59 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

  • రెండో వన్డేలో  ఇండియా 279/7
  • చెలరేగిన కోహ్లీ, భువీ
  • విరాట్‌ వీరోచిత సెంచరీ
  • కుమ్మేసిన శ్రేయస్‌

విండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో టీమిండియా 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. ఆ తరువాత వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. దీంతో విండీస్ లక్ష్యాన్ని డక్ వర్త్ లూయిస్ ప్రకారం 46 ఓవర్లలో 270 పరుగులుగా నిర్ణయించారు. కానీ విండీస్ 42 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ 31 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ఫార్మాట్‌‌ ఏదైనా..  జోరు మాత్రం ఒకేలా ఉంటుంది..! బౌలర్‌‌ ఎవరైనా.. ఆధిపత్యం మాత్రం అలాగే కొనసాగుతుంది..! వేదిక ఎక్కడైనా.. సెంచరీల మోత మోగుతూనే ఉంటుంది..! రికార్డు ఏదైనా.. ‘కింగ్‌‌’ కోహ్లీకి అందుతూనే ఉంటుంది..! తన అసాధారణ బ్యాటింగ్‌‌ ప్రతిభతో ప్రపంచ క్రికెట్‌‌ను ఏలుతున్న విరాట్‌‌(125 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 120).. కరీబియన్‌‌ గడ్డపై మరో సెంచరీతో శివాలెత్తాడు..! గబ్బర్‌‌, హిట్‌‌మ్యాన్‌‌ విఫలమైనా.. విండీస్‌‌ పేస్‌‌ తంత్రానికి సరైన మంత్రం వేశాడు..! భవిష్యత్‌‌ సూపర్‌‌ స్టార్‌‌ శ్రేయస్‌‌ (68 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 71) కూడా ఆటలో అయ్యారే.. అనిపించడంతో తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది.

పోర్ట్‌‌ ఆఫ్‌‌ స్పెయిన్‌‌: మిడిలార్డర్‌‌లో నాలుగో స్థానం కోసం చేసిన ప్రయోగం పెద్దగా సక్సెస్‌‌ కాకపోయినా.. శ్రేయస్‌‌ అయ్యర్‌‌ రూపంలో టీమిండియాకు ఓ నాణ్యమైన బ్యాట్స్‌‌మన్‌‌ లభించాడు. తొలి వన్డే వర్షార్పణం కావడంతో.. అవకాశం వచ్చిన రెండో మ్యాచ్‌‌లో కెప్టెన్‌‌ విరాట్‌‌తో కలిసి సాధికారిక ఇన్నింగ్స్‌‌తో ఆకట్టుకున్నాడు. దీంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌‌లో టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. తర్వాత కడపటి వార్తలందేసరికి విండీస్​ ఐదు ఓవర్లలో 20 పరుగులు చేసింది. గేల్​(4 బ్యాటింగ్​), లూయిస్​ (10 బ్యాటింగ్​) క్రీజ్​లో ఉన్నారు.

పిచ్‌‌ మీద విండీస్‌‌ పేసర్లు ప్రభావం చూపడంతో టీమిండియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఇన్నింగ్స్‌‌ మూడో బంతికే ఓపెనర్‌‌ శిఖర్‌‌ ధవన్‌‌ (2) పెవిలియన్‌‌ చేరాడు. కొట్రెల్‌‌ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన ధవన్‌‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో నాలుగో బంతికే  క్రీజులోకి వచ్చిన కోహ్లీ విండీస్‌‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మరో ఓపెనర్‌‌ రోహిత్‌‌ (18) నెమ్మదిగా ఆడుతుండడంతో ఎక్కువగా స్ట్రయికింగ్‌‌ తీసుకున్నాడు. తొలి పది ఓవర్లలో కోహ్లీ ఒక్కడే 38 బాల్స్‌‌ ఎదుర్కొన్నాడు. అతనికిది కెరీర్‌‌లోనే అత్యధికం. వీలుచిక్కినప్పుడల్లా కోహ్లీ బంతిని బౌండరీ దాటించడంతో  పది ఓవర్లు ముగిసే సరికి ఇండియా 55/1 స్కోరు చేసింది. ఓ పక్క రోహిత్‌‌ పరుగుల కోసం తంటాల పడుతుంటే స్వేచ్ఛగా ఆడిన కోహ్లీ..  బ్రాత్‌‌వైట్‌‌ వేసిన 15వ ఓవర్‌‌లో బౌండరీ కొట్టి 57 బంతుల్లో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. తర్వాతి ఓవర్‌‌లో రోహిత్‌‌ను ఔట్‌‌ చేయడంతో స్పిన్నర్‌‌ ఛేజ్‌‌ ఈ జోడీని విడదీశాడు. దీంతో రెండో వికెట్‌‌కు 74 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. క్రీజులోకి వచ్చిన రిషబ్‌‌ పంత్‌‌ (20) ఎక్కువ సేపు ఆడలేకపోయాడు.

అయ్యర్‌‌ కేక..

