వీసాల పేరుతో మోసం : అమెరికాలో ముగ్గురు ఇండియన్స్ అరెస్ట్

వాషింగ్టన్‌: అమెరికాలో ఫేక్ వీసాలు ఇప్పిస్తున్న ముగ్గురు ఇండియన్స్ ను అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. హెచ్‌1-బీ వీసాల పేరుతో ఈ వీసాలు ఇప్పిస్తున్న కిశోర్‌ దత్తపురం, కుమార్‌ అశ్వపతి, సంతోశ్ గిరి అనే వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. వీసా దరఖాస్తులో భాగంగా ఐ-129 అనే పిటిషన్‌ ను అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్‌ విభాగానికి సమర్పించాల్సి ఉంటుంది. అందులో అభ్యర్థి చేయబోయే ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలను పొందుపర్చాలి. అయితే ఈ ముగ్గురు భారతీయులు.. లేని ఉద్యోగాల్ని ఉన్నట్లుగా చూపించి లాభం పొందాలని చూశారని అక్కడి పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇతర కంపెనీలతో పోటీ పడే క్రమంలో ప్రయోజనం పొందడం కోసమే వారు ఈ పని చేశారని తెలిపారు.

ఈ క్రమంలో వారు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి థర్డ్‌ పార్టీలను కూడా ఆశ్రయించినట్లు పోలీసులు పిటిషన్‌ లో తెలిపారు. నానోసిమాంటిక్స్ అనే కంపెనీని స్థాపించి ఐటీ, సాఫ్ట్ వేర్‌ కంపెనీలకు ఉద్యోగులను సమకూర్చే ఏజెన్సీగా వారు నమోదు చేసుకున్నారన్నారు. కానీ నిజానికి వారు విదేశీయులను ఇతర పనుల్లో చేర్చుతున్నారని తెలిపారు. ప్రభుత్వ తనిఖీల నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా అభ్యర్థులకు శిక్షణనిస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో కొంతమంది బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులు జమ చేసి, ఫేక్ స్టేట్ మెంట్స్ కూడా సృష్టించారన్నారు. నిందితులు మాత్రం పోలీసుల ఆరోపణల్ని తోసిపుచ్చారు. నిందితుడు కిశోర్‌ శాంటా క్లారాలో నివాసముంటుండగా.. కుమార్‌ ఆస్టిన్‌ లో, సంతోష్‌ శాన్‌ జోస్‌ లో నివసిస్తున్నారు. ప్రస్తుతం వీరు బెయిల్‌ పై బయటకు వచ్చారు. తర్వాత విచారణ కోసం మే 13న కోర్టులో హాజరుకానున్నారు. ఈ కేసులో దోషులుగా తేలితే నిందితులకు పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.2,50,000 అమెరికన్‌ డాలర్ల ఫైన్ విధించే అవకాశం ఉందని తెలిపారు అమెరికా పోలీసులు.

Latest Updates