జోరు సాగాలె ..,మరో విజయంపై ఇండియా గురి

న్యూజిలాండ్‌‌తో ఇండియా ఇప్పటిదాకా 13 టీ20లు ఆడితే వరుసగా రెండు మ్యాచ్‌‌ల్లో ఒక్కసారి కూడా నెగ్గలేదు. ఇప్పుడు ఈ రికార్డును మెరుగు పరుచుకోవడంతో పాటు ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో 2-0తో ఆధిక్యం సాధించే అవకాశం కోహ్లీసేన ముందుంది. చిన్న గ్రౌండ్‌‌లో ఫస్ట్​ ఫైట్​లో పెద్ద టార్గెట్‌‌ను ఈజీగా ఛేజ్‌‌ చేసిన కోహ్లీసేన నేడు జరిగే సెకండ్‌‌ టీ20లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తోంది..!  భారీ సంఖ్యలో హాజరవుతున్న ఇండియన్‌‌ ఫ్యాన్స్‌‌తో ఈడెన్‌‌ పార్క్‌‌ స్టేడియం బ్లూ జెర్సీలు.. త్రివర్ణ పతాకాలతో కళకళలాడుతుండగా..  మరో రీసౌండ్‌‌ విక్టరీతో వారికి రిపబ్లిక్‌‌ డే కానుక ఇవ్వాలని కోరుకుంటోంది.!  మరి, కోహ్లీసేన గెలుపు జెండా ఎగరకుండా కివీస్‌‌ అడ్డుకుంటుందా?

ఆక్లాండ్‌‌:  ఆరు వారాల లాంగ్‌‌ టూర్‌‌ను భారీ విజయంతో ఆరంభించిన టీమిండియా మరో విజయంపై కన్నేసింది. సిరీస్‌‌ ఆధిక్యాన్ని డబుల్‌‌ చేసుకోవడమే లక్ష్యంగా ఆదివారం ఇక్కడి ఈడెన్‌‌ పార్క్‌‌లో జరిగే సెకండ్‌‌ టీ20లో బరిలోకి దిగుతోంది.  ఈ మ్యాచ్‌‌లో నెగ్గి 2–0తో లీడ్‌‌లోకి వస్తే.. మిగతా మూడింటిలో ఒక్కటి గెలిచినా సిరీస్‌‌ను ఖాతాలో వేసుకోవచ్చు. అప్పుడు ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడంతో పాటు మరింత స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇండియాకు ఉండనుంది. అయితే, అది అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ మధ్య అన్ని ఫార్మాట్లలో తడబడుతున్న కివీస్‌‌ గత మ్యాచ్‌‌లో ఊహించినదానికంటే మెరుగ్గానే ఆడింది. ముఖ్యంగా బ్యాటింగ్‌‌లో ఇండియాను మ్యాచ్‌‌ చేసిందనే చెప్పాలి. అయితే, ఇరు జట్లకు మధ్య తేడా జస్‌‌ప్రీత్‌‌ బుమ్రానే. 18, 20వ ఓవర్లలో అతను 16 రన్స్‌‌ మాత్రమే ఇవ్వకుంటే ప్రత్యర్థి స్కోరు 220 పైచిలుకు ఉండేది. ఛేజింగ్‌‌లో తిరుగులేని ఇండియా ముందు ఎంత పెద్ద స్కోరున్నా తక్కువే అనిపించినా.. అన్ని రోజులు మనవే కావు. ఒకటి రెండు మంచి బంతులు పడి వికెట్లు కోల్పోతే రిజల్ట్‌‌ మారిపోతుంది. అందువల్ల  చిన్న గ్రౌండ్‌‌లో  ప్రత్యర్థి మరోసారి భారీ చేయకుండా మన బౌలర్లు ఈ సారి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. బుమ్రా మినహాయిస్తే గత మ్యాచ్‌‌లో ఇండియా బౌలింగ్‌‌ తేలిపోయింది.  షమీ (4 ఓవర్లలో 0/53), శార్దుల్‌‌ ఠాకూర్‌‌ (3 ఓవర్లో 1/ 44) బౌలింగ్‌‌ను కివీస్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ ఉతికేశారు. వారి పేస్‌‌ను యూజ్‌‌ చేసుకొని బౌండ్రీలు కొట్టారు.  సీనియర్‌‌ పేసర్‌‌ షమీ పుంజుకుంటాడని ఆశిస్తున్న మేనేజ్‌‌మెంట్‌‌ ఠాకూర్‌‌ ప్లేస్‌‌లో నవ్‌‌దీప్‌‌ సైనీని బరిలోకి దించే ఆలోచనలో ఉంది. అయితే, సైనీ ఎక్స్‌‌ట్రా పేస్‌‌తో  చిన్న గ్రౌండ్‌‌లో మరిన్ని రన్స్‌‌ వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఫస్ట్‌‌ టీ20లో ఐదు ఓవర్లలో 42 రన్స్‌‌ ఇచ్చి రెండు వికెట్లు తీసిన జడేజా, దూబే నుంచి మేనేజ్‌‌మెంట్‌‌ మరింత మెరుగైన పెర్ఫామెన్స్‌‌ ఆశిస్తోంది.   ఇక, బ్యాటింగ్‌‌లో ఇండియాకు తిరుగులేదు. సూపర్‌‌ ఫామ్‌‌లో ఉన్న రాహుల్‌‌ కీపింగ్‌‌ బాధ్యతలు కూడా తీసుకొని జట్టుకు మరింత బలం చేకూర్చగా.. ఫినిషర్‌‌గా శ్రేయస్‌‌ అయ్యర్‌‌ దూకుడు ముచ్చట గొలుపుతోంది. ఛేజింగ్‌‌లో కోహ్లీ జోరు గురించి చెప్పాల్సిన పనిలేదు. రోహత్‌‌  ఒక్కసారి టచ్‌‌లోకి వస్తే అతడిని ఆపడం ఎవరి తరం కాబోదు.

