27వ తేదీపై నమ్మకాలు, పుకార్లు : గురుపౌర్ణమి, చంద్రగ్రహణం ఒకే రోజు

జూలై 27వ తేదీ అర్థరాత్రి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గంటా 45 నిమిషాలు సుదీర్ఘంగా ఉంటుంది. అదే రోజు గురుపౌర్ణమి. సాయి ఆలయాల్లో ప్రత్యేక పూజలు. ఇదే సమయంలో తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాలు గ్రహణంకి మూసివేస్తున్నారు. బ్లడ్ మూన్ గా చంద్రుడు అలరించనున్నాడని సైంటిస్టులు అంటుంటే.. అరిష్టమని జాగ్రత్తలు పాటించాలని పండితులు అంటున్నారు. దీనికితోడు 15 ఏళ్ల తర్వాత అంగారకుడు భూమికి మరింత దగ్గరగా రాబోతున్నాడు. పెద్దగా కనిపిస్తున్నాడు. అదే రోజు భూమి అంతం అవుతుంది అంటూ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని పుకార్లు పుట్టాయి.

వందేళ్ల తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం :

ఈ శతాబ్దంలోనే అరుదైన అద్భుతం. అర్ధరాత్రి సుదీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం ఆవిష్కృతం కానుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ కనిపించే ఈ గ్రహణం 1:43 నిమిషాల పాటు కొనసాగనుంది. ఇది అద్భుతమైన అవకాశమని… ప్రతి ఒక్కరు తప్పక చూడాలని కేంద్ర భూ విజ్ఞానశాస్త్ర మంత్రిత్వ శాఖ  తెలిపింది.  జూలై 27న రాత్రి 11:45 నిమిషాలకు గ్రహణం పట్టనుంది. అర్ధరాత్రి దాటాక ఒంటి గంటకు సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. తెల్లవారుజామున 2:43 గంటల వరకు ఇది కొనసాగుతుంది. 3:49 గంటల వరకు పాక్షిక చంద్ర గ్రహణాన్ని చూడవచ్చని తెలిపింది.

గురుపౌర్ణమి కలిసిరావటంతో.. ఎంతో విశిష్టత అంటూ ప్రచారం :

చంద్రగ్రహణం రోజే గురుపౌర్ణమి వస్తుంది. దీంతో ఆ రోజు ఎంతో విశిష్టమైనది అంటున్నారు కొంత మంది పండితులు. ఆ రోజు ఏపని తలపెట్టినా విజయవంతం అవుతుంది అంటున్నారు. ముఖ్యంగా జ్యోతిష్యాన్ని నమ్మే వారు.. కుజదోషం ఉన్న వారు 27వ తేదీన ఏ పని చేపట్టినా తిరుగులేని విజయం సాధిస్తారంట. ఏలిననాటి శని నడుస్తున్న వారికి ఈ చంద్రగ్రహణం సందర్భంగా.. శని బలహీనపడి మంచి జరుగుతుందంట. కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ప్రళయాలు అంటూ పుకార్లు :

సూర్యుడు – భూమి – చంద్రుడు ఒకే వరసలోకి రావటంతో చంద్రుడు ఎర్రగా కనిపించనున్నాడు. ఇదే సమయంలో అంగారక గ్రహం దగ్గరగా వస్తుంది. మరింత కాంతి వంతగా అంగారకుడు కనిపించనున్నాడు. ఇది ప్రపంచానికి వినాశం అంటూ పుకార్లు మొదలయ్యాయి. బ్లడ్ మూన్ తోపాటు అంగాకరక గ్రహం కనిపిస్తే.. విపత్కర పరిస్థితులు రాబోతున్నాయనే ప్రచారం జరుగుతుంది. శుక్రవారం ప్రళయం వస్తుందంటూ అమెరికాకి చెందిన జాన్ హెగ్గే. దీనిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. ఇలాంటి పుకార్లను నమ్మొద్దని చెబుతున్నారు.

ఈ శతాబ్దంలోనే వచ్చే అద్భుతమైన ఖగోళ వింతను చూసి ఆనందించాలని కోరుతున్నారు. ఇళ్లల్లో కూర్చుని మిస్ కావద్దని కోరుతున్నారు. అనవసరంగా పూజలు, పునస్కారాలు, భయాలు వదిలేసి.. ఎంజాయ్ చేయమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

Posted in Uncategorized

Latest Updates