రిషబ్‌‌ ఔట్‌‌తో క్రీజులోకి వచ్చిన అయ్యర్‌‌.. కోహ్లీకి మంచి సమన్వయాన్ని ఇచ్చాడు. ఈ ఇద్దరు విండీస్‌‌ బౌలర్లపై ఆధిపత్యం చూపుతూ నాలుగో వికెట్‌‌కు 125 రన్స్‌‌ జోడించారు.  హోల్డర్‌‌ వేసిన 34వ ఓవర్‌‌లో సిక్సర్‌‌ కొట్టిన కోహ్లీ, ఆ వెంటనే రోచ్‌‌ బౌలింగ్‌‌లో ఫోర్‌‌ కొట్టి  సెంచరీకి చేరువయ్యాడు. 38వ  ఓవర్‌‌లో సింగిల్‌‌ తీసి కెరీర్‌‌లో 42వ సెంచరీ పూర్తి చేశాడు. థామస్‌‌ వేసిన 41 ఓవర్‌‌లో మూడు ఫోర్లు కొట్టిన కోహ్లీ.. ఆ తర్వాత బ్రాత్‌‌వైట్‌‌ బౌలింగ్‌‌లో భారీ షాట్‌‌కు ప్రయత్నించి ఔటయ్యాడు.  అయ్యర్‌‌ కూడా హాఫ్‌‌ సెంచరీ మార్క్‌‌ దాటాడు. కేదార్‌‌ జాదవ్‌‌ (16) రాగానే వర్షం వల్ల మ్యాచ్‌‌ కాసేపు ఆగింది.  తిరిగి ప్రారంభమయ్యాక రోచ్‌‌ బౌలింగ్‌‌లో భారీ సిక్స్‌‌ కొట్టిన అయ్యర్‌‌ను..  హోల్డర్‌‌ 46వ ఓవర్‌‌లో బౌల్డ్‌‌ చేశాడు. దీంతో 250 వద్ద ఇండియా ఐదో వికెట్‌‌ కోల్పోయింది. జడేజా(16 నాటౌట్‌‌) నిలబడినా.. రెండో ఎండ్‌‌లో జాదవ్‌‌, భువనేశ్వర్‌‌ (1) స్వల్ప విరామాల్లో ఔట్‌‌ కావడంతో  స్కోరు వేగం తగ్గిపోయింది. 47వ ఓవర్‌‌లో జాదవ్‌‌ రనౌట్‌‌కాగా, బ్రాత్‌‌వైట్‌‌ (3/53) బౌలింగ్‌‌లో భువీ పెవిలియన్‌‌ చేరాడు. చివరి రెండు ఓవర్లలో విండీస్‌‌ బౌలర్లు 12 పరుగులే ఇచ్చారు.

ఇండియా తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌‌మన్‌‌గా కోహ్లీ (11,406) రికార్డులకెక్కాడు. గంగూలీ (11, 363)ని అధిగమించాడు. 

26 ఏళ్ల రికార్డు బద్దలు

టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్‌‌లో వెస్టిండీస్‌‌పై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌‌గా విరాట్‌‌ (2032) రికార్డులకెక్కాడు. దీంతో 26 ఏళ్ల కిందట పాక్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ జావేద్‌‌ మియాందాద్‌‌ (1930) రికార్డును అధిగమించాడు. రెండో వన్డేలో ఐదో ఓవర్‌‌లో బ్యాక్‌‌వర్డ్‌‌ పాయింట్‌‌లో సింగిల్‌‌ తీసి 19 రన్స్‌‌కు చేరిన కెప్టెన్‌‌ ఈ ఫీట్‌‌ను అందుకున్నాడు. మియాందాద్‌‌ 64 ఇన్నింగ్స్‌‌ల్లో ఈ ఘనత సాధిస్తే.. విరాట్‌‌ కేవలం 34 ఇన్నింగ్స్‌‌ల్లోనే సాధించడం విశేషం. ఈ జాబితాలో మార్క్‌‌ వా (1708), జాక్వస్‌‌ కలిస్‌‌ (1666), రమీజ్‌‌ రాజా (1624), సచిన్‌‌ (1573) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఓవరాల్‌‌గా 2009 చాంపియన్స్‌‌ ట్రోఫీలో విండీస్‌‌పై తొలి వన్డే ఆడిన కోహ్లీ.. కరీబియన్లపై 7 సెంచరీలు, 10 హాఫ్‌‌ సెంచరీలు సాధించాడు.

స్కోరు బోర్డు

ఇండియా: ధవన్‌‌ (ఎల్బీ) కొట్రెల్‌‌ 2, రోహిత్‌‌ (సి) పూరన్‌‌ (బి) ఛేజ్‌‌ 18, కోహ్లీ (సి) రోచ్‌‌ (బి) బ్రాత్‌‌వైట్‌‌ 120, రిషబ్‌‌ (బి) బ్రాత్‌‌వైట్‌‌ 20, శ్రేయస్‌‌ (బి) హోల్డర్‌‌ 71, జాదవ్‌‌ (రనౌట్‌‌) 16, జడేజా (నాటౌట్‌‌) 16, భువనేశ్వర్‌‌ (సి) రోచ్‌‌ (బి) బ్రాత్‌‌వైట్‌‌ 1, షమీ (నాటౌట్‌‌) 3; ఎక్స్‌‌ట్రాలు: 12, మొత్తం: 50 ఓవర్లలో 279/7.

వికెట్లపతనం: 1–2, 2–76, 3–101, 4–226, 5–250, 6–258, 7–262. బౌలింగ్‌‌: కొట్రెల్‌‌ 10–0–49–1, రోచ్‌‌ 7–0–54–0, హోల్డర్‌‌ 9–0–53–1, థామస్‌‌ 4–0–32–0, ఛేజ్‌‌10–1–37–1, బ్రాత్‌‌వైట్‌‌10–0–53–3.

Latest Updates