మూడేళ్లలో 3 లక్షల జాబ్స్‌‌ : కేటీఆర్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు:  ఎంతో మందికి ఉపాధినిచ్చే ఎలక్ర్టానిక్స్ మానుఫ్యాక్చరింగ్ రంగాన్ని  ప్రోత్సహించడానికి మరింత కృషి చేస్తామని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌‌ ప్రకటించారు. ఈ రంగంలో వచ్చే నాలుగేళ్లలో మూడు లక్షల ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ప్రముఖ ఐటీ హార్డ్‌‌వేర్‌‌ కంపెనీ ఇంటెల్‌‌ హైదరాబాద్‌‌లో ఏర్పాటు చేసిన కొత్త డిజైన్‌‌, ఇంజనీరింగ్‌‌ సెంటర్‌‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సెమీ కండక్టర్‌‌, స్టార్టప్‌‌, ఎలక్ట్రానిక్స్‌‌ రంగంలోని డిజైనర్లకు సాయపడటానికి వచ్చే ఏప్రిల్‌‌లో టీ వర్క్స్‌‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌‌లో అన్ని వసతులు, ప్రతిభావంతులు ఉండటం వల్ల సాఫ్ట్‌‌వేర్‌‌, హార్డ్‌‌వేర్‌‌, సెమీ కండక్టర్‌‌, ఎలక్ట్రానిక్స్‌‌ కంపెనీలు ఇక్కడ ఆర్ అండ్‌‌ డీ సెంటర్లను, డిజైన్‌‌ సెంటర్లను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.

ఇదివరకే గూగుల్‌‌, మైక్రోసాఫ్ట్‌‌, అమెజాన్‌‌ వంటి ఎన్నో ప్రముఖ కంపెనీలు తమ ఆఫీసులను, ఆర్‌‌ అండ్‌‌ డీ సెంటర్లను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరిన్ని కంపెనీలతోనూ చర్చలు జరుగుతున్నాయని కేటీఆర్‌‌ వెల్లడించారు. హైదరాబాద్‌‌లో గత ఐదేళ్లలో ఎలక్ట్రానిక్స్‌‌రంగం 30 వేల మందికి ఉపాధి కల్పించిందని మంత్రి ప్రకటించారు. తాజాగా చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌‌ కంపెనీ స్కైవర్త్‌‌ హైదరాబాద్‌‌లో ప్లాంటు స్థాపనకు ఒప్పందం చేసుకుందని ప్రకటించారు. ఇందుకోసం దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో   ప్లాంటును నిర్మిస్తుందని తెలిపారు. ఇలాంటి కంపెనీలను ప్రోత్సహించడానికి ఎలక్ట్రానిక్​ క్లస్టర్లను కూడా ఆమోదించామని ప్రకటించారు.

ఎక్సెస్‌‌స్కేల్‌‌ కంప్యూటింగ్‌‌ సేవలు అందిస్తాం..

ఈ సందర్భంగా ఇంటెల్‌‌ చీఫ్‌‌ ఆర్కిటెక్ట్‌‌, సీనియర్‌‌ వైస్‌‌–ప్రెసిడెంట్‌‌ కోడూరి రాజా మాట్లాడుతూ ‘‘గత 50 ఏళ్లుగా కోట్లాది మంది ప్రజలకు ఇంటెల్‌‌ కంప్యూటర్‌‌ శక్తిని అందించింది. తద్వారా మన పనులను మరింత సులభతరంగా మార్చింది. ఈ సెంటర్‌‌లో ఎక్సెస్‌‌స్కేల్‌‌ కంప్యూటింగ్‌‌ నిర్వహిస్తాం. ఇండియాలో తొలిసారిగా ఈ సేవలను ఇక్కడి నుంచే అందిస్తాం’’ అని చెప్పారు. భారీ సైజులో డేటా ఆపరేషన్స్‌‌ నిర్వహించడానికి, వైడ్‌‌ అప్లికేషన్స్‌‌ కోసం డేటాను ఎనలైజ్‌‌ చేయడాన్ని ఎక్సెస్‌‌స్కేల్‌‌ కంప్యూటింగ్‌‌ అంటారు. ఈ కేంద్రంలో హార్డ్‌‌వేర్‌‌, సాఫ్ట్‌‌వేర్‌‌ స్టార్టప్‌‌ల కోసం ఇంక్యుబేషన్‌‌ సెంటర్‌‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇంటెల్‌‌ ఇండియా మేకర్‌‌ ల్యాబ్‌‌ను కూడా నెలకొల్పుతామని రాజా వెల్లడించారు. ఇంటెల్‌‌ ఇండియా కంట్రీహెడ్‌‌ నివృతి రాయ్‌‌ మాట్లాడుతూ ‘‘గత 20 ఏళ్లుగా మా కంపెనీ ఇండియాలో ఆర్‌‌ అండ్‌‌ డీ కోసం చాలా ఖర్చు చేస్తోంది. ఫలితంగా క్లౌడ్‌‌, క్లయింట్‌‌, గ్రాఫిక్స్‌‌, ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌‌, 5జీ, అటానమస్‌‌ సిస్టమ్స్‌‌లో ఎంతో ప్రగతి సాధించాం.

హైదరాబాద్‌‌ ఆర్ అండ్‌‌ డీ సెంటర్‌‌తో మరిన్ని కొత్త టెక్నాలజీలను తయారు చేయవచ్చు. కమ్యూనికేషన్‌‌ టెక్నాలజీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించవచ్చు. ఈ నగరంలో అన్ని వసతులు, ట్యాలెంట్‌‌ పూల్‌‌ ఉంది కాబట్టి మా డిజైన్‌‌ సెంటర్‌‌ను ఇక్కడ పెట్టాలని నిర్ణయించాం’’ అని వివరించారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌‌ రంజన్‌‌ మాట్లాడుతూ ఇంటెల్‌‌ తొలిసారిగా ఇక్కడ ఎక్సెస్‌‌స్కేల్‌‌ కంప్యూటింగ్‌‌ నిర్వహిస్తోందని తెలిపారు. దీని ఏర్పాటు వల్ల 1,500 మందికిపైగా ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఇంటెల్‌‌ సాయంతో హైదరాబాద్‌‌లో బ్లాక్‌‌చెయిన్‌‌ ట్రేనింగ్‌‌ సెంటర్‌‌ కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. దాదాపు మూడు లక్షల చదరపు అడుగుల్లో, ఆరు అంతస్తుల్లో నిర్మించిన ఈ ఆర్‌‌ అండ్‌‌ డీ సెంటర్‌‌లో 1,500 మంది పనిచేస్తారు. 40 వేల చదరపు అడుగుల్లో ల్యాబ్స్‌‌ను ఏర్పాటు చేశారు.

Latest Updates