పొరపాట్లను సరిదిద్దుకుంటేనే..

తొలి పోరులో  భారీ స్కోరును కాపాడుకోలేకపోయిన న్యూజిలాండ్‌‌.. రెండు రోజుల కింద చేసిన పొరపాట్లను సరిదిద్దుకోని కోహ్లీసేనపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. గత మ్యాచ్​ ఫలితం ఎలా ఉన్న.. ఇటీవల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కెప్టెన్‌‌ కేన్‌‌ విలియమ్సన్‌‌, రాస్‌‌ టేలర్‌‌ ఫామ్‌‌లోకి రావడం ఆ జట్టు బ్యాటింగ్‌‌ బలాన్ని మరింత పెంచింది. టాపార్డర్‌‌లో మన్రో, గప్టిల్‌‌ తెచ్చిన ఊపును వీళ్లిద్దరూ అందుకున్నా.. అది చివరి వరకూ కొనసాగకపోవడమే కివీస్‌‌ను దెబ్బకొట్టింది.  బ్యాటింగ్‌‌లో ఫెయిలైన గ్రాండ్‌‌హోమ్‌‌, టిమ్‌‌ సీఫర్ట్‌‌ ఈసారి రాణించాలని హోమ్‌‌టీమ్‌‌ కోరుకుంటోంది. అయితే, పవర్‌‌ప్లేను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు కేన్‌‌ ఓపెనింగ్‌‌ రావాలన్న ఆలోచన ఆతిథ్య శిబిరంలో ఉన్నప్పటికీ.. శుక్రవారం గప్టిల్‌‌, మన్రో ఇచ్చిన మెరుపు ఆరంభం దృష్ట్యా  ఈ మ్యాచ్‌‌లో బ్యాటింగ్‌‌ ఆర్డర్‌‌లో కానీ, ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో కాని మార్పులు ఉండకపోవచ్చు. అయితే, ఎంత భారీ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత బౌలర్లదే. కోహ్లీసేన పదునైన బ్యాటింగ్‌‌ను అడ్డుకోవాలంటే కివీస్‌‌ బౌలర్లు కూడా మెరుగవ్వాల్సి ఉంది.

Latest Updates