్తవానికి ఈ నెల రెండోవారంలోనే హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాలు పంపడానికి యూస్ఐఎస్ఎం రవి పులి ఏర్పాట్లు చేశారు. అయితే కరోనా ఆంక్షల కారణంగా అనుమతుల విషయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. రవి పులి బృందం, యూస్ఐఎస్ఎం ప్రతినిధులు భారత, అమెరికా ప్రభుత్వాలకు అధికారులకు అన్ని వివరాలు అందించి అనుమతి సంపాదించారు. అమెరికా నుంచి విమానాలు నడవకపోవడం వల్ల వేలాది మంది భారతీయులు, ప్రవాస భారతీయులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారత్ లో ఉద్యోగాలు చేసేవారు మరింత  ఇబ్బంది పడ్డారు.

Latest Updates